IND vs BAN Nitish Kumar: ఢిల్లీలో తెలుగోడి సత్తా.. 12 బంతుల్లో 13 - తదుపరి 22 బాల్స్‌లో 61.. భారత్ తొలిసారి ఇలా
09 October 2024, 21:03 IST
- IND vs BAN 2nd T20 Nitish Kumar Reddy: తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి దుమ్మురేపాడు. బంగ్లాదేశ్‍తో రెండో టీ20లో బ్లాస్టింగ్ హాఫ్ సెంచరీ చేశాడు. తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‍లోనే అర్ధ శతకం సాధించాడు. సూపర్ హిట్టింగ్‍తో అదరగొట్టాడు.
IND vs BAN Nitish Kumar: ఢిల్లీలో తెలుగోడి సత్తా.. 12 బంతుల్లో 13 - తదుపరి 22 బాల్స్‌లో 61.. భారత్ తొలిసారి ఇలా
ఢిల్లీ స్టేడియంలో టీమిండియా మోతమోగించింది. బంగ్లాదేశ్‍తో రెండో టీ20లో ఆరంభంలో తడబడినా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని భారీ స్కోరు చేసింది. ఓ దశలో 5.3 ఓవర్లలో 41 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఆ తరుణంలో తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 74 పరుగులు; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) ధనాధన్ బ్యాటింగ్ చేయడంతో కోలుకుంది. తన తొలి రెండో అంతర్జాతీయ మ్యాచ్‍లోనే అర్ధశకతంతో అదరగొట్టాడు. ముందుగా నిదానంగానే ఆడిన నితీశ్ ఆ తర్వాత జూలు విదిల్చి బంగ్లా బౌలర్లపై విరుచుపడ్డాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాతో నేటి (అక్టోబర్ 9) రెండో టీ20లో హిట్టింగ్ మోత మెగించాడు తెలుగోడు నితీశ్.
రింకూ కూడా.. భారీ స్కోరు
భారత యంగ్ స్టార్ రింకూ సింగ్ (29 బంతుల్లో 53 పరుగులు; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా అర్ధ శతకంతో దుమ్మురేపాడు. నితీశ్, రింకూ వికెట్లు పడినా దూకుడుగానే ఆడుతూ 49 బంతుల్లోనే 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కష్టాల్లో ఉన్న జట్టును ధనాధన్ హిట్టింగ్‍తో పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ రెండో టీ20లో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోరు చేసింది.
టాప్ గేర్‌లో నితీశ్ హిట్టింగ్
నితీశ్ ఈ రెండో టీ20లో తన హిట్టింగ్ సత్తాను ప్రదర్శించాడు. మూడు వికెట్లు అప్పటికే పడడంతో ముందుగా ఆచితూడి ఆడాడు. దీంతో తొలి 12 బంతుల్లో 13 పరుగులే చేశాడు నితీశ్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత జూలు విదిల్చాడు. బంగ్లా బౌలర్లను టాప్ గేర్ హిట్టింగ్‍తో ఎడాపెడా బాదేశాడు. ఆ తర్వాతి 22 బంతుల్లో ఏకంగా 61 పరుగులు సాధించాడు. దీంతో భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. రింకూ సింగ్ కూడా దూకుడుగా ఆడాడు. ఎక్కడా జోరు ఆపలేదు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‍లోనే అర్ధ శకతం బాదాడు. గత టీ20తోనే టీమిండియాలో నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేశాడు.
వరుసగా వికెట్లు
టాస్ ఓడిన భారత్ ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసింది. సంజూ శాంసన్ (10), అభిషేక్ శర్మ (15), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (8) త్వరగా ఔటయ్యారు. ఆ తర్వాత నితీశ్, రింకూ అదరగొట్టారు. 14వ ఓవర్లో నితీశ్, 17వ ఓవర్లో రింకూ ఔటయ్యారు. చివర్లో హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 32 పరుగులు), రియాన్ పరాగ్ (6 బంతుల్లో 15 పరుగులు) దూకుడుగా ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిహాద్ హుసేన్ మూడు, టస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ హమాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. బంగ్లా ముందు 222 పరుగుల లక్ష్యం ఉంది. ఇప్పటికే ఈ మూడు టీ20 సిరీస్‍లో భారత్ తొలి మ్యాచ్ గెలిచింది. ఈ రెండో టీ20 గెలిస్తే.. ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం అవుతుంది.
భారత్ తొలిసారి
బంగ్లాదేశ్‍పై అంతర్జాతీయ టీ20లో తొలిసారి 200 పరుగులు మార్క్ దాటింది భారత్. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‍లో బంగ్లాపై చేసిన 196 పరుగులే ఇప్పటి వరకు హయ్యెస్ట్‌గా ఉన్నాయి. ఇప్పుడు 200 మార్క్ దాటి చరిత్ర సృష్టించింది టీమిండియా.