Kirsten on Gill: గిల్‌ను అప్పుడే కోహ్లి, సచిన్‌లతో పోల్చడమేంటి: గ్యారీ కిర్‌స్టెన్
Kirsten on Gill: గిల్‌ను అప్పుడే కోహ్లి, సచిన్‌లతో పోల్చడమేంటి అని అన్నాడు టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్. అయితే అతడికి అన్ని ఫార్మాట్లు ఆడే సత్తా ఉందని అన్నాడు.
Kirsten on Gill: జనరేషన్ మారుతుంటే అంతకుముందు జనరేషన్ లోని ప్లేయర్స్ తో పోల్చడం సహజమే. సచిన్ ను అప్పట్లో బ్రాడ్‌మన్ తో పోల్చారు. తర్వాత విరాట్ కోహ్లిని సచిన్ తో పోల్చారు. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ ను ఆ సచిన్, కోహ్లిలతో పోలుస్తున్నారు. అయితే టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ మాత్రం గిల్ ను అప్పుడే సచిన్, కోహ్లిలతో పోల్చడాన్ని తప్పుబట్టాడు.
ఈ యువ ఆటగాడిని కెరీర్ మొదట్లోనే ఆ ఇద్దరితో పోల్చడం సరికాదని స్పష్టం చేశాడు. అయితే అదే సమయంలో గిల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. "గిల్ ఓ యువ ఆటగాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదగడానికి కావాల్సిన అద్భుతమైన నైపుణ్యం, సంకల్పం అతని దగ్గర ఉన్నాయి. కానీ కెరీర్ మొదట్లోనే అతన్ని సచిన్, కోహ్లిలతో పోల్చడం సరికాదు" అని క్రిక్‌బజ్ తో మాట్లాడుతూ కిర్‌స్టెన్ అన్నాడు.
"ఇండియా తరఫున అన్ని ఫార్మాట్లలోనూ సక్సెస్ సాధించే ఆట అతని సొంతం. ఈ రోజుల్లో ఇలాంటివి మనం చూడలేం. ముఖ్యంగా టీ20 క్రికెట్ వేగంగా డెవలప్ అవుతున్న ఈ కాలంలో. ఇండియా తరఫున అన్ని ఫార్మాట్లలో గొప్ప ప్లేయర్ అయ్యే లక్షణాలు గిల్ లో ఉన్నాయి. అయితే ప్రతి ప్లేయర్ ఎదుర్కొనే సవాళ్లు, అడ్డంకులను అతడు ఎలా అధిగమిస్తాడన్నది అతని దీర్ఘకాల సక్సెస్ ను నిర్ణయిస్తుంది. నేర్చుకుంటూనే ఉండాలని మాత్రం అతనికి చెబుతాను" అని కిర్‌స్టెన్ అన్నాడు.
ఏడాది కాలంగా గిల్ టీమిండియా తరఫున నమ్మదగిన బ్యాటర్ గా ఎదిగాడు. అన్ని ఫార్మాట్లలోనూ సెంచరీలు చేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా సాధించాడు. ఇక ఈ మధ్యే ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ తరఫున మూడు సెంచరీలతోపాటు 890 పరుగులు చేసి లీగ్ చరిత్రలో ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన వారిలో కోహ్లి తర్వాత రెండోస్థానంలో నిలిచాడు.
సంబంధిత కథనం