Rishabh Pant: పంత్ రికవరీ అప్‌డేట్.. 140 కి.మీ. వేగంతో విసిరే బంతులనూ ఎదుర్కొంటున్నాడు
Rishabh Pant: పంత్ రికవరీ అప్‌డేట్ వచ్చేసింది. అతడు నేషనల్ క్రికెట్ అకాడెమీలో గంటకు 140 కి.మీ. వేగంతో విసిరే బంతులనూ ఎదుర్కొంటున్నాడని అక్కడి వర్గాలు వెల్లడించాయి.
Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చాలా వేగంగా కోలుకుంటున్నాడు. గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన అతడు.. తర్వాత మూడు సర్జరీలు చేయించుకున్నాడు. అయితే ప్రస్తుతం పంత్ రికవరీ మాత్రం చాలా ఫాస్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్సీఏ)లో పంత్ రీహ్యాబిలిటేషన్ లో ఉన్నాడు.
అంతేకాదు అక్కడ గంటలకు 140 కి.మీ.కిపైగా వేగంతో విసిరే బంతులను కూడా పంత్ ఎదుర్కొంటుండటం విశేషం. అయితే ఇప్పుడప్పుడే ప్రొఫెషనల్ క్రికెట్ లోకి తిరిగొచ్చేంత ఫిట్‌నెస్ మాత్రం సాధించలేదు. క్రీజులో అవసరమైనట్లుగా తన శరీరాన్ని మెల్లగా కదిలించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని రికవరీ చూసి ఎన్సీఏ సిబ్బంది కూడా ఆశ్చర్యపోతున్నారు.
సాధ్యమైనంత త్వరగా పంత్ తిరిగి క్రికెట్ లో అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. "రిషబ్ రికవరీ చాలా బాగుంది. గంటకు 140 కి.మీ.కుపైగా వేగంతో విసిరే బంతులను ఎదుర్కొంటున్నాడు. తన రికవరీలో వస్తున్న ప్రతి అడ్డంకినీ అతడు అధిగమించడం చూస్తుంటే సంతోషంగా ఉంది. అతడు బాగున్నాడు. శరీరాన్ని వేగంగా అటూఇటూ కదిలించడమే అతని తర్వాతి లక్ష్యం. వచ్చే రెండు నెలల్లో దీనిపై దృష్టి సారిస్తాం" అని ఎన్సీఏ వర్గాలు వెల్లడించాయి.
రాహుల్, శ్రేయస్ కూడా..
మరోవైపు గాయాల పాలైన స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడెమీలోనే రీహ్యాబిలిటేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం వీళ్లు నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లోకి తిరిగి అడుగుపెట్టేంత ఫిట్‌నెస్ సాధించలేదు.
ఆసియా కప్ సమయానికి రాహుల్ కోలుకునే అవకాశం ఉండగా.. శ్రేయస్ మరికాస్త ఎక్కువ సమయం తీసుకోనున్నాడు. వీళ్లిద్దరూ ఆసియా కప్ కు అందుబాటులోకి వస్తారని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఒకవేళ కుదరకపోతే సూర్యకుమార్, సంజూ శాంసన్ లకు వీళ్ల స్థానంలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.