Virendra Sehwag Prediction on Asia Cup: ఆసియా కప్ విజేత ఎవరో చెప్పేసిన సెహ్వాగ్.. ఫ్యాన్స్ షాక్ అవ్వాల్సిందే-virender sehwag makes bold prediction on who will win asia cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virendra Sehwag Prediction On Asia Cup: ఆసియా కప్ విజేత ఎవరో చెప్పేసిన సెహ్వాగ్.. ఫ్యాన్స్ షాక్ అవ్వాల్సిందే

Virendra Sehwag Prediction on Asia Cup: ఆసియా కప్ విజేత ఎవరో చెప్పేసిన సెహ్వాగ్.. ఫ్యాన్స్ షాక్ అవ్వాల్సిందే

Maragani Govardhan HT Telugu
Sep 06, 2022 02:03 PM IST

Sehwag Prediction on Asia Cup win: ఆసియా కప్ టోర్నీలో విజేతగా నిలిచేది ఎవరో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌కు గెలిచే అవకాశాలున్నాయని తెలిపాడు.

<p>వీరేంద్ర సెహ్వాగ్</p>
వీరేంద్ర సెహ్వాగ్

Sehwag Prediction on Asia Cup win: ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతుల్లో భారత పరజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో టీమిండియా అభిమానులు నిరాశకు గురయ్యారు. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టోర్నీని విజయాలతో ఘనంగా ఆరంభించిన భారత్.. అనూహ్యంగా పాక్ చేతిలో సూపర్ 4 దశలో ఓటమి పాలై ఫైనల్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. తుదిపోరుకు అర్హత సాధించాలంటే ఈ రోజు శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. ఇదిలా ఉంటే ఫైనల్ జరగకముందే ఆసియా కప్ విజేత ఎవరనేది చర్చ జరుగుతోంది. టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఆసియా కప్ విజేతపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

భారత్ తుదిపోరుకు అర్హత సాధించాలంటే శ్రీలంకతో మ్యాచ్‌ను తప్పక గెలవాల్సిందేనని, ఒకవేళ ఓటమి పాలయితే.. పాకిస్థాన్‌ ఆసియా కప్ విజేతగా నిలవడానికి ఎక్కువ అవకాశాలున్నాయని స్పష్టం చేశాడు.

"భారత్ మరో మ్యాచ్‌లో ఓడిపోయినట్లయితే.. టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. అప్పుడు పాకిస్థాన్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్లు ఓ మ్యాచ్‌లో ఓడినా.. మరో గేమ్‌లో గెలిస్తే సరిపోతుంది. కాబట్టి చాలా కాలం తర్వాత పాకిస్థాన్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశముంది. అలాగే భారత్‌పై విజయం సాధించింది. ఫలితంగా ఈ ఏడాది పాకిస్థాన్‌కు కలిసొచ్చే అవకాశముంది." అని వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్థాన్ చివరగా 2014లో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఇందులో శ్రీలంక చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొత్తంగా ఆసియా కప్‌ను పాక్ రెండు సార్లు మాత్రమే కైవసం చేసుకోగా.. టీమిండియా 7, శ్రీలంక 5 సార్లు సొంతం చేసుకున్నాయి. ఆసియా కప్ 2022 సూపర్-4 మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మహ్మద్ రిజ్వాన్ 71 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇదిలా ఉంటే ఆదివారం నాడు పాక్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. టోర్నీలో టీమిండియా ఫైనల్ చేరాలంటే మంగళవారం నాడు శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. ఇందులో నెగ్గితే ఫైనల్‌కు చేరడానికి భారత్‌కు మెండుగా అవకాశాలుంటాయి. మంగళవారం నాడు రాత్రి 7.30 గంటలకు శ్రీలంకతో సూపర్-4 మ్యాచ్‌లో ఢీకొట్టనుంది రోహిత్ సేన.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్