Rohit Sharma: గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ అభిమాని - బేడీలు వేసి ఈడ్చుకెళ్లిన అమెరికా పోలీసులు
Rohit Sharma: శనివారం ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్ జరుగుతోండగా రోహిత్ శర్మ కలవడానికి ఓ అభిమాని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. యూఎస్ఏ పోలీసులు ఆ అభిమాని తాటతీశారు. అతడిని బేడీలు వేసి ఈడ్చుకెళ్లారు.
Rohit Sharma: తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా ,కలవడం కోసం క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్ జరుగుతోన్న సమయంలో సెక్యూరిటీని దాటుకొని గ్రౌండ్ వచ్చే సీన్స్ చాలా సార్లు కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఇండియన్ క్రికెట్‌లో ఈ సీన్ కామన్‌గా జరుగుతూనే ఉంటుంది. అభిమానులను చర్యలను క్రికెటర్లతో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా తేలిగ్గానే తీసుకుంటారు.
వార్మప్ మ్యాచ్‌లో...
కానీ టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన క్రికెట్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. నాసా కౌంటీ స్టేడియంలో శనివారం ఈ వార్మప్ మ్యాచ్ జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ అభిమాని రోహిత్ శర్మను కలవడానికి గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. రోహిత్‌ను కలిసే సమయంలోనే పోలీసులు అభిమానిని చుట్టుముట్టారు.
బేడీలు వేసిన పోలీసులు...
సదరు అభిమానిని కిందపడేసి చేతులకు వెనక్కి తిప్పి బేడీలు వేశారు. ఆ అభిమానిని చితక్కొట్టారు. క్రికెట్ ఫ్యాన్ పట్ల అంత కఠినంగా ప్రవర్తించవద్దని రోహిత్ శర్మ పోలీసులకు చెప్పినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. కానీ రోహిత్ మాటలను సైతం అమెరికా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. అతడిని ఈడ్చుకుంటూ గ్రౌండ్ నుంచి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఫ్యాన్స్ ట్రోల్...
యూఎస్ పోలీసుల తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతోన్నారు. క్రిమినల్ కంటే దారుణంగా క్రికెట్ ఫ్యాన్ ఈడ్చుకెళ్లారని, అంత కఠినంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదని అంటోన్నారు. మరికొందరు మాత్రం ఇండియా పోలీసుల మాదిరిగా యూఎస్ఏ పోలీసులు ఉండరని, టీ20 వరల్డ్ కప్‌లో గ్రౌండ్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నాలను ఫ్యాన్స్ చేయకపోవడమే మంచిదని సలహాలు ఇస్తున్నారు.
కోహ్లి ప్రాక్టీస్ వీడియో...
ఇండియన్ క్రికెట్ టీమ్‌కు అమెరికా పోలీసులు గట్టి భద్రతను కల్పిస్తోన్నారు. కోహ్లి ప్రాక్టీస్ కోసం స్టేడియంలోకి వస్తోన్న సమయంలో అతడి చుట్టూ మొత్తం పోలీసులే కన్పిస్తోన్న ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ...
కాగా వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై చిత్తుగా ఓడించింది టీమ్ ఇండియా. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇరవై ఓవర్లలో 182 రన్స్ చేసింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 32 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 53 రన్స్ చేశాడు. హార్దిక్ పాండ్య 40, సూర్యకుమార్ యాదవ్ 31 రన్స్‌తో రాణించారు.
లక్ష్య ఛేధనలో తడబడిన బంగ్లాదేశ్ 122 పరుగులు మాత్రమే చేసింది. మహ్మదుల్లా 40, షకీబ్ అల్ హసన్ 28 మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్స్ దారుణంగా విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో అర్షదీప్‌సింగ్, శివమ్ దూబే తలో రెండు వికెట్లు తీసుకున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో తన తొలి మ్యాచ్‌లో టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది.