India vs Pakistan: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో ఆడే ఇండియా తుది జట్టు ఇదే: సంజయ్ మంజ్రేకర్
India vs Pakistan: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో ఆడే ఇండియా తుది జట్టు ఇదే అంటూ సంజయ్ మంజ్రేకర్ తన టీమ్ ఎంపిక చేశాడు. ఈ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 2న ఈ దాయాదులు తలపడనున్న విషయం తెలిసిందే.
India vs Pakistan: టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసియా కప్ లో పాకిస్థాన్ తో ఆడబోయే ఇండియా తుది జట్టును ఎంపిక చేశాడు. ఈ దాయాదుల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 2న శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇండియన్ టీమ్ ఎలా ఉంటే బాగుంటుందో మంజ్రేకర్ చెప్పాడు.
పాకిస్థాన్‌తో ఆడబోయే టీమిండియాలో ముగ్గురు పేస్ బౌలర్లకు మంజ్రేకర్ చోటివ్వడం గమనార్హం. బుమ్రా, సిరాజ్, షమిలతోపాటు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను నాలుగో పేస్ బౌలింగ్ ఆప్షన్ గా ఎంపిక చేశాడు. ఇక ఇద్దరు స్పిన్నర్ల విషయానికి వస్తే రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండాలని అతడు స్పష్టం చేశాడు. అక్షర్ పటేల్ ను పక్కన పెట్టాడు.
అంతేకాదు తొలి మ్యాచ్ సమయానికి గాయం నుంచి పూర్తిగా కోలుకుంటాడా లేదా అన్న సందేహం ఉన్నా కూడా కేఎల్ రాహుల్ కు మంజ్రేకర్ తుది జట్టులో చోటివ్వడం విశేషం. ఓపెనర్లుగా రోహిత్, శుభ్‌మన్ గిల్ లకే అతడు అవకాశం ఇచ్చాడు. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ లేదా తిలక్ వర్మకు అవకాశం దక్కొచ్చని అంచనా వేశాడు.
"నేనైతే సీమర్లుగా బుమ్రా, షమి, సిరాజ్ లను తీసుకుంటాను. హార్దిక్ పాండ్యా నాలుగో సీమ్ బౌలర్. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్. ఓపెనర్లు రోహిత్, గిల్. మూడో స్థానంలో కోహ్లి. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ కాబట్టి ఆడతాడు. మిడిలార్డర్ లో శ్రేయస్ అయ్యర్ లేదా తిలక్ వర్మ ఆడతారు. తిలక్ పేరు ఎందుకు చెబుతున్నానంటే మొదటి ఆరుగురు బ్యాటర్లు రైట్ హ్యాండర్లే. హార్దిక్ పాండ్యాతో కలిపి. అందుకే తిలక్ వర్మను చేరిస్తే బాగుంటుంది" అని మంజ్రేకర్ స్పష్టం చేశాడు.
ఈ ఏడాది ఐపీఎల్ తోపాటు వెస్టిండీస్ తో టీ20 సిరీస్ లోనూ తిలక్ వర్మ తనను తాను నిరూపించుకున్నాడు. దీంతో అనూహ్యంగా ఆసియా కప్ జట్టులో చోటు దక్కింది. ఏడు టీ20ల్లో అతడు 174 రన్స్ చేశాడు.
పాకిస్థాన్ మ్యాచ్ కోసం మంజ్రేకర్ టీమ్ ఇదే
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్/తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్