Pakistan vs Nepal: నేపాల్‌తో ఆడబోయే పాకిస్థాన్ టీమ్ ఇదే.. నేటి నుంచే ఆసియా కప్
Asia Cup 2023: నేపాల్‌తో ఆడబోయే తమ తుది జట్టును పాకిస్థాన్ అనౌన్స్ చేసింది. ఆసియా కప్ 2023 బుధవారం (ఆగస్ట్ 30) నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
Asia Cup 2023: ఆసియా కప్ 2023 బుధవారం (ఆగస్ట్ 30) నుంచే ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్థాన్ తో నేపాల్ తలపడనుంది. మళ్లీ వన్డే ఫార్మాట్ లో జరగనున్న ఈ టోర్నీ.. వరల్డ్ కప్ కు ముందు ఆసియా జట్లకు సన్నాహకంగా ఉపయోగపడనుంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పాకిస్థాన్, నేపాల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
ఈ నేపథ్యంలో నేపాల్ తో ఆడబోయే తమ తుది జట్టును పాకిస్థాన్ అనౌన్స్ చేసింది. గత వారం ఆప్ఘనిస్థాన్ పై మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన పాక్.. ఆసియా కప్ కు కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్ కోసం తమ పూర్తి స్థాయి జట్టుతో పాకిస్థాన్ ఆడుతోంది. ముల్తాన్ లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం తమ ముగ్గురు స్టార్ పేస్ బౌలర్లనూ ఆ టీమ్ ఆడిస్తోంది.
అంతేకాదు ముగ్గురు స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్లకు కూడా తుది జట్టులో చోటు దక్కింది. ఎప్పటిలాగే పాక్ పేస్ బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్ లతో కూడిన బౌలింగ్ ఎలాంటి ప్రత్యర్థికైనా సవాలే. అటు బ్యాటింగ్ లోనూ ఆ టీమ్ స్ట్రాంగానే ఉంది. బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్, సల్మాన్ అఘాలాంటి బ్యాటర్లు పాక్ జట్టులో ఉన్నారు.
ఆసియా కప్ లో తొలిసారి ఆడుతున్న నేపాల్ పై పాక్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో చూడాలి. ఇప్పటి వరకూ కేవలం రెండుసార్లు మాత్రమే పాక్ టీమ్ ఆసియా కప్ గెలిచింది. గతేడాది ఫైనల్లో శ్రీలంక చేతుల్లో ఓడిపోయిన ఆ టీమ్.. ఈసారి ఇండియాతోపాటు ఫేవరెట్స్ లో ఒకటిగా బరిలోకి దిగుతోంది. శనివారం (సెప్టెంబర్ 2) ఇండియాతో కీలకమైన మ్యాచ్ నేపథ్యంలో నేపాల్ పై భారీ విజయం కోసం పాకిస్థాన్ తహతహలాడుతోంది.
పాకిస్థాన్ తుది జట్టు ఇదే
బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్, సల్మాన్ అఘా, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్