Rohit Sharma on Dravid: కోచ్‍గా కొనసాగాలని ద్రవిడ్‍ను అడిగా.. కానీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
04 June 2024, 23:09 IST
- Rohit Sharma on Dravid: టీమిండియా హెడ్ కోచ్‍గా కొనసాగాలని రాహుల్ ద్రవిడ్‍ను తాను కోరానని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. టీ20 ప్రపంచకప్‍లో తొలి మ్యాచ్ ఆడే ముందు మీడియా సమావేశంలో అతడు మాట్లాడాడు.
Rohit Sharma on Dravid: కోచ్‍గా కొనసాగాలని ద్రవిడ్‍ను అడిగా.. కానీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
Rohit Sharma on Dravid: టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత టీమిండియా హెడ్‍కోచ్ స్థానం నుంచి దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తప్పుకోనున్నారు. ఈ ప్రపంచకప్‍లో రేపు (జూన్ 5) తన పోరును భారత జట్టు మొదలుపెట్టనుంది. అమెరికా న్యూయార్క్‌లోని నసావు స్టేడియంలో ఐర్లాండ్‍తో రేపు మ్యాచ్ ఆడనుంది భారత్. ఈ మ్యాచ్‍కు ముందు నేడు (జూన్ 4) మీడియాతో మాట్లాడాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ తరుణంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నిష్క్రమణ గురించి మాట్లాడాడు.
కొనసాగాలని కోరా
హెడ్‍కోచ్‍గా కొనసాగాలని తాను రాహుల్ ద్రవిడ్‍ను కోరినట్టు రోహిత్ శర్మ చెప్పాడు. కానీ ఆయన అందుకు అంగీకరించలేదనట్టుగా వెల్లడించాడు. “కొనసాగాలని ద్రవిడ్‍ను ఒప్పించేందుకు నేను ప్రయత్నించా. అయితే అందుకు ఆయన సిద్ధంగా లేరు. ద్రవిడ్ దిశానిర్దేశంలో ఆడడాన్ని చాలా ఆస్వాదించా. ఆయన మా అందరికీ రోల్ మోడల్. ఆయన ఏం సాధించారో మనకు తెలుసు. ఆయన కెరీర్‌లో చాలా అంకితభావం చూపారు” అని రోహిత్ శర్మ చెప్పాడు.
టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత హెడ్‍కోచ్‍గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియనుంది. అయితే, తాను మళ్లీ కోచ్ స్థానం కోసం దరఖాస్తు చేసుకోబోనని ద్రవిడ్ సోమవారం (జూన్ 3) క్లారిటీ ఇచ్చారు. కోచ్‍గా కొనసాగే ఉద్దేశం లేదని చెప్పేశారు.
పిచ్‍పై హింట్ ఇచ్చిన రోహిత్
ఐర్లాండ్‍తో రేపు (జూన్ 5) జరిగే మ్యాచ్‍తో టీ20 ప్రపంచకప్ 2024 పోరును భారత్ ప్రారంభించనుంది. అయితే, ఈ మ్యాచ్ జరిగే న్యూయార్క్ స్టేడియం పిచ్ స్లోగా ఉంటుందనేలా రోహిత్ శర్మ మాట్లాడాడు. ఈ పిచ్‍పై 140 -150 పరుగులే మంచి స్కోరు అని చెప్పాడు. ఈ స్టేడియంలో శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య జరిగి మ్యాచ్ కూడా లోస్కోరింగ్‍గా జరిగింది.
మ్యాచ్‍లు జరుగుతున్న సమయంలో అభిమానులు ఎవరూ గ్రౌండ్‍లోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించవద్దని రోహిత్ శర్మ కోరాడు. ప్లేయర్ల సెక్యూరిటీ చాలా ముఖ్యమని, ఆయా దేశాల్లో ఉన్న నిబంధనలను తప్పకుండా పాటించాలని అభిమానులను కోరాడు. బంగ్లాదేశ్‍తో టీమిండియా వామప్ మ్యాచ్‍లో ఓ అభిమాని రోహిత్ శర్మ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అయితే, మైదానంలోకి దూసుకొచ్చిన అతడిపై అమెరికా పోలీసులు కాస్త కఠినంగా వ్యవహరించారు.
హెచ్‍కోచ్‍గా గంభీర్ రానున్నారా!
టీమిండియా హెడ్‍కోచ్‍గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ వస్తారంటూ కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ 2024లో కోల్‍కతా నైట్‍రైడర్స్ మెంటార్‌గా గంభీర్ వ్యవహరించారు. అతడి దిశానిర్దేశంలో ఈ సీజన్‍లో కేకేఆర్ టైటిల్ గెలిచింది. ముఖ్యంగా గంభీర్ నిర్ణయాలు ఆ జట్టుకు ప్లస్ అయ్యాయి. దీంతోపాటు దూకుడుగా ఆడేలా వ్యూహాలను గౌతీ రచించాడు. దీంతో భారత జట్టుకు హెడ్‍కోచ్‍గా గంభీర్ సరైన వ్యక్తి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, భారత జట్టుకు కోచ్‍గా ఉండడం తనకు కూడా ఇష్టమేనని, జాతీయ టీమ్‍కు కోచింగ్ చేయడం కంటే గొప్ప విషయం ఏమీ ఉండదని గంభీర్ ఇటీవలే అన్నాడు. మరి ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
టాపిక్