IND vs BAN: దుమ్మురేపిన హార్దిక్ పాండ్యా.. పంత్, దూబే మెరుపులు.. బంగ్లాను దంచికొట్టిన భారత్.. భారీ టార్గెట్
IND vs BAN T20 World Cup 2024: బంగ్లాదేశ్‍ను భారత బ్యాటర్లు చితక్కొట్టారు. హార్దిక్ పాండ్యా అర్ధ శకతంతో దుమ్మురేపాడు. దీంతో టీమిండియాకు భారీ స్కోరు దక్కింది.
India vs Bangladesh: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. బంగ్లాదేశ్‍తో నేటి (జూన్ 22) సూపర్ 8 మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ దుమ్మురేపింది. అంటిగ్వా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‍లో 20 ఓవర్లలో టీమిండియా 5 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అజేయ అర్ధ శకతంతో దుమ్మురేపగా.. మిగిలిన బ్యాటర్లు కూడా రాణించారు. దీంతో రోహిత్ సేనకు భారీ స్కోరు దక్కింది. బంగ్లాదేశ్ ముందు ఏకంగా 197 పరుగుల లక్ష్యం ఉంది.
రోహిత్, కోహ్లీ అదిరే ఆరంభం
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగింది భారత్. ఓపెనర్లు రోహిత్ శర్మ (11 బంతుల్లో 23 పరుగులు; 3 ఫోర్లు, ఓ సిక్స్) విరాట్ కోహ్లీ (28 బంతుల్లో 37 పరుగులు; 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆరంభించారు. ధనాధన్ హిట్టింగ్ చేశారు. ముఖ్యంగా రోహిత్ దుమ్మురేపాడు. అయితే, నాలుగో ఓవర్లో భారీ షాట్‍కు యత్నించి బంగ్లా స్పిన్నర్ షకీబల్ హసన్ బౌలింగ్‍లో క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ జోరు కొనసాగించాడు. దీంతో ఆరు ఓవర్లలోనే భారత్ 53 పరుగులు చేసింది. అయితే, 9వ ఓవర్లో తంజిమ్ హసన్ బౌలింగ్‍లో విరాట్ బౌల్డ్ అయ్యాడు.
మళ్లీ మెరిసిన పంత్
ఈ ప్రపంచకప్‍లో సూపర్ ఫామ్‍లో ఉన్న భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మరోసారి దుమ్మురేపాడు. 24 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. నెమ్మదిగా మొదలుపెట్టినా ఆ తర్వాత తన మార్క్ హిట్టింగ్ చేశాడు పంత్. 4 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. అయితే, తన ఫస్ట్ బాల్‍కు సిక్స్ కొట్టిన సూర్యకుమార్ యాదవ్ (6) తర్వాతి బంతికే ఔటయ్యాడు. పంత్ మాత్రం దూకుడు కొనసాగించాడు. అయితే, 12వ ఓవర్లో రివర్స్ స్వీప్ ఆడి గత మ్యాచ్‍లాగే క్యాచ్ ఔటయ్యాడు పంత్. దీంతో 108 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కాస్త ఒత్తిడిలో టీమిండియా పడింది.
పాండ్యా, దూబే ధనాధన్
భారత బ్యాటర్లు శివం దూబే, హార్దిక్ పాండ్యా ఆ తర్వాత దుమ్మురేపారు. తొలుత కాస్త నిలకడగా ఆడినా ఆ తర్వాత జోరు పెంచారు. శివం దూబే 24 బంతుల్లో 34 పరుగులతో రాణించాడు. ఒక్క ఫోర్ కొట్టకుండా 3 సిక్స్‌లు బాదాడు. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన దూకుడు కొనసాగించాడు. 27 బంతుల్లోనే అజేయంగా 50 పరుగులు చేసి అర్ధ శకతంతో సత్తాచాటాడు హార్దిక్. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో హార్దిక్ దుమ్మురేపాడు. సూపర్ హిట్టింగ్‍తో అదరగొట్టాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దీంతో 16.4 ఓవర్లలో భారత్ 150 పరుగులు దాటింది. శివమ్ దూబే 18వ ఓవర్లో ఔటైనా.. హార్దిక్ పాండ్యా మాత్రం దూకుడు కొనసాగించాడు. బౌండరీలతో బంగ్లాదేశ్ బౌలర్లను బెంబేలెత్తించాడు. చివరి బంతికి హాఫ్ సెంచరీ చేరాడు హార్దిక్. దీంతో భారత్‍కు 196 పరుగులు భారీ స్కోరు దక్కింది.
బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్, రషీద్ హొసేన్ చెరో రెండు వికెట్లు తీయగా.. షకీబల్ హసన్‍కు ఓ వికెట్ దక్కింది.