తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ban T20 World Cup: బంగ్లాను చిత్తుచేసిన భారత్.. అలవోకగా గెలుపు.. కుల్దీప్, బుమ్రా అదుర్స్.. సెమీస్‍కు చేరువలో..

IND vs BAN T20 World Cup: బంగ్లాను చిత్తుచేసిన భారత్.. అలవోకగా గెలుపు.. కుల్దీప్, బుమ్రా అదుర్స్.. సెమీస్‍కు చేరువలో..

22 June 2024, 23:42 IST

google News
    • IND v BAN T20 World Cup 2024 Super 8: బంగ్లాదేశ్‍పై భారత్ భారీ విజయం సాధించింది. అన్ని విభాగాల్లో సత్తాచాటి బంగ్లాను చిత్తుచేసింది. భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, బుమ్రా అదరగొట్టారు. ఈ గెలుపుతో సెమీస్‍కు భారత్ చేరువైంది.
IND vs BAN T20 World Cup: బంగ్లాను చిత్తుచేసిన భారత్.. అలవోకగా గెలుపు.. కుల్దీప్, బుమ్రా అదుర్స్.. సెమీస్‍కు చేరువలో..
IND vs BAN T20 World Cup: బంగ్లాను చిత్తుచేసిన భారత్.. అలవోకగా గెలుపు.. కుల్దీప్, బుమ్రా అదుర్స్.. సెమీస్‍కు చేరువలో.. (Surjeet Yadav)

IND vs BAN T20 World Cup: బంగ్లాను చిత్తుచేసిన భారత్.. అలవోకగా గెలుపు.. కుల్దీప్, బుమ్రా అదుర్స్.. సెమీస్‍కు చేరువలో..

IND v BAN T20 World Cup 2024: టీమిండియా మరోసారి ఆల్‍రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపింది. టీ20 ప్రపంచకప్ మెగాటోర్నీలో అజేయ యాత్రను కొనసాగించింది. ముందుగా బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్‍లో అదరగొట్టి బంగ్లాదేశ్‍ను టీమిండియా చిత్తుచిత్తుగా ఓడించింది. అంటిగ్వా వేదిక నేడు (జూన్ 22) జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్-8 గ్రూప్-1 మ్యాచ్‍లో భారత్ 50 పరుగుల భారీ తేడాతో బంగ్లాపై అలవోకగా గెలిచింది. సూపర్-8లోనూ వరుసగా రెండో విజయంతో సెమీస్ ఫైనల్‍కు చేరువైంది. బంగ్లాను దెబ్బకొట్టి భారత్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది.

బంగ్లా పనిపట్టిన కుల్దీప్, బుమ్రా

భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. 4 ఓవర్లలో కేవలం 13 పరుగులకే ఇచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. అర్షదీప్ సింగ్ రెండు, హార్దిక్ పాండ్యా ఓ వికెట్ తీసుకున్నారు. దీంతో 197 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 146 పరుగులకే బంగ్లాదేశ్ పరిమితమైంది.

బంగ్లా కుదేలు

భారీ లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ మొదటి నుంచే చతికిపడింది. ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేయగలిగింది బంగ్లా. లిటన్ దాస్ (13)ను భారత బౌలర్ హార్దిక్ పాండ్యా ఐదో ఓవర్లో ఔట్ చేసి భారత్‍కు బ్రేక్‍త్రూ ఇచ్చాడు. తంజిద్ హసన్ (31 బంతుల్లో 29 పరుగులు), కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంతో (32 బంతుల్లో 40 పరుగులు) నిలిచినా.. వేగంగా ఆడలేకపోయారు. భారీ లక్ష్యం ముందున్నా దూకుడు చూపలేకపోయారు. భారత బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో వేగంగా పరుగులు చేయలేకపోయారు.

కుప్పకూల్చిన కుల్దీప్

భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. బంగ్లాను దెబ్బ తీశాడు. 10వ ఓవర్లో తంజిద్ హసన్‍ను ఔట్ చేసిన కుల్దీప్.. 12న ఓవర్లో తౌహిద్ హృదోయ్ (4) పెవిలియన్‍కు పంపాడు. కాసేపటికే బంగ్లా సీనియర్ ప్లేయర్ షకీబల్ హసన్ (11)ను కూడా కుల్దీప్ ఔట్ చేశాడు. దీంతో 13.3 ఓవర్లలో 98 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యానికి దూరంలో నిలిచింది.

నిలకడగా ఆడిన నజ్ముల్ శాంతోను భారత స్టార్ పేసర్ బుమ్రా 16వ ఓవర్లో ఔట్ చేశాడు. చివర్లో రిషాద్ అలీ (10 బంతుల్లో 24 పరుగులు) మెరిపించినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత మిగిలిన బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు.

హార్దిక్, పంత్, దూబే అదుర్స్

అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు చేసింది. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 50 పరుగులు నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో దుమ్మురేపాడు. చివరి వరకు నిలిచి సూపర్ హిట్టింగ్ చేశాడు. రిషబ్ పంత్ (24 బంతుల్లో 36 పరుగులు; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి అదరగొట్టగా.. శివం దూబే (24 బంతుల్లో 34 పరుగులు; 3 సిక్స్‌లు) రాణించాడు. అంతకు ముందు ఓపెనర్లు కెప్టెన్ రోహత్ శర్మ (11 బంతుల్లో 23 పరుగులు), విరాట్ కోహ్లీ (28 బంతుల్లో 37 పరుగులు) పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్‍లో సూర్యకుమార్ యాదవ్ (6) ఒక్కడే నిరాశపరిచాడు.

భారత బ్యాటర్లు సమిష్టిగా సత్తాచాటడంతో భారీ స్కోరు దక్కింది. ఓ దశలో వికెట్లు పడినా పాండ్యా, దూబే దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు జోరు తగ్గలేదు. పాండ్యా ఆఖరి వరకు నిలిచి ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. అర్ధ శతకంతో మెరిశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ షకీబ్, రషీద్ హొసేన్ తలా రెండు, షకీబల్ హసన్ ఓ వికెట్ తీసుకున్నారు.

సూపర్-8లో తన చివరి మ్యాచ్‍ను ఆస్ట్రేలియాతో టీమిండియా జూన్ 24వ తేదీన ఆడనుంది. సెయింట్ లూసియా వేదికగా ఈ కీలక మ్యాచ్ జరగనుంది.

తదుపరి వ్యాసం