Akhtar on Kohli: ఆ దేవుడే కోహ్లితో ఆ ఇన్నింగ్స్ ఆడించాడు: ఆ టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌పై షోయబ్ అక్తర్-cricket news in telugu akhtar says god was telling kohli to play that innings against pakistan ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Akhtar On Kohli: ఆ దేవుడే కోహ్లితో ఆ ఇన్నింగ్స్ ఆడించాడు: ఆ టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌పై షోయబ్ అక్తర్

Akhtar on Kohli: ఆ దేవుడే కోహ్లితో ఆ ఇన్నింగ్స్ ఆడించాడు: ఆ టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌పై షోయబ్ అక్తర్

Hari Prasad S HT Telugu
Aug 18, 2023 04:26 PM IST

Akhtar on Kohli: ఆ దేవుడే కోహ్లితో ఆ ఇన్నింగ్స్ ఆడించాడు అంటూ గతేడాది టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌పై షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ టోర్నీలో పాకిస్థాన్ పై కోహ్లి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి గెలిపించిన విషయం తెలిసిందే.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (Getty)

Akhtar on Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చి శుక్రవారానికి (ఆగస్ట్ 18) సరిగ్గా 15 ఏళ్లవుతోంది. 2008లో సరిగ్గా ఇదే రోజు కోహ్లి టీమిండియా తరఫున తన తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ 15 ఏళ్లలో కోహ్లి ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. అయితే గతేడాది టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో మ్యాచ్ లో విరాట్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం తన కెరీర్లోనే చిరస్మరణీయమైనదని చెప్పొచ్చు.

ఈ మ్యాచ్ గురించి పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లిని ఆకాశానికెత్తేశాడు. అతన్ని మరోసారి కింగ్ ను చేసిన ఇన్నింగ్స్ అది అని, ఆ దేవుడే ఆ ఇన్నింగ్స్ ఆడించాడని అక్తర్ అనడం విశేషం. రెవ్‌స్పోర్ట్స్ లో బ్యాక్‌స్టేజ్ విత్ బోరియాలో అక్తర్ మాట్లాడాడు.

"ఆ మ్యాచ్ మొత్తం విరాట్ కోహ్లిదే. అతని కోసం ఆ క్రికెట్ దేవుళ్లు ఆ పని చేయించారు. అతడు అప్పటికి ఫామ్ లో లేడు. ఇండియాలోని అభిమానుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. మీడియా అతని వెంట పడింది. కానీ ఆ దేవుడు ఇదే నీకు మంచి తరుణం.. వచ్చి మరోసారి కింగ్ అయిపో అని చెప్పినట్లుంది. స్టేడియంలో లక్ష మంది ప్రేక్షకులు, ఇండియాలో 130 కోట్ల మంది, పాకిస్థాన్ లో 30 కోట్ల మంది, ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. అంతకుమించిన వేదిక కోహ్లికి ఏముంటుంది? హరీస్ రవూఫ్ బౌలింగ్ లో అతడు కొట్టిన ఆ రెండు సిక్సర్లు.. అతనికి తన రాజ్యాన్ని తిరిగి సంపాదించి పెట్టాయి" అని అక్తర్ అన్నాడు.

ఇక ఇప్పుడు ఇండియాలో జరగబోతున్న వన్డే వరల్డ్ కప్ పై కూడా అక్తర్ స్పందించాడు. ఈ వరల్డ్ కప్ తర్వాత అసలు వన్డే ఫార్మాట్ పరిస్థితేంటో తెలియదని, అందుకే ఈ మెగా టోర్నీలో రాణించి సత్తా చాటాలని పాకిస్థాన్ ప్లేయర్స్ కు అక్తర్ సూచించాడు.

"ఈ వరల్డ్ కప్ 50 ఓవర్ల ఫార్మాట్ లో జరగబోయే అద్భుతమైన టోర్నీ అనిపిస్తోంది. ఈ టోర్నీ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్ పరిస్థితేంటో నాకు తెలియదు. అందుకే ఆటకే ఈ టోర్నీ గొప్ప సందర్భమని చెప్పొచ్చు. అందుకే నేను పాకిస్థాన్ టీమ్ లోని బాబర్, షహీన్, నసీమ్ లకు ఒకటే చెప్పదలచుకున్నా. మీరు మళ్లీ ఇండియాలో ఆడతారో లేదో అలాంటిది మళ్లీ జరుగుతుందో లేదో కూడా చెప్పలేం. అందుకే ప్రతి పాకిస్థాన్ ప్లేయర్ ఈ సందర్భాన్ని ఆస్వాదించాలి. 2025లో పాకిస్థాన్ కు ఇండియా వస్తుందని అనుకుంటున్నాను" అని అక్తర్ అన్నాడు.

Whats_app_banner