Rohit Sharma: 2019 వరల్డ్ కప్ రిపీట్ చేస్తా.. మేం వరల్డ్ కప్ కొడతాం: రోహిత్ శర్మ
Rohit Sharma: 2019 వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తానని, తాము ఈసారి వరల్డ్ కప్ కొడతామని అన్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆసియా కప్ ముందు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు చాలా అంశాలపై స్పందించాడు.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు 2019 వరల్డ్ కప్ ఎప్పటికీ మరచిపోలేనిది. ఆ మెగా టోర్నీలో అతడు ఏకంగా 5 సెంచరీలు బాదాడు. ఏకంగా 648 రన్స్ చేశాడు. ఇప్పుడు 2023 వరల్డ్ కప్ లోనూ తాను అదే మైండ్‌సెట్ తో ఆడాలని అనుకుంటున్నానని, వచ్చే రెండు నెలల్లో ఈ జట్టుతో మరుపురాని జ్ఞాపకాలను ఏర్పరరచుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.
ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పీటీఐతో రోహిత్ శర్మ మాట్లాడాడు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై అతడు స్పందించాడు.
ఆ మూడ్‌లోకి వెళ్దామనుకుంటున్నా..
"స్వదేశంలో వరల్డ్ కప్ అంటే ఆ ఒత్తిడి వేరుగానే ఉంటుంది. అయితే బయటి నుంచి వచ్చే ఒత్తిళ్లను పట్టించుకోను. అన్నీ పక్కన పెట్టేయాలని అనుకుంటున్నా. 2019 వరల్డ్ కప్ ముందు ఉన్న దశలోకి వెళ్లాలని ఉంది. టోర్నమెంట్ కోసం బాగా సిద్ధమయ్యాను. మంచి మైండ్‌సెట్ తో ఉన్నాను. ఆ మైండ్‌సెట్ తిరిగి తీసుకురావాలని అనుకుంటున్నా. దానికి నాకు తగిన సమయం ఉంది" అని రోహిత్ అన్నాడు.
ఆ బాధ నాకూ తెలుసు..
ఇక వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయబోయే జట్టుపై స్పందిస్తూ.. ఇందులో కొందరికి చోటు దక్కకపోవచ్చని, 2011 వరల్డ్ కప్ లో తనకు చోటు దక్కనప్పుడు ఎలాంటి బాధ కలిగిందో తనకు తెలుసని అన్నాడు. "ఎన్నో కారణాల వల్ల కొందరికి జట్టులో స్థానం దక్కదు.
ఆ విషయాన్ని నేను, రాహుల్ భాయ్ (ద్రవిడ్) ఆ ప్లేయర్స్ కు వివరిస్తాం. ఎందుకు ఎంపిక చేయలేదో చెబుతాం. ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడతాం. వాళ్ల బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. 2011లో నన్ను ఎంపిక చేయనప్పుడు చాలా బాధ కలిగింది. వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కకపోతే ఎలా అనిపిస్తుందో నాకు తెలుసు" అని రోహిత్ అన్నాడు.
మనుషులుగా తప్పులు సహజం
"నేను, కోచ్‌లు, సెలక్టర్లు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. ప్రత్యర్థి, పిచ్‌లు, మా బలాలు, బలహీనతలు పరిశీలించిన నిర్ణయం తీసుకుంటాం. ప్రతిసారీ పర్ఫెక్ట్ గా ఉండదు. మనుషులుగా తప్పులు చేయడం సహజం. ప్రతిసారీ సరైన నిర్ణయమే తీసుకోకపోవచ్చు.
ఓ వ్యక్తి నచ్చలేదని తీసేయడం ఉండదు. వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో కెప్టెన్సీకి సంబంధం ఉండదు. ఎవరికైనా చోటు దక్కకపోతే దానికి ఓ కారణం ఉంటుంది. ఆ దురదృష్టవంతుల విషయంలో మేమేమీ చేయలేం" అని రోహిత్ అన్నాడు.
వచ్చే రెండు నెలల్లో నా లక్ష్యాన్ని అందుకుంటా
"విజయాలు, అపజయాలు ఓ వ్యక్తిని రాత్రికి రాత్రే మార్చేయలేవు. ఒక ఫలితం లేదంటే ఓ ఛాంపియన్‌షిప్ ఓ వ్యక్తిగా నన్ను మార్చలేవు. గత 16 ఏళ్లుగా వ్యక్తిగా నేనెప్పుడూ మారలేదు. ఆ విషయంలో మారాల్సిన అవసరం కూడా లేదు. వచ్చే రెండు నెలల్లో నా లక్ష్యాలను అందుకోవడంపై దృష్టిసారిస్తా. ఈ టీమ్ తో మంచి జ్ఞాపకాలను ఏర్పరచుకోవాలని అనుకుంటున్నాను" అని రోహిత్ స్పష్టం చేశాడు.