Dhoni vs Rohit: 2011 వరల్డ్ కప్ టీమ్‌లో రోహిత్ లేకపోవడానికి ధోనీయే కారణం: మాజీ సెలక్టర్
Dhoni vs Rohit: 2011 వరల్డ్ కప్ టీమ్‌లో రోహిత్ లేకపోవడానికి ధోనీయే కారణం అని మాజీ సెలక్టర్ రాజా వెంకట్ సంచలన విషయాన్ని వెల్లడించాడు. రోహిత్ స్థానంలో పియూష్ చావ్లాని తీసుకోవాలని ధోనీ సూచించాడట.
Dhoni vs Rohit: టీమిండియా వరల్డ్ కప్ గెలిచి 12 ఏళ్లు అవుతోంది. 2011లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో తాను లేనందుకు ఇప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ తరచూ బాధపడుతూనే ఉంటాడు. అంతకుముందు 2007లో అదే ధోనీ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉన్న రోహిత్.. 2011లో మాత్రం మిస్సయ్యాడు. దీనికి కారణం కూడా అప్పటి కెప్టెన్ ధోనీయే కావడం గమనార్హం.
ఈ విషయాన్ని తాజాగా ఆ సమయంలో సెలక్టర్ గా ఉన్న రాజా వెంకట్ వెల్లడించాడు. రోహిత్ శర్మను తీసుకోవడానికి అందరూ సుముఖంగానే ఉన్నా.. ధోనీ మాత్రం అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా కావాలని పట్టుబట్టినట్లు ఆ మాజీ సెలక్టర్ చెప్పాడు. చివరికి అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టన్ కూడా రోహిత్ వైపు మొగ్గు చూపినా.. ధోనీ మాత్రం వినలేదని తెలిపాడు.
"మేము జట్టును ఎంపిక చేయడానికి సమావేశమైనప్పుడు రోహిత్ ను తీసుకోవాలనే అనుకున్నాం. టీమ్ ను సెలక్ట్ చేసే సమయంలో 1 నుంచి 14 పేర్ల వరకూ అందరూ అంగీకరించారు. 15వ పేరుగా రోహిత్ శర్మను ప్రతిపాదించాం. కోచ్ గ్యారీ కిర్‌స్టర్ అది పర్ఫెక్ట్ సెలక్షన్ అని అన్నాడు.
కానీ ధోనీ మాత్రం వద్దన్నాడు. రోహిత్ స్థానంలో పియూష్ చావ్లాని తీసుకోవాలని సూచించాడు. దీంతో కోచ్ కిర్‌స్టెన్ కూడా అదే బెటర్ ఛాయిస్ అనుకుంటా అని అన్నాడు. అలా రోహిత్ శర్మకు జట్టులో చోటు దక్కలేదు" అని మాజీ సెలక్టర్ రాజా వెంకట్ తెలిపాడు.
ఆ 2011లోనే ఇండియా వరల్డ్ కప్ గెలవడంతో రోహిత్ ఇప్పటికీ ఆ జట్టులో లేనందుకు ఫీలవుతూనే ఉన్నాడు. ఇప్పుడదే రోహిత్ శర్మ 2023 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా ఉన్నాడు. అయితే ఆ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై గతంలోనే రోహిత్ తన అసంతృప్తిని వెల్లగక్కాడు. ఏ సెలక్టర్ కూడా తనతో ఆ విషయం చెప్పలేదని అన్నాడు. ఇప్పుడు రాజా వెంకట్ కూడా రోహిత్ చెప్పింది నిజమే అని ధృవీకరించాడు.