Nitish Kumar Reddy: అయ్యో నితీశ్.. టీమిండియాకు ఎంపికైన తొలి సిరీస్‍కే దూరం-nithish kumar reddy ruled out from india squad for zimbabwe t20i series shivam dube replaces ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Nitish Kumar Reddy: అయ్యో నితీశ్.. టీమిండియాకు ఎంపికైన తొలి సిరీస్‍కే దూరం

Nitish Kumar Reddy: అయ్యో నితీశ్.. టీమిండియాకు ఎంపికైన తొలి సిరీస్‍కే దూరం

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 26, 2024 10:09 PM IST

Nitish Kumar Reddy: తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి నిరాశ ఎదురైంది. టీమిండియాకు ఎంపికైన తొలి సిరీస్‍కే గాయం వల్ల అతడు దూరమయ్యాడు.

Nitish Kumar Reddy: అయ్యో నితీశ్.. టీమిండియాకు ఎంపికైన తొలి సిరీస్‍కే దూరం
Nitish Kumar Reddy: అయ్యో నితీశ్.. టీమిండియాకు ఎంపికైన తొలి సిరీస్‍కే దూరం (PTI)

అంతర్జాతీయ క్రికెట్‍లో భారత్ తరఫున అరంగేట్రం చేసేందుకు తెలుగు ప్లేయర్, సన్‍రైజర్స్ హైదరాబాద్ స్టార్ నితీశ్ కుమార్ రెడ్డి మరింత కాలం వేచిచూడాల్సిందే. ఇటీవలే టీమిండియాలో అతడికి చోటు దక్కింది. జూలైలో జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‍కు నితీశ్‍ను సెలెక్టర్లు ఇటీవలే ఎంపిక చేశారు. అయితే, గాయం అతడికి నిరాశను మిగిల్చింది. దీంతో ఈ సిరీస్‍ నుంచి నితీశ్ కుమార్ రెడ్డి వైదొలిగాడు. ఈ విషయాన్ని బీసీసీఐ నేడు (జూన్ 26) అధికారికంగా వెల్లడించింది.

నితీష్ ఔట్

ఐపీఎల్ 2024 సీజన్‍లో అద్భుత ప్రదర్శన చేసిన సన్‍రైజర్స్ స్టార్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి తొలిసారి టీమిండియా సెలెక్టర్ల నుంచి ఇటీవలే పిలుపు వచ్చింది. జింబాబ్వేతో ఐదు టీ20 సిరీస్‍కు అతడిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. జట్టును కూడా ప్రకటించారు. అయితే, ఇప్పుడు గాయం వల్ల జింబాబ్వే పర్యటనకు నితీశ్ దూరమయ్యాడు.

దూబేకు చోటు

గాయం వల్ల నితీశ్ కుమార్ రెడ్డి దూరం కాగా ఆ స్థానంలో జింబాబ్వే పర్యటనకు భారత జట్టులో శివం దూబే ఎంపికయ్యాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2024 ఆడుతున్న దూబేను ఈ సిరీస్‍కు నితీశ్ స్థానంలో సెలెక్టర్లు తీసుకున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది.

ఐపీఎల్‍లో నితీశ్ మెరుపులు

ఈ ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఈ సీజన్‍లో 303 రన్స్ చేశాడు. 142.92 స్ట్రైక్‍రేట్‍తో దూకుడు ప్రదర్శించాడు. కీలకమైన సమయాల్లో బ్యాటింగ్‍తో దుమ్మురేపాడు. అలాగే, ఈ సీజన్‍లో 13.1 ఓవర్లు వేసిన నితీశ్ మూడు వికెట్లు కూడా తీశారు. అలాగే, ఈ సీజన్‍కు గాను ఎమర్జింగ్ ప్లేయర్‌గానూ అవార్డు అందుకున్నాడు. దీంతో జింబాబ్వేతో సిరీస్‍కు సెలెక్టర్లు నితీశ్‍ను ఎంపిక చేశారు. అయితే, ఇప్పుడు అతడు గాయం వల్ల సిరీస్‍ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

జింబాబ్వేతో సిరీస్‍కు రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్, సన్‍రైజర్స్ యువ స్టార్ అభిషేక్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ తుషార్ దేశ్‍పాండే కూడా భారత జట్టుకు సెలెక్ట్ అయ్యారు. వీరు ముగ్గురు కూడా ఫస్ట్ టైమ్ టీమిండియాలోకి వచ్చారు. అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు.

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ ఆడుతున్న ఎక్కువ మంది భారత ఆటగాళ్లకు జింబాబ్వే సిరీస్ నుంచి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‍స్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా సహా మిగిలిన వారికి రెస్ట్ ఇచ్చారు. ప్రపంచకప్ ఆడుతున్న ముగ్గురు మాత్రమే జింబాబ్వేతో సిరీస్‍కు ఉన్నారు. రోహిత్ శర్మ గైర్హాజరీలో జింబాబ్వేతో సిరీస్‍లో భారత్‍కు యంగ్ ఓపెనర్ శుభ్‍మన్ గిల్ కెప్టెన్సీ చేయనున్నాడు.

భారత్, జింబాబ్వే మధ్య ఐదు టీ20ల సిరీస్ జూలై 6వ తేదీన మొదలుకానుంది. తొలి టీ20 జూలై 6న హరారే వేదికగా జరగనుంది. జూలై 7న రెండో మ్యాచ్, జూలై 10న మూడో టీ20, జూలై 13న నాలుగో మ్యాచ్ జరగున్నాయి. జూలై 14న జరిగే ఐదో టీ20తో ఈ పర్యటన ముగియనుంది.

జింబాబ్వేతో టీ20 సిరీస్‍కు భారత జట్టు: శుభ్‍మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే

కాాగా, టీ20 ప్రపంచకప్‍ 2024 సెమీఫైనల్‍లో ఇంగ్లండ్‍తో భారత్ తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రేపు (జూన్ 27) రాత్రి 8 గంటల నుంచి గయానా వేదికగా జరగనుంది.

WhatsApp channel