Virat Kohli: కోహ్లి తన కెరీర్లో వికెట్ల మధ్య 510 కి.మీ. పరుగెత్తాడన్న విషయం మీకు తెలుసా?-cricket news in telugu virat kohli ran over 500 km between the wickets ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: కోహ్లి తన కెరీర్లో వికెట్ల మధ్య 510 కి.మీ. పరుగెత్తాడన్న విషయం మీకు తెలుసా?

Virat Kohli: కోహ్లి తన కెరీర్లో వికెట్ల మధ్య 510 కి.మీ. పరుగెత్తాడన్న విషయం మీకు తెలుసా?

Hari Prasad S HT Telugu
Aug 18, 2023 12:33 PM IST

Virat Kohli: కోహ్లి తన కెరీర్లో వికెట్ల మధ్య 510 కి.మీ. పరుగెత్తాడన్న విషయం మీకు తెలుసా? శుక్రవారం (ఆగస్ట్ 18)తో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అతనికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఒకసారి చూద్దాం.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (BCCI Twitter)

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టి శుక్రవారానికి (ఆగస్ట్ 18) సరిగ్గా 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ దశాబ్దంన్నర కాలంలో కోహ్లి ఎన్ని రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఆ రికార్డులేంటో చాలా వరకూ అభిమానులకు తెలుసు. అయితే అతను క్రికెట్ ఫీల్డ్ లో సాధించిన కొన్ని ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

క్రికెట్ పిచ్‌పై 510 కి.మీ. పరుగు

22 గజాల క్రికెట్ పిచ్ పై విరాట్ కోహ్లి 510 కి.మీ. పరుగెత్తాడన్న విషయం మీకు తెలుసా? ఈ 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ మాత్రమే తీసుకుంటే.. అతడు బౌండరీల రూపంలో చేసిన రన్స్ కాకుండా సింగిల్స్, డబుల్స్, ట్రిబుల్స్ రూపంలో చేసిన రన్స్ చూస్తే అతడు ఈ స్థాయిలో పరుగెత్తినట్లు ఈఎస్పీఎన్‌క్రికిన్ఫో రిపోర్టు వెల్లడించింది.

తాను కొట్టిన రన్స్ కోసం 277 కి.మీ., నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉంటూ సహచరులు కొట్టిన రన్స్ కోసం 233 కి.మీ. మేర పరుగెత్తినట్లు లెక్కగట్టారు. కెరీర్లో ఒక్కసారి 2013లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో మాత్రమే కోహ్లి నాలుగు పరుగులు తీశాడు.

చేజింగ్ కింగ్

కోహ్లి చేజింగ్ కింగ్ అని అందరికీ తెలుసు. కానీ టీ20 వరల్డ్ కప్ లలో అతని చేజింగ్ రికార్డు అత్యద్భుతం. 2014, 2016లలో కోహ్లి ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డు గెలిచాడు. ఈ రెండు టోర్నీలలో పది చేజింగ్ మ్యాచ్ లలో ఇండియా 9 గెలిచింది. వీటన్నింటిలో కోహ్లి బ్యాటింగ్ చేయగా.. 8సార్లు అజేయంగా నిలిచాడు. ఆ పది మ్యాచ్ లలో కోహ్లి సగటు 270.5 కావడం విశేషం. ఇక విజయవంతమైన చేజింగ్ లు మాత్రమే చూస్తే కోహ్లి సగటు 518 అంటే నమ్మగలరా?

83 వేదికల్లో 46 సెంచరీలు

విరాట్ కోహ్లి ప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్లలో 83 గ్రౌండ్లలో మ్యాచ్ లు ఆడాడు. అందులో 46 మైదానాల్లో సెంచరీలు చేయడం విశేషం. అందులో ఆస్ట్రేలియాలోని అడిలైడ్ లోనే కోహ్లి 5 సెంచరీలు చేశాడు. కోహ్లి కంటే ఎక్కువగా 53 వేదికల్లో సెంచరీలతో సచిన్ మాత్రమే ముందున్నాడు.

ప్రతి దేశంలో సెంచరీ

ఇక వన్డే క్రికెట్ లో కోహ్లి ఆడిన 9 దేశాల్లోనూ కనీసం ఒక సెంచరీ చేశాడు. ఇక టెస్టుల విషయానికి వస్తే 8 దేశాల్లో ఏడింట్లో సెంచరీలు చేశాడు. ఒక్క బంగ్లాదేశ్ లో మాత్రమే చేయలేకపోయాడు. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, సౌతాఫ్రికా, వెస్టిండీస్ లాంటి ఆరు దేశాల్లో వన్డే, టెస్టు సెంచరీలు చేశాడు.

చేజింగ్‌లలో 26 సెంచరీలు

తనకు బాగా కలిసివచ్చిన వన్డే క్రికెట్ లో చేజింగ్ లలో కోహ్లి ఏకంగా 26 సెంచరీలు చేశాడు. క్రికెట్ గాడ్ సచిన్ (17) కంటే ఇప్పటికే 9 సెంచరీలు ఎక్కువ చేశాడు. ఓవరాల్ గా కూడా మరో నాలుగు సెంచరీలు చేస్తే వన్డేల్లో సచిన్ (49) సెంచరీలను మించుతాడు.

Whats_app_banner