తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni: ఔటైన కోపంలో ధోనీ చేసిన పనికి వణికిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్

MS Dhoni: ఔటైన కోపంలో ధోనీ చేసిన పనికి వణికిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్

Galeti Rajendra HT Telugu

14 September 2024, 12:06 IST

google News
  • CSK IPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ చేతిలో సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ పేలవంగా ఓడిపోవడంతో ధోనీకి కోపం వచ్చిందట. డ్రెస్సింగ్ రూముకి వచ్చి వాటర్ బాటిల్‌ను కోపంతో తన్నాడని చెన్నై మాజీ క్రికెటర్ బద్రీనాథ్ గుర్తు చేసుకున్నాడు. 

ధోనీ
ధోనీ

ధోనీ

MS Dhoni Lost His Cool: మ్యాచ్ ఏ స్థితిలో ఉన్నా మైదానంలో మహేంద్రసింగ్ ధోనీ తన హావభావాలు బయటికి కనిపించనీయడు. చాలా కూల్‌గా ఉన్నట్లు కనిపిస్తాడు. అందుకే ధోనీని అభిమానులందరూ ముద్దుగా 'కెప్టెన్ కూల్' అని పిలుస్తుంటారు. అలాంటి ధోనీ ఓ మ్యాచ్ సందర్భంలో వాటర్ బాటిల్‌ను కోపంతో తన్నాడట. ఈ విషయాన్ని ధోనీతో కలిసి ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ వెల్లడించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభ సీజన్‌లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై టీమ్ ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో ధోనీ సహనం కోల్పోయినట్లు బద్రీనాథ్ గుర్తు చేసుకున్నాడు.

చెపాక్‌లో ఓటమితో ధోనీ అసహనం

మ్యాచ్‌లో చెన్నై బౌలర్ ఆల్బీ మోర్కెల్ నాలుగు వికెట్లు తీయడంతో బెంగళూరు టీమ్ 8 వికెట్ల నష్టానికి 126 పరుగులే చేయగలిగింది. రాహుల్ ద్రవిడ్ 39 బంతుల్లో 47 పరుగులు చేసి బెంగళూరు పరువు నిలిపాడు. ఆ తర్వాత 127 పరుగుల ఛేదనలో చెన్నైకి స్టీఫెన్ ఫ్లెమింగ్ 39 బంతుల్లో 44 పరుగులు చేసి శుభారంభం ఇచ్చాడు. కానీ.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన చెన్నై టీమ్ 8 వికెట్ల నష్టానికి 111 పరుగులకే పరిమితమై మ్యాచ్‌ను చేజార్చుకుంది.

ఆ మ్యాచ్‌లో ధోనీ గురించి బద్రీనాథ్ చెప్తూ ‘‘ధోనీ కూడా మనిషికే కదా... సహనం కోల్పోయాడు’’అని గుర్తు చేసుకున్నాడు. మైదానంలో అలా ఎప్పుడూ జరగలేదు. ధోనీ సాధారణంగా తాను సహనం కోల్పోయానన్న విషయాన్ని ప్రతిపక్షాలకు కూడా ఎప్పుడూ తెలియకుండా జాగ్రత్తపడేవాడు. కానీ.. సొంతగడ్డపై ఆర్సీబీ చేతిలో 127 పరుగులు ఛేదించలేక ఓడిపోయాం.

వాటర్ బాటిల్‌ను తన్నిన ధోని

ఆ మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే బౌలింగ్‌లో ధోనీ వికెట్ చేజార్చుకున్నాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వచ్చి ధోనీ వాటర్ బాటిల్‌ను గట్టిగా తన్నాడని బద్రీనాథ్ గుర్తు చేసుకున్నాడు. ‘‘అనిల్ కుంబ్లే బౌలింగ్‌లో ధోనీ ఔటయ్యాడు. అంతకముందే నేను కూడా ఎల్బీడబ్ల్యూ ఔటై డ్రెస్సింగ్ రూమ్‌లో లోపల నిల్చున్నాను. అదే సమయంలో ధోనీ లోపలికి వస్తూ.. అక్కడ ఉన్న ఒక చిన్న వాటర్ బాటిల్‌ను గట్టిగా తన్నాడు. దాంతో నేను ఓరి దేవుడా.. అనుకున్నా. నిజానికి ధోనీని అలా ఎవరూ చూడాలని కోరుకోరు. ధోనీ కోపంగా ఉండటంతో అతని కళ్లల్లోకి కళ్లు పెట్టి కూడా చూడలేకపోయా. భయంతో చాలా సేపు అతనితో మాట్లాడకుండా టీమ్ సభ్యులు కూడా దూరంగా ఉండిపోయారు’’ అని బద్రీనాథ్ గుర్తు చేసుకున్నాడు.

ఐపీఎల్ 2025లో సీఎస్కేకు ధోనీ?

చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుతోనే వచ్చే ఏడాది ఐపీఎల్ 2025లోనూ ధోనీ కొనసాగే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికి ఐదేళ్లు అయిన ఆటగాళ్లని అన్‌క్యాప్డ్ ప్లేయర్లగా పరిగణించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది ధోనీ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ నడిపించాడు. కానీ ప్లేఆఫ్స్‌కి కూడా చెన్నై అర్హత సాధించలేకపోయింది. దాంతో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఇంకా నేర్చుకోవాల్సి ఉందని.. ధోనీ టీమ్‌లో ఉంటేనే అది సాధ్యమని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ భావిస్తోంది.

తదుపరి వ్యాసం