IND vs BAN: టీ20 వరల్డ్ కప్ - నేడు బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్ - ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
IND vs BAN: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు బంగ్లాదేశ్ తో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ వార్మప్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్‌తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఉండనుంది.
IND vs BAN: టీ20 వరల్డ్ కప్ పోరు కోసం టీమిండియా సిద్ధం కాబోతోంది. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా నేడు (శనివారం ) బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్‌లోని నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ వార్మప్ మ్యాచ్ జరుగనుంది.
టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత్ మినహా మిగిలిన జట్లు రెండేసి వార్మప్ మ్యాచ్‌లు ఆడాయి. ఐపీఎల్ కారణంగా భారత్ మాత్రం బంగ్లాదేశ్‌తో ఒకే ఒక వార్మప్ మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్‌లో విజయంతో టీ20 వరల్డ్ కప్‌ను ఉత్సాహంగా మొదలుపెట్టాలని భావిస్తోంది.
జట్టు కూర్పుపై...
ముఖ్యంగా ఈ వార్మప్ మ్యాచ్ ద్వారా జట్టు బ్యాటింగ్, బౌలింగ్ కూర్పుపై ఓ అవగాహనకు రావాలని కోచ్ ద్రావిడ్ భావిస్తోన్నాడు. ఈ వార్మప్ మ్యాచ్‌లో యువ ఆటగాళ్లకే ఎక్కువగా ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కోహ్లి, బుమ్రా ఈ వార్మప్ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మతో పాటు మిగిలిన టీమిండియా ప్లేయర్లు నాలుగు రోజుల క్రితమే ఆమెరికా చేరుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లి శుక్రవారం ఆమెరికా చేరుకున్నాడు. జర్నీ కారణంగా అలసిపోవడంతో కోహ్లికి ఈ వార్మప్ మ్యాచ్‌లో విశ్రాంతి నివ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య ఎలా ఆడుతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు. అతడిని టీ20 వరల్డ్ కప్‌కు సెలెక్ట్ చేయడంపై విమర్శలొచ్చాయి. ఆ విమర్శలకు వార్మప్ మ్యాచ్ ద్వారా సమాధానం చెప్పాలని హార్దిక్ పాండ్య భావిస్తోన్నట్లు సమాచారం.
గ్రూప్ మ్యాచ్‌లన్నీ...
మరోవైపు వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజ్‌లోని మ్యాచ్‌లన్నీ నాసా కౌంటీ స్టేడియంలోనే భారత్ ఆడనుంది. పిచ్ కండీషన్ ఎలా ఉంటుంది, బ్యాటింగ్, బౌలింగ్‌లకు ఎంత వరకు అనుకూలం అన్నది ఈ వార్మప్ మ్యాచ్ ద్వారా అవగాహనకు రావాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ఆత్మస్థైర్యం కోసం...
వరల్డ్ కప్‌కు ముందు అమెరికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది బంగ్లాదేశ్. ఊహించని రీతిలో పసికూన చేతిలో కంగుతున్న బంగ్లాదేశ్ సిరీస్‌ను కోల్పోయింది. తిరిగి జట్టులో ఆత్మవిశ్వాసం పెరగాలంటే టీమిండియాతో జరిగే వార్మప్ మ్యాచ్‌లో గెలవడం ఒక్కటే మార్గమని బంగ్లాదేశ్ భావిస్తోంది.
ఈ వార్మప్ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో టెలికాస్ట్ కాబోతోంది. ఈ వార్మప్ మ్యాచ్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ కాబోతోంది.
టీమిండియా, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో...
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో జూన్ 5న తలపడనుంది. ఆ తర్వాత జూన్ 9న ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్థాన్‌తో పాటు ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా ఉన్నాయి.