Team India: బంగ్లాతో టీ20 సిరీస్‍కు టీమిండియా ఎంపిక.. నితీశ్‍కు చోటు.. సెన్సేషనల్ పేసర్‌కు ఛాన్స్.. రుతురాజ్‍కు నిరాశ-india squad for t20 series against bangladesh no place for ruturaj gaikwad and ishan kishan mayank yadav gets first call ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: బంగ్లాతో టీ20 సిరీస్‍కు టీమిండియా ఎంపిక.. నితీశ్‍కు చోటు.. సెన్సేషనల్ పేసర్‌కు ఛాన్స్.. రుతురాజ్‍కు నిరాశ

Team India: బంగ్లాతో టీ20 సిరీస్‍కు టీమిండియా ఎంపిక.. నితీశ్‍కు చోటు.. సెన్సేషనల్ పేసర్‌కు ఛాన్స్.. రుతురాజ్‍కు నిరాశ

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 28, 2024 11:32 PM IST

Indian Squad for Bangladesh T20 Series: బంగ్లాదేశ్‍తో టీ20 సిరీస్‍కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డికి చోటు దక్కింది. ఫామ్‍లో ఉన్నా రుతురాజ్ గైక్వాడ్‍కు నిరాశే ఎదురైంది. ఇషాన్ కిషన్‍కు మళ్లీ ఎదురుదెబ్బే తగిలింది.

Team India: బంగ్లాతో టీ20 సిరీస్‍కు టీమిండియా ఎంపిక.. నితీశ్‍కు చోటు.. సెన్సేషనల్ పేసర్‌కు ఛాన్స్.. రుతురాజ్ నిరాశ
Team India: బంగ్లాతో టీ20 సిరీస్‍కు టీమిండియా ఎంపిక.. నితీశ్‍కు చోటు.. సెన్సేషనల్ పేసర్‌కు ఛాన్స్.. రుతురాజ్ నిరాశ

స్వదేశంలో బంగ్లాదేశ్‍తో ప్రస్తుతం రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది టీమిండియా. కాన్పూర్ వేదికగా రెండో టెస్టు సాగుతోంది. ఈ సిరీస్ తర్వాత టీ20ల్లో బంగ్లాతో భారత్ తలపడనుంది. ఇరు జట్లు మధ్య అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 12 మధ్య మూడు టీ20లు జరగనున్నాయి. ఈ టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ నేడు (సెప్టెంబర్ 28) ప్రకటించింది. 15 మంది ఆటగాళ్లతో టీమ్‍ను వెల్లడించింది. ఆ వివరాలు ఇవే..

నితీశ్‍కు ప్లేస్

ఈ ఏడాది ఐపీఎల్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డికి బంగ్లాతో టీ20 సిరీస్‍లో చోటు దక్కింది. ఈ ఏడాది జూలైలో జింబాబ్వేతో టీ20 సిరీస్‍కు నితీశ్ సెలెక్ట్ అయ్యాడు. అయితే, గాయం వల్ల అతడు తప్పుకున్నాడు. ఇప్పుడు మళ్లీ బంగ్లాదేశ్‍తో టీ20 సిరీస్‍కు నితీశ్‍కు ఛాన్స్ దక్కింది. దీంతో ఈ సిరీస్‍లో భారత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది.

రుతురాజ్‍కు దక్కని అవకాశం

టెస్టు సిరీస్ ఆడుతున్న రెగ్యులర్ ఓపెనర్లు శుభ్‍మన్ గిల్, యశస్వి జైస్వాల్‍కు బంగ్లాతో టీ20 సిరీస్‍కు భారత సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయినా, రుతురాజ్ గైక్వాడ్‍కు చోటు ఇవ్వలేదు. టీమిండియా తరఫున అవకాశం వచ్చినప్పుడల్లా ఆకట్టుకున్న రుతురాజ్‍కు చోటు కల్పించకపోవడంపై అతడి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత్ తరఫున 23 టీ20లు ఆడిన రుతురాజ్ 633 రన్స్ చేశాడు. 39.56 యావరేజ్, 143 స్ట్రైక్ రేట్ ఉన్న అతడికి చోటు ఇవ్వకపోవడం అన్యాయం అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ఇషాన్‍కు మొండిచేయి.. శాంసన్‍, జితేశ్‍కు ఛాన్స్

వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‍కు కూడా ఈ సిరీస్‍లో చోటు దక్కలేదు. రంజీ ట్రోఫీ ఆడకుండా బీసీసీఐ ఆగ్రహానికి గురై సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు ఇషాన్. దాదాపు పది నెలలుగా అతడు టీమ్‍లో లేడు. ఇటీవల దేశవాళీ క్రికెట్ ఆడుతుండటంతో ఇషాన్ మళ్లీ టీమిండియాలోకి వస్తాడనే అంచనాలు వచ్చాయి. అయితే, బంగ్లాతో సిరీస్‍కు సెలెక్టర్లు చోటు ఇవ్వలేదు. ఈ సిరీస్‍లో వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ ఉన్నారు.

పేస్ సంచలనం వచ్చేశాడు

ఐపీఎల్ 2024 సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ మయాంక్ యాదవ్ అదరగొట్టాడు. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు సంధించి దుమ్మురేపాడు. ఓ బంతిని 156.7 కిలోమీటర్ల వేగంతో వేసి రికార్డు సృష్టించాడు. జింబాబ్వేతో సిరీస్‍కే అతడిని తీసుకోవాలనుకుంటే గాయపడ్డాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‍తో సిరీస్‍కు ఎంపికయ్యాడు. తొలిసారి ఈ పేస్ సెన్సేషన్ భారత్‍కు సెలెక్ట్ అయ్యాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా టీమ్‍లోకి తిరిగి వచ్చాడు.

బంగ్లాతో టీ20 సిరీస్‍కు జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‍కు కూడా సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. హర్షిత్ రాణాకు చోటు దక్కింది. అర్షదీప్ సింగ్ కొనసాగాడు. స్పిన్నర్లుగా రవిబిష్ణోయ్, వరుణ్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఆల్‍రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివం దూబే, నితీశ్ ఉన్నారు. యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కొనసాగాడు.

బంగ్లాదేశ్‍తో టీ20 సిరీస్‍కు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్

భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 గ్వాలియర్ వేదికగా అక్టోబర్ 6న, అక్టోబర్ 9న రెండో టీ20 ఢిల్లీలో, మూడో టీ20 హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 12వ తేదీన జరగనున్నాయి.