Rahul Dravid son: భారత అండర్-19 జట్టులోకి రాహుల్ ద్రవిడ్ కొడుకు ఎంపిక, సమిత్ రికార్డులివే
31 August 2024, 11:55 IST
India U-19 Squad: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ భారత్ అండర్-19 జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా దేశవాళీ ట్రోఫీల్లో సమిత్ సత్తాచాటుతున్నాడు.
సమిత్ ద్రవిడ్
Rahul Dravid son Samit Dravid: భారత జట్టు మాజీ కెప్టెన్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ త్వరలో భారత అండర్ -19 జట్టులోకి ఎంపిక్యాడు. సెప్టెంబరు 21 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ కోసం భారత అండర్-19 జట్టుని ప్రకటించగా.. అందులో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా సమిత్ ఎంపికయ్యాడు.
పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 21, 23, 26 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియాతో భారత యువ జట్టు ఆడనుంది. ఈ వన్డే సిరీస్‌లో భారత్ జట్టుకి ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ అమాన్ సారథ్యం వహించనున్నాడు.
ఈ వన్డే సిరీస్ తర్వాత సెప్టెంబర్ 30, అక్టోబర్ 7వ తేదీల్లో నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం భారత యువ జట్టు చెన్నైకి వెళ్లనుంది. ఈ టీమ్‌కి మధ్యప్రదేశ్‌కు చెందిన సోహమ్ పట్వర్ధన్ నాయకత్వం వహించనున్నాడు.
పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన సమిత్ ద్రవిడ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్న కేఎస్సీఏ మహారాజా టీ20 ట్రోఫీలో మైసూర్ వారియర్స్ తరఫున ఆడుతున్నాడు. కానీ ఈ సిరీస్‌లో బౌలింగ్ చేయని సమిత్.. బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం కలిపి 82 పరుగులు చేయగా.. ఇందులో టాప్ స్కోరు 33 పరుగులే.
కానీ.. ఈ ఏడాది ఆరంభంలో కూచ్ బెహర్ ట్రోఫీలో కర్ణాటక జట్టు తొలి టైటిల్ గెలవడంలో సమిత్ కీలక పాత్ర పోషించాడు. ఆ ట్రోఫీలో మొత్తం 8 మ్యాచుల్లో 362 పరుగులు చేసిన 18 ఏళ్ల సమిత్.. జమ్మూ కాశ్మీర్ టీమ్‌పై 98 పరుగులు చేశాడు. బంతితోనూ ఈ ట్రోఫీలో అతను సత్తాచాటాడు. ముంబైతో జరిగిన ఫైనల్లో రెండు వికెట్లతో సహా ఎనిమిది మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతోనే అతనికి అండర్-19 టీమ్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.
భారత అండర్-19 జట్టు
రుద్ర పటేల్, సాహిల్ పరాఖ్, కార్తికేయ కేపీ, మహ్మద్ అమాన్, కిరణ్ చోర్మాలే, అభిజ్ఞాన్ కుందు, హర్వంశ్ సింగ్ పంగాలియా, సమిత్ ద్రవిడ్, యుధాజిత్ గుహా, సమర్థ్ ఎన్, నిఖిల్ కుమార్, చేతన్ శర్మ, హార్దిక్ రాజ్, రోహిత్ రజావత్, మహ్మద్ ఎనాన్.
నాలుగు రోజుల మ్యాచ్‌కి టీమ్
వైభవ్ సూర్యవంశీ, నిత్యా పాండ్యా, విహాన్ మల్హోత్రా, సోహమ్ పట్వర్ధన్, కార్తికేయ కేపీ, సమిత్ ద్రవిడ్, అభిజ్ఞాన్ కుందు, హర్వంశ్ సింగ్ పంగాలియా, చేతన్ శర్మ, సమర్థ్ ఎన్, ఆదిత్య రావత్, నిఖిల్ కుమార్, అన్మోల్జీత్ సింగ్, ఆదిత్య సింగ్, మహ్మద్ ఎనాన్.