Hardik Pandya : అంతా నేనే చేశా.. తనను తాను తిట్టుకున్న హార్దిక్ పాండ్యా-cricket news hardik pandya comments on ind vs wi 5th t20 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Hardik Pandya : అంతా నేనే చేశా.. తనను తాను తిట్టుకున్న హార్దిక్ పాండ్యా

Hardik Pandya : అంతా నేనే చేశా.. తనను తాను తిట్టుకున్న హార్దిక్ పాండ్యా

Anand Sai HT Telugu
Aug 14, 2023 10:18 AM IST

IND vs WI 5వ T20I : వెస్టిండీస్‌తో జరిగిన టీ20 ఐదో మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. దీంతో భారత్ సిరీస్ కోల్పోయింది. మ్యాచ్ అనంతం కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడాడు.

హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా (AFP)

IND vs WI 5వ T20I : వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్, ODI సిరీస్‌లను గెలుచుకున్న భారత జట్టు T20 సిరీస్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఐదో టీ20లో టీమిండియా విజయం సాధించలేకపోయింది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్‌లో జరిగిన కీలకమైన ఐదో టీ20 మ్యాచ్‌లో ఓడిపోవడంతో కరీబియన్ దీవుల్లో టీమ్ ఇండియా ఘోర అవమానాన్ని చవిచూసింది.

ఎనిమిది వికెట్ల విజయంతో వెస్టిండీస్ ఆరేళ్ల తర్వాత టీ20 సిరీస్‌లో భారత్‌ను ఓడించిన ఘనత సాధించింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో భారత్ తొలిసారిగా టీ20 సిరీస్‌ను కోల్పోయింది. మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా హార్దిక్ పాండ్యా మాట్లాడాడు.

పది ఓవర్ల తర్వాత ఆ జోరును కోల్పోయామని తెలిపాడు. దీనికి నేనే కారణమని తెలిపాడు. అప్పుడే నేను బ్యాటింగ్‌కి వచ్చానని, క్రీజులో నిలబడేందుకు ఎక్కువ సమయం తీసుకున్నట్టుగా వివరించాడు హార్దిక్. నేరుగా ఓటమికి బాధ్యత వహించాడు. పాండ్యా 18 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు.

'మా వాళ్లు బాగా ఆడారని నా అభిప్రాయం. కానీ ఆ సమయంలో నేను బాగా ఆడలేకపోయాను. మమ్మల్ని మేం ప్రశ్నించుకుంటున్నాం. ప్రయోగాలు చేస్తున్నాం. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ, నేను పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు.' అని హార్దిక్ అన్నాడు.

ఈ సిరీస్ నుంచి చాలా నేర్చుకున్నామని తెలిపాడు హార్దిక్. యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారని, వారికి క్రెడిట్ ఇవ్వాలని పేర్కొన్నాడు కొత్తగా ట్రై చేస్తున్నారని, ఇది చూసి సంతోషిస్తానని హార్దిక్ పాండ్యా చెప్పాడు. యువ ఆటగాళ్లు తమను తాము బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపాడు హార్దిక్. 'T20 ప్రపంచకప్ 2024కి ఇంకా చాలా సమయం ఉందని నేను భావిస్తున్నాను. మా లక్ష్యం వన్డే ప్రపంచకప్‌. కొన్నిసార్లు వైఫల్యం మంచిది. ఇది చాలా విషయాలు నేర్పుతుంది.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పూర్తిగా విఫలమైంది. సూర్యకుమార్, తిలక్ వర్మ (27) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. సూర్య 45 బంతుల్లో 61 పరుగులు చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వెస్టిండీస్ తరఫున రొమారియో షెపర్డ్ 4 వికెట్లు పడగొట్టాడు.

166 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 2వ ఓవర్‌లో వికెట్ కోల్పోయినా, ఆ తర్వాత బ్రాండన్ కింగ్ (85 నాటౌట్), నికోలస్ పూరన్ (47) సూపర్ బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. విండీస్ 18 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 171 పరుగులు చేసి విజయం సాధించింది.

Whats_app_banner