IND vs AFG: అప్ఘాన్‌పై చివరగా రెండు సూపర్ ఓవర్లు ఆడి గెలిచిన ఇండియా -సూపర్ 8 మ్యాచ్‌లో రోహిత్ సేనకు గట్టి పోటీ?
20 June 2024, 8:13 IST
IND vs AFG: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రౌండ్ తొలి మ్యాచ్‌లో గురువారం (నేడు) తొలి మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య గత ఏడాది జనవరిలో జరిగిన చివరి మ్యాచ్ రెండు సూపర్ ఓ వర్లలో ఫలితం తేలడం గమనార్హం.
ఇండియా వర్సెస్ అప్ఘనిస్తాన్
IND vs AFG: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 పోరులో గురువారం (నేడు) టీమిండియా తొలి పరీక్షను ఎదుర్కొనుంది. సూపర్ 8 రౌండ్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. బార్బడోస్‌లోని కింగ్‌స్టన్ ఓవల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
ఓటమి లేకుండా...
టీమిండియా ఒక్క ఓటమి లేకుండా సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా మూడింటిలో విజయం సాధించింది. మరోవైపు అప్ఘనిస్థాన్ కూడా అంచనాలకు మించి రాణించి సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది. న్యూజిలాండ్ లాంటి మేటి జట్టుకు షాకిచ్చి ముందడుగు వేసింది. నేటి మ్యాచ్‌లో టీమిండియాకు అప్ఘాన్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతోన్నారు.
బలాబలాలు ఎలా ఉన్నాయంటే?
ఇప్పటివరకు ఆప్ఘనిస్తాన్‌తో టీమిండియా ఎనిమిది టీ20 మ్యాచులు ఆడింది. ఇందులో ఏడు సార్టు టీమిండియా విజయంసాధించగా...ఓ మ్యాచ్ రద్ధయింది. టీ20ల్లో టీమిండియాపై ఒక్కసారి కూడా ఆప్ఘనిస్థాన్ గెలవలేదు. .చివరగా ఈ ఏడాది జనవరిలో బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడింది. ఈ సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకున్నది.
మ్యాచ్ టై...
ఈ సిరీస్‌లో బెంగళూరు వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా నాటకీయ పరిణామాల మధ్య విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం టీమిండియా రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సివచ్చింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 213 పరుగులు చేసింది. ఆప్ఘనిస్తాన్ కూడా ఇరవై ఓవర్లలో సరిగ్గా 213 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా మారింది.
రెండు సూపర్ ఓవర్లు...
ఆ తర్వాత తొలి సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అప్ఘన్ పదహారు పరుగులు చేసింది. టీమిండియా కూడా పదహారు పరుగులే చేయడంలో మ్యాచ్ రెండో సూపర్ ఓవర్‌కు దారితీసింది. రెండో సూపర్ ఓవర్‌లో టీమిండియా 12 పరుగులు చేయగా...ఆప్ఘనిస్తాన్ ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌లో ఓటమి పాలైంది.
ఎలాంటి మార్పులు లేకుండా...
కాగా వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్‌లో తుది జట్టులో టీమిండియా ఎలాంటి మార్పులు చేయడం లేదని సమాచారం. ఆప్ఠనిస్థాన్ టీమ్ కూడా తుది జట్టులో మార్పులు లేకుండా బరిలో దిగుతోన్నట్లు సమాచారం.
బ్యాటింగ్‌కు అనుకూలం
బార్బడోస్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. ఈ పిచ్‌పై లీగ్ దశలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 200లకుపైగా పరుగులు సాధించింది.
భారత జట్టు అంచనా
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, బుమ్రా
ఆప్ఘనిస్తాన్ టీమ్ అంచనా
రహ్మతుల్లా గుర్భాజ్, ఇబ్రహీం జర్ధాన్, రషీద్ ఖాన్, గుల్‌బదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, నబీ, నజీబుల్లా జద్రాన్, కరీమ్ జనత్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫరూఖీ