MS Dhoni: జిమ్‍లో కనిపించిన ధోనీ.. కండలు చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు: ఫొటో వైరల్
MS Dhoni: 42 ఏళ్ల వయసులోనూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫుల్ ఫిట్‍నెస్‍తో ఉన్నారు. ఇటీవల రాంచీలోని ఓ జిమ్‍లో ఆయన కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ప్రపంచ వ్యాపంగా ఆయనను చాలా మంది ఇష్టపడతారు. అంతర్జాతీయ క్రికెట్‍కు వీడ్కోలు పలికి మూడేళ్లయినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. టీమిండియాకు రెండు ప్రపంచకప్‍లు సాధించిన ఏకైక కెప్టెన్‍గా ఘనత దక్కించుకున్న ధోనీ.. ఫిట్‍నెస్ విషయంలోనూ ఎప్పుడూ అత్యుత్తమంగా ఉంటారు. ధోనీని ఎంతో మంది యువ ఆటగాళ్లు స్ఫూర్తిగా తీసుకుంటుంటారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినా.. ఐపీఎల్‍లో చెన్నై సూపర్ కింగ్ తరఫున ఆడుతూనే ఉన్నారు ధోనీ. 42 ఏళ్ల వయసులోనూ ఫుల్ ఫిట్‌నెస్ మెయింటెన్ చేస్తున్నారు. ఇందుకోసం ధోనీ ఇప్పటికీ శ్రమిస్తూనే ఉన్నారు.
ఎంఎస్ ధోనీ తాజాగా రాంచీలోని ఓ జిమ్‍లో కనిపించారు. జిమ్‍లో వర్కౌట్స్ చేస్తూ కెమెరాలకు చిక్కారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 42 ఏళ్ల వయసులోనూ ధోనీ కండలు చూసి.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. భూమిపై ఫిట్టెస్ట్ ప్లేయర్ ధోనీనే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ 2024 కోసం ఎదురుచూస్తున్నామంటూ రాసుకొస్తున్నారు. మరికొందరేమో.. ధోనీని చూసైనా టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్ (CKS) జట్టును విజేతగా నిలిపాడు ఎంఎస్ ధోనీ. అతడి సారథ్యంలో సీఎస్‍కే ఐదో టైటిల్ గెలుచుకుంది. ఐపీఎల్‍లో మోస్ట్ సక్సెస్‍ఫుల్ టీమ్‍గా ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నా.. తిరిగి పూర్తి ఫిట్‍నెస్ సాధించే పనిలో ఉన్నారు ధోనీ.
తన శరీరం సహకరిస్తే 2024 ఐపీఎల్ కూడా ఆడతానని ఈ ఏడాది ఫైనల్ గెలిచాక ధోనీ చెప్పారు. దీంతో వచ్చే ఏడాది కూడా ఆయన ఆడతారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ధోనీ కూడా అదే దిశగా సన్నాహాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.
ధోనీ సారథ్యంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను కైవసం చేసుకుంది. ఐసీసీ ట్రోఫీల విషయంలో భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‍గా ధోనీ ఉన్నారు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‍కు ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవలే ఆ సందర్భానికి మూడేళ్ల గడిచింది.