Ravindra Jadeja Surgery: హాస్పిటల్‌ బెడ్‌పై జడేజా.. త్వరలోనే టీమ్‌లోకి వస్తానన్న ఆల్‌రౌండర్‌-ravindra jadeja surgery success as all rounder says he will come back soon ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravindra Jadeja Surgery: హాస్పిటల్‌ బెడ్‌పై జడేజా.. త్వరలోనే టీమ్‌లోకి వస్తానన్న ఆల్‌రౌండర్‌

Ravindra Jadeja Surgery: హాస్పిటల్‌ బెడ్‌పై జడేజా.. త్వరలోనే టీమ్‌లోకి వస్తానన్న ఆల్‌రౌండర్‌

Hari Prasad S HT Telugu
Sep 06, 2022 07:48 PM IST

Ravindra Jadeja Surgery: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సర్జరీ విజయవంతమైంది. తాను హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న ఫొటోను జడేజా మంగళవారం (సెప్టెంబర్‌ 6) షేర్‌ చేశాడు.

మోకాలికి సర్జరీ తర్వాత హాస్పిటల్ బెడ్ పై రవీంద్ర జడేజా
మోకాలికి సర్జరీ తర్వాత హాస్పిటల్ బెడ్ పై రవీంద్ర జడేజా (Ravindra Jadeja Instagram)

Ravindra Jadeja Surgery: మోకాలి గాయంతో ఆసియా కప్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు మంగళవారం (సెప్టెంబర్‌ 6) సర్జరీ జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఇందులో సర్జరీ తర్వాతి ఫొటోలను షేర్‌ చేశాడు. ఒకదాంట్లో బెడ్‌పై పడుకొని ఉండగా.. మరో ఫొటోలో స్టాండ్‌ సాయంతో నిల్చోవడం చూడొచ్చు.

"సర్జరీ విజయవంతమైంది. నేను థ్యాంక్స్‌ చెప్పాల్సిన వాళ్లు చాలా మందే ఉన్నారు. బీసీసీఐ, నా టీమ్‌ మేట్స్‌, సపోర్ట్‌ స్టాఫ్‌, ఫిజియోలు, డాక్టర్లు, అభిమానులు అందరూ నాకు అండగా నిలిచారు. నా రీహ్యాబిలిటేషన్‌ త్వరలోనే ప్రారంభిస్తా. సాధ్యమైనంత త్వరగా టీమ్‌లోకి తిరిగి వస్తా. మీ అభిమానానిని కృతజ్ఞతలు" అని జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకున్నాడు.

ఆసియా కప్‌ లీగ్‌ స్టేజ్‌లో పాకిస్థాన్, హాంకాంగ్‌లపై విజయాల్లో కీలకపాత్ర పోషించిన రవీంద్ర జడేజా.. సూపర్‌ ఫోర్‌ స్టేజ్ ప్రారంభమయ్యే ముందు మోకాలి గాయంతో దూరమయ్యాడు. దీంతో అతనికి సర్జరీ చేయాల్సి వచ్చింది. అతని లేని లోటు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లలో జడేజా టీమ్‌కు కీలకంగా మారాడు.

దీంతో అతడు టీ20 వరల్డ్‌కప్‌లోపు పూర్తిగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ నుంచి జడేజా తరచూ గాయాల పాలవుతున్నాడు. ఈ గాయాల వల్ల గతేడాది సౌతాఫ్రికా సిరీస్‌, ఆ తర్వాత సగం ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. తాజాగా ఆసియా కప్‌ను అర్ధంతరంగా వీడాల్సి వచ్చింది. అయితే అతని సర్జరీ విజయవంతం కావడం.. త్వరలోనే టీమ్‌లోకి రాగలనన్న అతని కాన్ఫిడెన్స్‌ ఫ్యాన్స్‌లో ఆనందం నింపుతోంది.