Shreyas Rahul batting: రాహుల్, శ్రేయస్ బ్యాటింగ్.. పంత్ షేర్ చేసిన స్పెషల్ వీడియో
Shreyas Rahul batting: రాహుల్, శ్రేయస్ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నేషనల్ క్రికెట్ అకాడెమీలో వీళ్లిద్దరూ బ్యాటింగ్ చేస్తున్న స్పెషల్ వీడియోను వికెట్ కీపర్ రిషబ్ పంత్ షేర్ చేశాడు.
Shreyas Rahul batting: గాయాల కారణంగా చాలా రోజులుగా టీమిండియాకు దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్సీఏ)లో కొంతకాలంగా ఫిట్‌నెస్ పై దృష్టి సారించిన ఈ బ్యాటర్లు.. సోమవారం (ఆగస్ట్ 14) ఓ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడారు. ఈ వీడియోను వికెట్ కీపర్ రిషబ్ పంత్ షేర్ చేశాడు.
గతేడాది కారు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన పంత్ కూడా ప్రస్తుతం ఎన్సీఏలోనే ఉన్నాడు. అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. దీంతో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ను అతడు బయట నుంచి చూస్తూ వీడియో తీశాడు. ఆసియా కప్ కు తిరిగి వస్తారని భావిస్తున్న రాహుల్, శ్రేయస్ ఈ మ్యాచ్ లో కలిసి ప్రాక్టీస్ చేశాడు. రాహుల్ తొడ గాయానికి, శ్రేయస్ వెన్ను గాయానికి గురైన విషయం తెలిసిందే.
ఈ ఇద్దరూ ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొంతకాలంగా నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. తొలిసారి ఓ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడారు. ఆసియా కప్ దగ్గర పడుతుండటంతో వీళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ ఎంతో కీలకం కానుంది. వీళ్లు మ్యాచ్ ఆడుతున్న వీడియో వైరల్ గా మారింది. మరోవైపు పంత్ కూడా ఊహించిన దాని కంటే వేగంగానే కోలుకుంటున్నాడు.
అయితే అతడు ఇప్పట్లో టీమిండియాలోకి తిరిగి వచ్చే అవకాశాలైతే లేవు. వచ్చే ఏడాదే మళ్లీ పంత్ అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కారు ప్రమాదం తర్వాత అతనికి మూడు సర్జరీలు నిర్వహించారు. వాటి నుంచి కోలుకున్న పంత్.. ప్రస్తుతం సులువుగా నడవడం, మెట్లు ఎక్కడం చేస్తున్నా క్రీజులో అతని శరీర కదలికలు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు.
దీనికి మరో రెండు నెలల సమయం పడుతుందని ఎన్సీఏలోని కోచ్ లు చెబుతున్నారు. ఇక రాహుల్, శ్రేయస్ లేక టీమిండియా మిడిలార్డర్ బలహీనమైన వేళ.. ఈ ఇద్దరూ ఆసియా కప్ కోసం తిరిగి వస్తారన్న ఆశతో అభిమానులు ఉన్నారు.
సంబంధిత కథనం