England Bazball: ఇదా మీ బజ్‌బాల్.. పరువు తీశారు.. ఇంగ్లండ్ టీమ్‌పై అక్కడి మాజీల మండిపాటు
19 February 2024, 10:46 IST
- England Bazball: ఇంగ్లండ్ ఆడుతున్న బజ్‌బాల్ స్టైల్ టెస్ట్ క్రికెట్ పై అక్కడి మాజీలు మరోసారి మండిపడ్డారు. టీమిండియా చేతుల్లో గత 90 ఏళ్లలో ఎన్నడూ చూడని ఓటమి చవిచూసిన ఇంగ్లండ్ టీమ్ పై విమర్శల వర్షం కురుస్తోంది.
బజ్‌బాల్ అంటూ పరువు తీశారంటూ ఇంగ్లండ్ టీమ్ పై మాజీల మండిపాటు
England Bazball: టీమిండియా చేతుల్లో ఏకంగా 434 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ పై అక్కడి మాజీ క్రికెటర్లు, మీడియా విమర్శలు గుప్పిస్తున్నారు. బజ్‌బాల్ అంటూ తమ పరువు తీశారని తీవ్రంగా మండిపడుతున్నారు. మైఖేల్ వాన్, నాసిర్ హుస్సేన్, జెఫ్రీ బాయ్‌కాట్ లాంటి ఇంగ్లండ్ టీమ్ మాజీ కెప్టెన్లు స్టోక్స్ అండ్ టీమ్ ను ఓ ఆటాడుకుంటున్నారు.
ఇదేం బజ్‌బాల్?
బజ్‌బాల్.. టెస్ట్ క్రికెట్ ను వేగంగా ఆడుతూ ఇంగ్లండ్ టీమ్ పరిచయం చేసిన సరికొత్త స్టైల్ ఇది. ఈ స్టైల్ తోనే రెండేళ్లుగా ఆ టీమ్ మంచి విజయాలు సాధించింది. అయితే ఈ బజ్‌బాల్ వాళ్లకు ఎన్ని ప్రశంసలు తీసుకొచ్చిందో అదే స్థాయిలో విమర్శలూ వెల్లువెత్తేలా చేస్తోంది. తాజాగా టీమిండియా చేతుల్లో ఏకంగా 434 పరుగుల తేడాతో ఓడిన తర్వాత ఇంగ్లండ్ బజ్‌బాల్ పై మాజీ కెప్టెన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇంగ్లండ్ క్రికెట్ లో గత 90 ఏళ్లలో ఇదే అత్యంత దారుణమైన ఓటమి కావడం గమనార్హం. దీంతో ఆ దేశ మాజీ కెప్టెన్లు మైఖేల్ వాన్, నాసిర్ హుస్సేన్, జెఫ్రీ బాయ్‌కాట్ ఈ స్టైల్ ను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్ లో మూడో రోజు ఉదయమే జో రూట్ రివర్స్ ర్యాంప్ షాట్ ఆడబోయి ఔటైన విధానం వాళ్లను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. కెప్టెన్ బెన్ స్టోక్స్.. రూట్ ను సమర్థించినా మాజీ కెప్టెన్లను మాత్రం ఆగ్రహానికి గురి చేసింది.
రూట్ పాపం చేశాడు
"ఆ షాట్ వర్కౌటైతే బాగానే ఉంటుంది. లేకపోతేనే చాలా ఇబ్బందిగా మారుతుంది. అంతటి టాలెంట్ ఉన్న ప్లేయర్ నుంచి ఇంత వృథాగా వికెట్ పోయింది" అని టెలిగ్రాఫ్ కు రాసిన కాలమ్ లో బాయ్‌కాట్ అన్నాడు. మరోవైపు మైఖేల్ వాన్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. జో రూట్ లాంటి ప్లేయర్ ఇండియాకు అంత చెత్తగా వికెట్ గిఫ్ట్ గా ఇవ్వడం దారుణమని అభిప్రాయపడ్డాడు.
రూట్ ఆ షాట్ ఆడిన టైమ్ ను మరో మాజీ నాసిర హుస్సేన్ తప్పుబట్టాడు. "రూట్ ఆ షాట్ ఆడటంలో తప్పులేదు. గతంలో చాలాసార్లు బాగా ఆడాడు. కానీ ప్రత్యర్థి జట్టులో అశ్విన్ లేడు. జడేజాను బలవంతంగా జట్టులోకి తీసుకొచ్చారు. బుమ్రా రెస్ట్ అవసరమైనా కూడా వరుసగా మూడో టెస్ట్ ఆడుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆ షాట్ ఆడటం నచ్చలేదు" అని హుస్సేన్ అన్నాడు.
ఇక ఇంగ్లండ్ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ స్కిల్డ్ బెర్రీ అయితే రూట్ ఔటవడానికి ఓ పాపంగా అభివర్ణించడం గమనార్హం. ఇండియా మోస్ట్ డేంజరస్ బౌలర్ బుమ్రా బౌలింగ్ లో రూట్ ఆడిన ఈ రివర్స్ స్కూప్.. ఈ మ్యాచ్ తోపాటు ఇంగ్లండ్ సిరీస్ గెలిచే అవకాశాలను దెబ్బతీసిందని అతడు స్పష్టం చేశాడు.
ఇక మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందిస్తూ.. "గత రెండేళ్లలో ఈ ఇంగ్లండ్ టీమ్ ఓడినప్పుడు కూడా అందులోనూ సానుకూల అంశాలు ఉన్నాయి. లేదంటే ఇంత దారుణంగా ఓడలేదు. ఇది కచ్చితంగా ఓ గుణపాఠమే. బలమైన జట్లపై ఇలా ఏకపక్షంగా బజ్‌బాల్ ఆడటం సరికాదు" అని అన్నాడు.
టాపిక్