MS Dhoni uncapped player: ధోనీ ఓ అన్‌క్యాప్డ్ ప్లేయర్ అట.. అతని కోసం రూలే మార్చేస్తున్న బీసీసీఐ?
MS Dhoni uncapped player: ఎమ్మెస్ ధోనీ ఓ అన్‌క్యాప్డ్ ప్లేయర్ అట. అంటే ఇప్పటి వరకూ అంతర్జాతీయ క్రికెట్ ఆడని ప్లేయర్. ఈ కేటగిరీలోనే అతడు వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడే అవకాశం కనిపిస్తోంది. అతని కోసం బీసీసీఐ కూడా రూల్ మార్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
MS Dhoni uncapped player: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బీసీసీఐ ఓ ముఖ్యమైన మార్పు తీసుకురాబోతోంది. అంతర్జాతీయంగా రిటైరైన ప్లేయర్స్ ను కూడా అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ గా పరిగణించాలన్నదే ఆ కీలకమైన మార్పు. అయితే రిటైరై ఐదేళ్లు గడిస్తేనే ఇది వర్తిస్తుంది. ఇలా వచ్చే ఏడాది ఐపీఎల్లో ధోనీని ఆడించడానికి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ చూస్తోంది.
పాత రూలే కొత్తగా..
నిజానికి ఐపీఎల్లో ఈ రూల్ కొత్తదేమీ కాదు. 2021 వరకూ ఫాలో అయ్యిందే. అయితే ఆ తర్వాతి ఏడాది నుంచి ఈ అవకాశం కల్పించలేదు. కానీ 2025 నుంచి మరోసారి ఈ మార్పు చేయాలని బోర్డు భావిస్తున్నట్లు క్రిక్‌బజ్ రిపోర్టు వెల్లడించింది. వచ్చే ఐపీఎల్ సీజన్, మెగా వేలంపై బీసీసీఐ, ఫ్రాంఛైజీలు చర్చించిన కొన్ని వారాల తర్వాత ఈ మార్పుపై బోర్డు యోచిస్తుండటం గమనార్హం.
ముఖ్యంగా ధోనీలాంటి ప్లేయర్స్ ను దృష్టిలో ఉంచుకొనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అతనితోపాటు చాలా రోజుల కిందట రిటైరైన అంతర్జాతీయ ప్లేయర్స్ ను ఇలా అన్‌క్యాప్డ్ గా పరిగణించి మళ్లీ ఐపీఎల్లోకి తీసుకొస్తే లీగ్ కి ఉన్న చరిష్మా మరింత పెరుగుతుందన్నది బోర్డు ఉద్దేశంగా కనిపిస్తోందని ఆ రిపోర్టు తెలిపింది.
ధోనీ కావాలంటున్న సీఎస్కే
వచ్చే ఏడాది ఐపీఎల్లో ధోనీ ఓ ప్లేయర్ గా కొనసాగుతాడా లేదా అన్నదానిపై స్పష్టత లేకపోయినా.. సీఎస్కే మాత్రం అతన్ని రిటెయిన్ చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అది అన్‌క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీ అయితే రిటెయిన్ చేసుకోవడం ఏ ఫ్రాంఛైజీకైనా మరింత సులువు అవుతుంది.
ఇప్పటి వరకూ ఎంత మంది ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకోవాలన్నదానిపై బోర్డు స్పష్టత ఇవ్వలేదు. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన వారిని అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ గా పరిగణించాలన్న రూల్ తీసుకొస్తే మాత్రం చాలా ఫ్రాంఛైజీలకు ప్రయోజనం చేకూరుతుంది.
ధోనీ ఆడతాడా?
వచ్చే సీజన్లో ధోనీ ఆడతాడా లేదా? ప్రతి ఏడాదిలాగే ఈ ప్రశ్న ఇప్పుడు కూడా అభిమానులను వేధిస్తూనే ఉంది. 42 ఏళ్ల ధోనీ ఇప్పటికే సీఎస్కే కెప్టెన్సీని వదులుకోవడంతో వచ్చే సీజన్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా మోకాలి గాయానికి అతడు సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఒకవేళ ఆడినా,ఆడకపోయినా అతడు మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ తోనే ఉండేలా ఆ ఫ్రాంఛైజీ ప్లాన్స్ వేస్తోంది.