Harbhajan MS Dhoni: హర్భజన్ చెప్పిందంతా చెత్త.. ధోనీ ఎప్పుడూ అలా చేయలేదు: సీఎస్కే కోచ్ కామెంట్స్ వైరల్
03 October 2024, 20:44 IST
- Harbhajan MS Dhoni: ధోనీపై హర్భజన్ చేసిన కామెంట్స్ అంతా చెత్త అని చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ కోచ్ టామీ సిమ్‌సెక్ అన్నాడు. ఆర్సీబీ చేతుల్లో ఓడిన తర్వాత ధోనీ ఓ టీవీ పగలగొట్టాడని భజ్జీ చేసిన కామెంట్స్ పై అతడు కామెంట్ చేశాడు.
హర్భజన్ చెప్పిందంతా చెత్త.. ధోనీ ఎప్పుడూ అలా చేయలేదు: సీఎస్కే కోచ్ కామెంట్స్ వైరల్
Harbhajan MS Dhoni: ధోనీ ఫీల్డ్ లో కూల్ గా ఉంటాడనే అందరికీ తెలుసు. కానీ మరీ టీవీ పగలగొట్టేంత కోపం కూడా అతనికి వస్తుందా? మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఈ మధ్య చేసిన కామెంట్స్ అదే అనుమానానికి తావిచ్చింది. ఆర్సీబీతో మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్ లోని టీవీని ధోనీ గట్టిగా కొట్టాడని భజ్జీ చేసిన కామెంట్స్ పై తాజాగా ఆ టీమ్ ఫీల్డింగ్ కోచ్ టామీ సిమ్సెక్ స్పందించాడు.
"ఇదంతా చెత్త. ఎమ్మెస్డీ దేనినీ పగలగొట్టలేదు. ఏ మ్యాచ్ తర్వాత కూడా ధోనీ అలా దూకుడుగా వ్యవహరించలేదు. ఫేక్ న్యూస్" అని సిమ్సెక్ కామెంట్ చేశాడు. నిజానికి హర్భజన్ సింగ్ కామెంట్స్ ధోనీ అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.
హర్భజన్ ఏమన్నాడంటే..
హర్భజన్ సింగ్ గతంలో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో ప్లేయర్ గా కూడా ఉన్నాడు. అయితే రిటైరైన తర్వాత భజ్జీ ఐపీఎల్లో కామెంట్రీ ఇచ్చాడు. సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా కూడా హర్భజన్ కామెంట్రీ బాక్స్ లో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో ఓటమి తర్వాత సీఎస్కే టోర్నీ నుంచి బయటకు వెళ్లడంతో ఆ కోపంలో ధోనీ టీవీ స్క్రీన్ ను పగలగొట్టాడని భజ్జీ చెప్పాడు.
"నేను పైనుంచి చూస్తున్నాను. వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సీఎస్కే వాళ్లు లైన్లో నిలబడి వాళ్లతో హ్యాండ్ షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. కాసేపు వాళ్లు వేచి చూశారు. ఆర్సీబీ సెలబ్రేషన్ పూర్తయిన తర్వాత ధోనీ తిరిగి వెళ్లాడు. డ్రెస్సింగ్ రూమ్ కంటే ముందు ఉండే ఓ స్క్రీన్ పై గట్టిగా కొట్టాడు. అది సహజమే. స్పోర్ట్స్ లో జరుగుతూనే ఉంటాయి" అని హర్భజన్ స్పోర్ట్స్ యారీ అనే పాడ్‌కాస్ట్ లో చెప్పాడు.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో ప్లేఆఫ్స్ కు క్వాలిఫై కావాలంటే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో ఉంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 218 రన్స్ చేసింది. చెన్నైకి అప్పటికే మంచి నెట్ రన్ రేట్ ఉండటంతో ఈ మ్యాచ్ లో గెలవకపోయినా కనీసం 200పైన చేసినా ప్లేఆఫ్స్ కు అర్హత సాధించేది.
కానీ సీఎస్కేని చివరికి 191 పరుగులకే కట్టడి చేసింది. దీంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించగా.. సీఎస్కే ఇంటికెళ్లిపోయింది.