IND vs BAN 1st T20: తొలి టీ20లో ఓపెనర్లుగా ఆ ఇద్దరే: కన్ఫర్మ్ చేసిన భారత కెప్టెన్ సూర్య.. తుది జట్టు ఎలా ఉండొచ్చంటే!
05 October 2024, 21:13 IST
- India vs Bangladesh 1st T20: బంగ్లాదేశ్‍తో తొలి టీ20లో టీమిండియా తరఫున ఓపెనర్లుగా ఎవరు ఉంటారన్న ఉత్కంఠకు దాదాపు తెరపడింది. ఈ విషయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఓపెనర్లుగా ఎవరు ఉండనున్నారో తెలిపారు. ఈ మ్యాచ్‍లో భారత తుది జట్టు ఎలా ఉండే అవకాశం ఉందో ఇక్కడ చూడండి.
IND vs BAN 1st T20: తొలి టీ20లో ఓపెనర్లుగా ఆ ఇద్దరే: కన్ఫర్మ్ చేసిన భారత కెప్టెన్ సూర్యకుమార్.. తుది జట్టు ఎలా ఉండొచ్చంట
స్వదేశంలో బంగ్లాదేశ్‍పై భారత్ టెస్టు సిరీస్ క్లీన్‍స్వీప్ చేసేసింది. 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. రెండున్నర రోజులు వృథా అయినా రెండో టెస్టులో అద్భుతం చేసి విజయం సాధించింది టీమిండియా. ఇక బంగ్లాదేశ్‍తో టీ20 పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‍ల సిరీస్‍లో భాగంగా భారత్, బంగ్లా మధ్య తొలి టీ20 రేపు (అక్టోబర్ 6) జరగనుంది. గ్వాలియర్ వేదికగా ఈ పోరు సాగనుంది.
ఓపెనర్లుగా వారే..
బంగ్లాదేశ్‍తో ఎంపిక చేసిన టీమిండియాలో యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఒకడే రెగ్యులర్ ఓపెనర్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు గుడ్‍బై చెప్పేశాడు. శుభ్‍మన్ గిల్, యశస్వి జైస్వాల్‍కు ఈ టీ20 సిరీస్ నుంచి సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు. దీంతో బంగ్లాదేశ్‍తో సిరీస్‍లో ఓపెనర్లుగా ఎవరు ఉంటారనే టెన్షన్ నెలకొంది. ఈ తరుణంలో తొలి టీ20లో ఓపెనర్లు ఎవరో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చేశాడు.
బంగ్లాదేశ్‍తో తొలి టీ20లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా ఉంటారని సూర్య నేడు (అక్టోబర్ 5) కన్ఫర్మ్ చేసినట్టు పీటీఐ వెల్లడించింది. ఆ ఇద్దరే భారత బ్యాటింగ్ మొదలుపెడతారని సూర్య స్పష్టం చేశాడు. శాంసన్ సాధారణంగా మిడల్ఆర్డర్‌లో బరిలోకి దిగుతాడు. ఐపీఎల్‍లో మూడోస్థానంలో వస్తాడు. అప్పుడప్పుడూ ఓపెనింగ్ చేస్తుంటాడు. అయితే, ఇప్పుడు బంగ్లాతో సిరీస్‍లో అభిషేక్‍తో కలిసి సంజూ ఓపెనింగ్‍కు రానున్నాడు. భారత్ తరఫున ఓపెనర్‌గా ఆడడం సంజూకు ఇదే తొలిసారి.
మయాంక్ అరంగేట్రం!
బంగ్లాదేశ్‍తో టీ20 ద్వారా యంగ్ సెన్సేషనల్ పేసర్ మయాంక్ యాదవ్.. భారత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‍లో లక్నో తరఫున బరిలోకి దిగిన మయాంక్ గంటలకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధించి ఆశ్చర్యపరిచాడు. అంత వేగంతోనూ మంచి లైన్, లెంగ్త్ మెయింటెన్ చేశాడు. బంగ్లాతో మ్యాచ్‍లో తుదిజట్టులో అతడికి చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అతడు వద్దనుకుంటే ఆ స్థానంలో హర్షిత్ రాణాకు చోటు దక్కొచ్చు.
దూబే ఔట్
ఈ తొలి టీ20లో కెప్టెన్ సూర్యకుమార్ మూడో స్థానంలో బ్యాటింగ్‍కు వస్తాడు. రియాన్ పరాగ్‍కు చోటు దక్కనుంది. హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ కూడా ఉండడం ఖాయమే. స్పిన్నర్ రవి బిష్ణోయ్‍కు ప్లేస్ దక్కనుంది. జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‍కు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో అర్షదీప్ సింగ్ ప్రధాన పేసర్‌గా ఉండనున్నాడు. స్టార్ ఆల్‍రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడం ఖాయం కావటంతో ఇద్దరు పేసర్లతోనే భారత్ ఆడనుంది. కాగా, ఈ సిరీస్ నుంచి శివం దూబే ఔట్ అయ్యాడు. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు ఆ ప్లేస్‍లో చోటు దక్కింది.
బంగ్లాతో తొలి టీ20కి భారత తుదిజట్టు (అంచనా): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, అర్షదీప్ సింగ్
భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 రేపు (అక్టోబర్ 6) సాయంత్రం 7 గంటలకు మొదలుకానుంది. స్పోర్ట్స్18 నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్, జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.