Fastest Double Century: 97 బాల్స్‌లో డబుల్ సెంచరీ - 20 సిక్స్‌లు, 13 ఫోర్లు - ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వీరవిహారం
21 December 2024, 22:11 IST
Fastest Double Century: ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ సమీర్ రిజ్వీ 97 బాల్స్‌లోనే డబుల్ సెంచరీ సాధించాడు. అండర్ 23 స్టేట్ ఏ లెవల్ ట్రోఫీలో త్రిపురతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఉత్తర ప్రదేశ్ తరఫున బరిలో దిగిన రిజ్వీ దంచికొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 20 సిక్సర్లు, 13 ఫోర్లు ఉండటం గమనార్హం.
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ
ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ సమీర్ రిజ్వీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 97 బాల్స్‌లోనే డబుల్ సెంచరీ సాధించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.
20 సిక్స్‌లు...
అండర్ 23 స్టేట్ ఏ లెవెల్ ట్రోఫీలో త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో ఉత్తర ప్రదేశ్ తరఫున బరిలో దిగిన సమీర్ రిజ్వీ దంచికొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 20 సిక్స్‌లు, పదమూడు ఫోర్లు ఉండటం గమనార్హం. ఈ వన్డే మ్యాచ్‌లో 23వ ఓవర్‌లో బ్యాటింగ్ దిగిన రిజ్వీ త్రిపుర బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో వారిపై విరుచుకుపడ్డాడు. సమీర్ రిజ్వీ దెబ్బకు ఉత్తర ప్రదేశ్ యాభై ఓవర్లలో 405 పరుగులు చేసింది.
97 బాల్స్‌లో 210 రన్స్...
చివరి ఓవర్ వరకు బ్యాటింగ్ చేసిన రిజ్వీ 97 బాల్స్‌లో 201 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గతంలో డొమెస్టిక్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డ్ ఇండియాకు చెందిన నారాయణ్ జగదీషన్‌తో పాటు ఆస్ట్రేలియన్ హిట్టర్ ట్రావిస్ హెడ్ పేరిట ఉంది. వీరిద్దరు 114 బాల్స్‌లో డబుల్ సెంచరీలు సాధించారు.
హెడ్, జగదీషన్ రికార్డులను సమీర్ రిజ్వీ తిరగరాశాడు. ఈ టోర్నీలో గత రెండు మ్యాచుల్లో సమీర్ రిజ్వీ సెంచరీలు చేశాడు. ఓ మ్యాచ్‌లో 153, మరో మ్యాచ్‌లో 137 పరుగులు చేశాడు.
చెన్నై 8.4 కోట్లు...
ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో 95 లక్షలకు సమీర్ రిజ్వీని ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్నది. గత ఏడాది జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ సమీర్ రిజ్వీని 8.4 కోట్లకు కొన్నది. గత ఏడాది ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఇండియన్ క్రికెటర్లలో ఒకరిగా సమీర్ రిజ్వీ నిలిచాడు.
దేశవాళీలో అతడి ఫామ్ చూసి ఐపీఎల్‌లో అదరగొడతాడని సీఎస్‌కే భావించింది. కానీ సీఎస్‌కే యాజమాన్యం అంచనాల్ని పూర్తిగా వమ్ము చేశాడు సమీర్ రిజ్వీ. ఐదు మ్యాచుల్లో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో సీఎస్‌కే అతడిని వదలుకుంది. గత ఏడాదితో పోలిస్తే చాలా తక్కువ ధరకే ఈ వేలంలో సమీర్ రిజ్వీ అమ్ముడుపోయాడు. సమీర్ రిజ్వీ డబుల్ సెంచరీతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఖుషీ అవుతోంది.