Hardik Pandya: హార్దిక్ పాండ్యాను ఒంటరివాడిని చేశారు.. ముంబై ఇండియన్స్ పరిస్థితి అస్సలు బాలేదు: హర్భజన్ షాకింగ్ కామెంట్
02 April 2024, 15:26 IST
- Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఒంటరివాడిని చేశారని, ఆ టీమ్ పరిస్థితి అస్సలు బాలేదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అటు అంబటి రాయుడు కూడా ఇదే అంటున్నాడు.
హార్దిక్ పాండ్యాను ఒంటరివాడిని చేశారంటూ హర్భజన్ షాకింగ్ కామెంట్స్
Hardik Pandya: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పరిస్థితి చూసి షాక్ తింటున్నారు ఆ టీమ్ మాజీ ప్లేయర్స్ హర్భజన్ సింగ్, అంబటి రాయుడు. ఈ సీజన్ ఐపీఎల్లో ఈ ఇద్దరూ స్టార్ స్పోర్ట్స్ హిందీ కామెంటరీలో ఉన్నారు. అయితే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో మిగిలిన టీమ్మేట్స్ వ్యవహరిస్తున్న తీరుపై వీళ్లు మండిపడ్డారు. డ్రెస్సింగ్ రూమ్ పరిస్థితిని వివరించారు.
ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ పరిస్థితి ఇదీ
ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో వరుసగా మూడో మ్యాచ్ ఓడిన తర్వాత హర్భజన్ సింగ్ స్పందించాడు. ఆ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ లో ఇప్పుడు హార్దిక్ ఒంటరివాడైపోయినట్లు భజ్జీ చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ముంబై డగౌట్ లో హార్దిక్ పాండ్యా ఒక్కడే కూర్చొని బాధపడుతూ కనిపించాడు. ప్లేయర్స్ కానీ, కోచింగ్ స్టాప్ కానీ ఎవరూ లేరు.
ఇది చూసి హర్భజన్ స్పందించాడు. "ఈ విజువల్స్ అస్సలు బాగా అనిపించడం లేదు. అతన్ని ఒంటరిగా వదిలేశారు. ఫ్రాంఛైజీ ప్లేయర్స్ అతన్ని కెప్టెన్ గా అంగీకరించాలి. నిర్ణయం తీసేసుకున్నారు. టీమ్ ఒక్కటిగా కలిసుండాలి. పరిస్థితి అస్సలు బాగా కనిపించడం లేదు" అని హర్భజన్ సింగ్ అన్నాడు.
హార్దిక్‌ను తన పని చేసుకోనివ్వడం లేదు: రాయుడు
ఆ సమయంలో పక్కనే ఉన్న అంబటి రాయుడు కూడా దీనిపై స్పందించాడు. 2017 వరకు రాయుడు కూడా ముంబై ఇండియన్స్ జట్టులోనే ఉన్నాడు. అయితే జట్టులోని కొందరు ప్లేయర్స్ హార్దిక్ ను తన పని స్వేచ్ఛగా చేసుకునే అవకాశం ఇవ్వడం లేదని రాయుడు అనడం గమనార్హం. కావాలనే హార్దిక్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా రాయుడి కామెంట్స్ ఉన్నాయి.
"ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా అన్నది నాకు తెలియదు. కానీ జట్టులోని చాలా మంది ప్లేయర్స్ అతన్ని అయోమయంలోకి నెట్టేస్తున్నారు. డ్రెస్సింగ్ రూమ్ లోని పెద్ద ప్లేయర్స్ అతన్ని స్వేచ్ఛగా తన పని చేసుకోనివ్వడం లేదు. ఎలాంటి కెప్టెన్ కు అయినా ఇది మంచి పరిస్థితి కాదు" అని అంబటి రాయుడు స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2024లో తమ సొంత మైదానం వాంఖెడేలోనూ ముంబై ఇండియన్స్ బోణీ కొట్టలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ముంబై టాపార్డర్ దారుణంగా విఫలమైంది. రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, నమన్ ధిర్ ముగ్గురూ గోల్డెన్ డకౌట్స్ అయ్యారు. ఇషాన్ కిషన్ కూడా కేవలం 16 రన్సే చేయడంతో 20 పరుగులకే ముంబై 4 వికెట్లు కోల్పోయింది.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ 56 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ గాడిలో పెట్టాలని చూసినా.. తర్వాత పాండ్యా ఔటయ్యాడు. దీంతో ముంబై టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఈ టార్గెట్ ను కేవలం 16 ఓవర్లలోనే చేజ్ చేసేసింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ పాయింట్ల టేబుల్లో అట్టడుగున నిలవగా రాజస్థాన్ రాయల్స్ టాప్ లోకి దూసుకెళ్లింది.
టాపిక్