Rohit Sharma: ఆ పిచ్చి పని మేము చేయం: ఆసియా కప్ టీమ్‌పై రోహిత్ శర్మ-cricket news in telugu rohit sharma reacted to asia cup team ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: ఆ పిచ్చి పని మేము చేయం: ఆసియా కప్ టీమ్‌పై రోహిత్ శర్మ

Rohit Sharma: ఆ పిచ్చి పని మేము చేయం: ఆసియా కప్ టీమ్‌పై రోహిత్ శర్మ

Hari Prasad S HT Telugu
Aug 21, 2023 03:18 PM IST

Rohit Sharma: ఆ పిచ్చి పని మేము చేయం అంటూ ఆసియా కప్ టీమ్‌పై రోహిత్ శర్మ స్పందించాడు. ఈ మెగా టోర్నీ కోసం సెలక్టర్లు సోమవారం (ఆగస్ట్ 21) జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (PTI)

Rohit Sharma: ఈ ఏడాది వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో అంతకుముందు జరగబోయే ఆసియా కప్ కు ఎక్కడ లేని ప్రాధాన్యత ఏర్పడింది. ఈ టోర్నీ కోసం సోమవారం (ఆగస్ట్ 21) జట్టును ప్రకటించారు సెలక్టర్లు. 17 మంది సభ్యుల ఆసియా కప్ టీమ్ లోకి రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి రాగా.. తొలిసారి హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ కూడా వచ్చాడు. వన్డేల్లో విఫలమవుతున్నా సూర్యకుమార్ కు కూడా అవకాశం ఇచ్చారు.

ఈ జట్టుపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. మిడిలార్డర్ లోని ప్లేయర్స్ ఫ్లెక్సిబుల్ గా ఉండాలని ఈ సందర్భంగా రోహిత్ అన్నాడు. అయితే దానికి అర్థమేంటో కూడా అతడు వివరించే ప్రయత్నం చేశాడు. "మీకు అర్థమయ్యేలా చెబుతాను. ఫ్లెక్సిబిలిటీ అంటే ఓపెనర్ ను ఏడోస్థానంలో పంపించడమో లేదంటే హార్దిక్ పాండ్యాతో ఓపెనింగ్ చేయించడం కాదు.

గత నాలుగైదేళ్లుగా కోహ్లి మూడోస్థానంలో వస్తున్నాడు. 4, 5 స్థానాల్లో వచ్చే కొత్త ప్లేయర్స్ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. నా కెరీర్లోనూ నేను అదే చేశాను. నేను మాట్లాడే ఫ్లెక్సిబిలిటీ అదీ. ఓపెనర్ ను కింద పంపించడం అనేది ఉండదు. అది పిచ్చితనం. ఆ పని మేము చేయం" అని రోహిత్ అనడం విశేషం.

ఇక నాలుగో స్థానంలో ఎవరూ నిలదొక్కుకోకపోవడంపై కూడా రోహిత్ స్పందించాడు. "నాలుగోస్థానంలో ఆడే ప్లేయర్స్ మా దగ్గర ఉన్నారు. అదొక్క స్థానమే కాదు.. మాకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. ప్లేయర్స్ ను ఒత్తిడికి గురి చేయడం, దురదృష్టవశాత్తూ అయిన గాయాల కారణంగా ఇతరులను ప్రయత్నించాల్సి వచ్చింది. లెఫ్ట్ హ్యాండర్ అయిన అక్షర్ పటేల్ ను కూడా ట్రై చేశాం" అని రోహిత్ అన్నాడు.

శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్ గా ఉన్నాడని, రాహుల్ పై స్పష్టత లేకపోవడంతో స్టాండ్‌బైగా సంజూ శాంసన్ ను ఎంపిక చేసినట్లు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ఆసియా కప్ తొలి మ్యాచ్ సమయానికి రాహుల్ కూడా పూర్తి ఫిట్ నెస్ సాధిస్తాడన్న నమ్మకం ఉన్నట్లు చెప్పాడు. ఇక ఆసియా కప్ జట్టులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ లాంటి ఆల్ రౌండర్లు కూడా ఉన్నారు.

వీళ్లపై రోహిత్ స్పందిస్తూ.. ఉన్నవాళ్లతోనే పని కానివ్వాలని అన్నాడు. ఇక వరల్డ్ కప్ పై కూడా రోహిత్ స్పందించాడు. "అండర్ డాగ్స్, ఫేవరెట్స్ ట్యాగ్స్ పై నాకు నమ్మకం లేదు. గెలవాలంటే బాగా ఆడాలి. అన్ని జట్లూ గెలవడానికే ఆడతాయి. స్వదేశంలో ఆడటం కాస్త లబ్ధి చేకూర్చేదే. కానీ అదే సమయంలో చాలా మంది విదేశీ క్రికెటర్లు కూడా ఈ మధ్యే ఇండియాలో ఎక్కువ క్రికెట్ ఆడుతున్నారన్నది గుర్తుంచుకోవాలి" అని రోహిత్ అన్నాడు.

Whats_app_banner