Akram on Team India: ఇండియా కనీసం ఫైనల్ కూడా చేరలేదు: ఆసియా కప్ ముందు వసీం అక్రమ్ వార్నింగ్
Akram on Team India: ఇండియా కనీసం ఫైనల్ కూడా చేరలేదు అంటూ ఆసియా కప్ ముందు వసీం అక్రమ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆసియా కప్ లో ఇండియా, పాకిస్థాన్ తోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్ లను కూడా తక్కువ అంచనా వేయకూడదని స్పష్టం చేశాడు.
Akram on Team India: ఆసియా కప్ కు ముందు ఇండియన్ క్రికెట్ టీమ్ కు వార్నింగ్ ఇచ్చాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్. గతేడాది ఈ టోర్నీలో ఇండియా కనీసం ఫైనల్ కూడా చేరలేదన్న విషయాన్ని గుర్తు చేశాడు. అంతేకాదు ఈ టోర్నీలో శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి జట్లను కూడా తక్కువ అంచనా వేయలేమని అతడు స్పష్టం చేశాడు.
ఆసియా కప్‌లో మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ గా భావించే ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ గురించి అక్రమ్ ను ప్రశ్నించగా.. అతడు ఇండియాకు ఓ హెచ్చరిక జారీ చేశాడు. 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇండియా, పాకిస్థాన్ తొలిసారి తలపడబోతున్నాయి. అంతేకాదు 2019 వరల్డ్ కప్ తర్వాత వన్డే ఫార్మాట్లో ఇండోపాక్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి.
ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ 2న ఈ దాయాదులు తలపడనున్నాయి. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. అయితే ఆసియా కప్ లో ఈ మ్యాచ్ కే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని, మిగతా మ్యాచ్ లకు అంతగా పట్టించుకోరన్న వాదన సరికాదని వసీం అక్రమ్ అన్నాడు. ఈ సందర్భంగా 2022 ఆసియా కప్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలని అతడు అన్నాడు.
"చివరిసారి ఇండియా, పాకిస్థాన్ ఫైనల్ జరుగుతుందని మనం అంచనా వేశాం. చివరికి శ్రీలంక విజేతగా నిలిచింది. మూడు జట్లూ ప్రమాదకరమైనవే. తమదైన రోజు ఈ జట్లన్నీ గెలుస్తాయి. ఇతర జట్లు కూడా పోటీ పడుతున్నాయి. చివరిసారి శ్రీలంక టైటిల్ గెలిస్తే.. ఇండియా కనీసం ఫైనల్ కూడా చేరలేదు" అని అక్రమ్ అన్నాడు.
ఇక ఆసియా కప్ కోసం పాకిస్థాన్ కు రాబోమని ఇండియా చెప్పడాన్ని పాక్ బోర్డు మరింత తీవ్రంగా పరిగణించాల్సిందా అనే ప్రశ్నకు కూడా అక్రమ్ స్పందించాడు. "స్పోర్ట్స్, పాలిటిక్స్ వేర్వేరుగా ఉంచాలని నేనెప్పుడూ చెబుతుంటాను. ప్రజల మధ్య సంబంధాలు చాలా ముఖ్యం. సగటు భారతీయుడు, పాకిస్థానీ ఒకరినొకరు గౌరవించుకుంటారు" అని అక్రమ్ అన్నాడు.