Salman Butt on India: రోజంతా ఐపీఎల్ ఆడితే ఏమీ రాదు.. పాకిస్థానే ఫేవరెట్: ఇండియాను టార్గెట్ చేసిన పాక్ మాజీ కెప్టెన్
30 August 2023, 7:52 IST
Salman Butt on India: రోజంతా ఐపీఎల్ ఆడితే ఏమీ రాదు.. పాకిస్థానే ఫేవరెట్ అంటూ ఇండియాను టార్గెట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్. బ్యాటింగ్, బౌలింగ్ లలో పాకిస్థాన్ చాలా బలంగా ఉందని, ఇండియన్ టీమ్ లో కోహ్లి, రోహిత్ తప్ప ఎవరూ లేరని అన్నాడు.
సెప్టెంబర్ 2న తలపడనున్న ఇండియా, పాకిస్థాన్
Salman Butt on India: ఆసియా కప్ 2023లో భాగంగా శనివారం (సెప్టెంబర్ 2) ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాను టార్గెట్ చేస్తూ పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ రెచ్చగొట్టే కామెంట్స్ చేశాడు. రోజంతా ఐపీఎల్ ఆడినా.. ఇండోపాక్ మ్యాచ్ లో ఉండే ఒత్తిడిని తట్టుకోలేరని, ఇండియన్ టీమ్ లో కోహ్లి, రోహిత్ తప్ప ఎవరూ లేరని అతడు అనడం గమనార్హం.
పాకిస్థాన్ జట్టులో ఎంతో మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, బౌలింగ్, బ్యాటింగ్ లు పటిష్టంగా ఉన్నట్లు చెప్పాడు. "ఇండియా ఫాస్ట్ బౌలింగ్ చూస్తే ఫిట్‌నెస్ ఆందోళన కలిగిస్తోంది. చాలా రోజులుగా ప్లేయర్స్ ఫిట్ గా లేరు. వాళ్లు అలసిపోయారా లేక పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయగలరా చెప్పలేం. రోహిత్, కోహ్లి తప్ప మిగతా వాళ్లంతా యువకులే. వాళ్లు ఎంతో క్రికెట్ ఆడినా అనుభవం మాత్రం ఎక్కువ లేదు. రోహిత్ బాగా ఆడినప్పుడో, కోహ్లి చెలరేగినప్పుడో ఇండియా గెలిచింది. మిగతా వాళ్లపై భారం పడినప్పుడు ఆ టీమ్ ఇబ్బంది పడింది" అని సల్మాన్ భట్ అన్నాడు.
"పాకిస్థాన్ టీమ్ లో మాత్రం బాబర్, రిజ్వాన్, ఫఖర్, షాదాబ్, షహీన్, హరీస్ రౌఫ్ ఉన్నారు. నా అభిప్రాయం ప్రకారం పాకిస్థాన్ దగ్గరే ఎక్కువ కోర్ గ్రూప్ ఉంది. ఇండియాలోనూ జడేజా, షమి, బుమ్రా, రోహిత్, కోహ్లిలాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. కానీ వాళ్లు బ్యాటింగ్ బలహీనంగా ఉంది. పాకిస్థాన్ రెండు పెద్ద వికెట్లు తీసిందంటే ఇతరులపై చాలా భారం పడుతుంది. వాళ్లు పాకిస్థాన్ పై మ్యాచ్ గెలిపించలేరు" అని తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ భట్ అన్నాడు.
ఐపీఎల్ అనుభవం పనికి రాదు
ఈ సందర్భంగా ఐపీఎల్ ను కూడా అతడు ప్రస్తావించాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎంత ఐపీఎల్ ఆడినా.. పాక్ తో మ్యాచ్ లో ఆడే అనుభవం రాదని సల్మాన్ భట్ అన్నాడు. పాకిస్థాన్ దే కాస్త పైచేయిగా కనిపిస్తున్నట్లు స్పష్టం చేశాడు.
"గంటకు 90 మైళ్ల వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లు మా దగ్గర ఉన్నారు. ఒకరిద్దరు గంటకు 90 మైళ్ల వేగం అందుకుంటారు. మిగతా వాళ్ల దగ్గర అంత పేస్ లేదు. ఇది పాకిస్థాన్ కు అదనపు బలం. రెండు రకాల స్పిన్నర్లు ఉన్నారు. గంటకు 140 కి.మీ. వేగంతో బౌలింగ్ చేయగలిగే ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ పాక్ జట్టులో ఉన్నాడు" అని భట్ చెప్పాడు.
"ఇండియాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. కారణాలేవైనా చాలా కాలంగా పాకిస్థాన్ తో ఇండియా ఆడలేదు. వాళ్ల ప్లేయర్స్ ఎంత ఐపీఎల్ ఆడినా ఇలాంటి హైఓల్టేజ్ మ్యాచ్ ఆడిన అనుభవం వాళ్లకు లేదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎంత ఐపీఎల్ ఆడినా సరే.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ లో ఉండే ఒత్తిడికి సమానం కాదు" అని భట్ ముగించాడు.