Legends League Cricket: లెజెండ్ లీగ్ కెప్టెన్స్ గా సెహ్వాగ్, పఠాన్, గంభీర్, హర్భజన్
Legends League Cricket: సెప్టెంబర్ 16 నుండి జరుగనున్న లెజెండ్స్ లీగ్ టోర్నీ కెప్టెన్లతో పాటు నాలుగు టీమ్స్ పేయర్స్ లిస్ట్ వచ్చేసింది. ఇందులో ఎవరు ఆడనున్నారంటే..
Legends League Cricket: సౌరభ్ గంగూళీ, సెహ్వాగ్, గంభీర్ తో పాటు టీమ్ ఇండియా మాజీ దిగ్గజ క్రికెటర్లు బ్యాటింగ్ మెరుపులతో క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. లెజెండ్స్ లీగ్ టోర్నీ సెప్టెంబర్ 16న మొదలుకాబోతున్నది. మొత్తం నాలుగు టీమ్ లు పోటీ పడుతున్న ఈ టోర్నీలో ఇండియాతో పాటు వివిధ దేశాలకు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు బరిలో దిగబోతున్నారు. శుక్రవారం టోర్నీ నిర్వహకులు కెప్టెన్లతో పాటు నాలుగు టీమ్ లకు చెందిన ప్లేయర్ల జాబితాను ప్రకటించాయి.
ఇందులో గుజరాత్ జెయింట్స్ టీమ్ కు కెప్టెన్ గా వీరేంద్ర సెహ్వాగ్, ఇండియా క్యాపిటల్స్ కు గౌతమ్ గంభీర్, బిల్వారా కింగ్స్ కు ఇర్ఫాన్ పఠాన్, మణిపాల్ టైగర్స్ టీమ్ కు హర్భజన్ సింగ్ కెప్టెన్లుగా వ్యవహరించబోతున్నారు. ఇండియా క్యాపిటల్స్ టీమ్ కు మోర్తజ, మసకద్జ, ప్రవీణ్ తాంబే, మహారూఫ్, కలిస్ తో పాటు పలువురు క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించబోతున్నారు. బిల్వారా కింగ్స్ లో యూసఫ్ ఫఠాన్, నమన్ ఓజా, షేన్ వాట్సన్, శ్రీశాంత్, మణిపాల్ టైగర్స్ లో బ్రెట్ లీ, ముత్తయ్య మురళీధరన్, మహమ్మద్ కైఫ్, కలువితరణ, క్లుసెనర్, ఫ్లింటాఫ్ తో పాటు వివిధ దేశాలకు చెందిన ప్లేయర్లు ఆడనున్నారు.
ఇక గుజరాత్ టైటాన్స్ నుండి పార్థివ్ పటేల్, అజంతా మెండిస్, అశోక్ దిండా, ఓబ్రెయిన్, లెండి సిమ్మన్స్ తో పాటు పలువురు ఇంటర్ నేషనల్ క్రికెటర్లు బరిలో దిగబోతున్నారు. లెజెండ్స్ లీగ్ లో భాగంగా సెప్టెంబర్ 16న ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగనున్నది.
ఇందులో ఇండియా మహారాజాస్ టీమ్ కు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ కెప్టెన్ గా వ్యవహరించబోతుండగా వరల్డ్ జెయింట్స్ టీమ్ కు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్,షేన్ వాట్సన్, బ్రెట్ లీ, డేల్ స్టెయిన్ తో పాటు పలువురు మాజీ ఇంటర్ నేషనల్ క్రికెటర్స్ ఆడనున్నారు. కాగా లెజెండ్స్ లీగ్ టోర్నీకి లక్నో, ఢిల్లీ, కటక్, జోధ్ పూర్ ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి.