Pakistan vs Afghanistan: అఫ్గాన్‍పై పరాభవాన్ని తప్పించుకున్న పాకిస్థాన్.. ఒక్క బంతి మిగిలి ఉండగా ఉత్కంఠ గెలుపు-pakistan beat afghanistan in second odi by one wicket ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Pakistan Beat Afghanistan In Second Odi By One Wicket

Pakistan vs Afghanistan: అఫ్గాన్‍పై పరాభవాన్ని తప్పించుకున్న పాకిస్థాన్.. ఒక్క బంతి మిగిలి ఉండగా ఉత్కంఠ గెలుపు

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 24, 2023 11:46 PM IST

Pakistan vs Afghanistan: పాకిస్థాన్‍కు అఫ్గానిస్థాన్ చేతిలో కాస్తలో పరాభవం తప్పింది. రెండో వన్డేలో పాక్ ఒక వికెట్ తేడాతో గెలిచింది.

మ్యాచ్ గెలిచాక సంబరాల్లో పాకిస్థాన్ ప్లేయర్లు నసీమ్ షా, హరీస్ రావూఫ్
మ్యాచ్ గెలిచాక సంబరాల్లో పాకిస్థాన్ ప్లేయర్లు నసీమ్ షా, హరీస్ రావూఫ్ (AFP)

Pakistan vs Afghanistan: అఫ్గానిస్థాన్ చేతిలో పరాభవాన్ని కాస్తలో తప్పించుకుంది పాకిస్థాన్. రెండో వన్డేలో ఒక వికెట్ తేడాతో ఒక్క బంతి మిగిలి ఉండగా పాక్ గెలిచింది. శ్రీలంకలోని హంబన్‍తోట వేదికగా నేడు (ఆగస్టు 24) జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ ఒక వికెట్ తేడాతో అఫ్గానిస్థాన్‍పై ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‍ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో పాక్ దక్కించుకుంది. ఈ రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. అఫ్గాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (151 బంతుల్లో 151; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ ఇబ్రహీం జర్దాన్ (101 బంతుల్లో 80 పరుగులు) రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది రెండు, నసీమ్ షా, ఉసామా మిర్ చెరో వికెట్ పడగొట్టారు. 49.5 ఓవర్లలో పాకిస్థాన్ లక్ష్యాన్ని ఛేదించింది. 9 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసి గెలిచింది. ఇమాముల్ హక్ (91), కెప్టెన్ బాబర్ ఆజమ్ (53) హాఫ్ సెంచరీలతో రాణించగా.. చివర్లో షాబాద్ ఖాన్ (48) పాక్‍ను కాపాడాడు. చివరి ఓవర్లో రెండు వికెట్లు చేతిలో ఉండగా పాకిస్థాన్ గెలిచేందుకు 11 పరుగులు అవసరం కాగా హైడ్రామా నడిచింది. నాలుగు పరుగులు దక్కి.. తొలి బంతికే రనౌట్ జరిగింది. అయినా.. ఎట్టకేలకు చివరికి పాక్ విజయం సాధించింది. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ఫజల్ ఫారూకీ మూడు వికెట్లతో రాణించాడు. మ్యాచ్ ఎలా సాగిందంటే..

ట్రెండింగ్ వార్తలు

ఈ మ్యాచ్‍లో ముందుగా టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ ముందు బ్యాటింగ్‍కు దిగింది. అఫ్గాన్ ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీమ్ జర్దాన్ ఆరంభం నుంచి ఆచితూచి ఆడారు. వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. క్రమంగా పరుగులు తీస్తూనే వీలుచిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదారు. పాక్ బౌలర్లు శ్రమించిన వికెట్లు దక్కలేదు. దీంతో 10.2 ఓవర్లలో 50 పరుగుల మార్కును అఫ్గాన్ దాటింది. ఆ తర్వాత కూడా రహ్మానుల్లా, జర్దాన్ అదరగొట్టారు. ఈ క్రమంలో రహ్మానుల్లా 64 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. జర్దాన్ 71 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీల తర్వాత కూడా వారిద్దరూ జోరు కొనసాగించారు. బౌండరీలు సాధిస్తూ పరుగుల వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో రహ్మానుల్లా గుర్బాజ్ 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 40వ ఓవర్లో జర్దాన్‍ను పాక్ బౌలర్ ఉసామా మీర్ ఎట్టకేలకు ఔట్ చేశాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించిన గుర్బాజ్ 155 పరుగుల వద్ద ఔటయ్యాడు. చివర్లో వచ్చిన బ్యాటర్లు వేగంగా ఆడలేకపోవటంతో అద్భుత ఆరంభం వచ్చినా అఫ్గానిస్థాన్ 300 పరుగులకే పరిమితమైంది.

లక్ష్యఛేదనలో పాకిస్థాన్ చివరి వరకు పోరాడి గెలిచింది. ఫకర్ జమాన్ (30), ఇమాముల్ హక్ (91), కెప్టెన్ బాబర్ (53) రాణించటంతో ఓ దశలో పటిష్ట స్థితిలో నిలిచింది. పాక్ సునాయసంగానే గెలుస్తుందనిపించింది. అయితే, ఆ తర్వాత మహమ్మద్ రిజ్వాన్ (2), అఘా సల్మాన్ (14) విఫలమయ్యారు. అనంతరం ఉసామా మీర్ (0), ఇఫ్తికార్ అహ్మద్ (17) త్వరగా ఔట్ అయ్యారు. దీంతో పాక్ కష్టాల్లో కూరుతుంది. అయితే, మరో ఎండ్‍లో షాబాద్ ఖాన్ (48) అద్భుతంగా ఆడాడు. పాక్‍ను గెలుపు దిశగా నడిపించాడు. అయితే, చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి అతడు రనౌట్ అయ్యాడు. దీంతో 9 వికెట్లు కోల్పోయి పాక్ మళ్లీ కష్టాల్లో పడింది. అయితే, చివర్లో నసీమ్ షా (10 నాటౌట్), హరీస్ రావూఫ్ (3 నాటౌట్) రాణించి.. పాక్‍ను విజయతీరానికి చేర్చారు. ఒక్క బంతి మిగిలి ఉండగా.. 49.5 ఓవర్లలో పాక్ గెలిచింది. మిస్ ఫీల్డ్స్ సహా చివరి ఓవర్లో చాలా హైడ్రామా నడిచింది. మొత్తంగా అఫ్గానిస్థాన్‍పై పరాభవాన్ని పాక్ తప్పించుకుంది.

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సిరీస్‍లో చివరిదైనా మూడో వన్డే శనివారం (ఆగస్టు 26) జరగనుంది.

WhatsApp channel