Rishabh Pant: “ప్రపంచకప్‍కు పంత్‍ సిద్ధమయ్యే ఛాన్స్ లేదు.. ఐపీఎల్‍కు..”: భారత పేసర్ వ్యాఖ్యలు-rishabh pant wont be fit for odi world cup for sure also doubt for 2024 ipl says ishant sharma details inside ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rishabh Pant: “ప్రపంచకప్‍కు పంత్‍ సిద్ధమయ్యే ఛాన్స్ లేదు.. ఐపీఎల్‍కు..”: భారత పేసర్ వ్యాఖ్యలు

Rishabh Pant: “ప్రపంచకప్‍కు పంత్‍ సిద్ధమయ్యే ఛాన్స్ లేదు.. ఐపీఎల్‍కు..”: భారత పేసర్ వ్యాఖ్యలు

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 23, 2023 07:09 PM IST

Ishant Sharma on Rishabh Pant: రిషబ్ పంత్‍ రికవరీపై భారత పేసర్ ఇషాంత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్ ఇంకా చాలా కోలుకోవాలని చెప్పాడు.

రిషబ్ పంత్
రిషబ్ పంత్ (ANI)

Ishant Sharma on Rishabh Pant: భారత స్టార్ వికెట్ కీపర్, డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ పునరాగమనం కోసం టీమిండియా ఎదురుచూస్తోంది. క్రికెట్ అభిమానులు నిరీక్షిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్.. తీవ్రంగా గాయపడ్డాడు. చాలా రోజులు ఆసుపత్రి బెడ్‍పైనే ఉన్నాడు. ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఫిట్‍నెస్ సాధన చేస్తున్నాడు. పంత్.. బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడని బీసీసీఐ తాజాగా అప్‍డేట్ ఇచ్చింది. కాగా, టీమిండియాలోకి రిషబ్ పంత్ రీఎంట్రీపై భారత పేసర్ ఇషాంత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబర్ - నవంబర్ మధ్య జరిగే వన్డే ప్రపంచకప్‍ కల్లా రిషబ్ పంత్ సిద్ధం కాలేడని తాను కచ్చితంగా చెప్పగలనని ఇషాంత్ శర్మ చెప్పాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‍లోనూ పంత్ బరిలోకి దిగడం కష్టమేనని ఇషాంత్ చెప్పాడు. “వచ్చే ఏడాది ఐపీఎల్‍లోనూ పంత్‍ను చూడలేమేమో అని నాకు అనిపిస్తోంది. అది చాలా తీవ్రమైన యాక్సిడెంట్. అతడు కేవలం ఇప్పుడు బ్యాటింగ్, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇంకా, పరుగెత్తాలి, అటూ ఇటూ తిరగాలి.. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ పూర్తిస్థాయిలో చేయాలంటే ఇంకా ఫిట్‍నెస్ పరంగా చాలా మెరుగుపడాలి” అని జియో సినిమాతో ఓ కార్యక్రమంలో ఇషాంత్ చెప్పాడు.

అయితే, రిషబ్ పంత్‍కు రెండో సర్జరీ అవసరం రాకపోవడం మంచి విషయమని ఇషాంత్ చెప్పాడు. “మంచి విషయం ఏంటంటే.. అతడికి రెండోసారి సర్జరీ జరగలేదు. ఒకవేళ రెండో సర్జరీ జరిగి ఉంటే అతడి రీ ఎంట్రీకి చాలా సమయం పట్టేది. అతడికి ఓ సర్జరీ జరిగింది. దీంతో అతడు వన్డే ప్రపంచకప్‍కు సిద్ధం కాలేడని నేను చెప్పగలను. ఒకవేళ వచ్చే ఏడాది ఐపీఎల్‍కు అతడు రెడీ అయినా.. అది గొప్ప విషయమే” అని ఇషాంత్ వెల్లడించారు.

గతేడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదం తర్వాతి నుంచి టీమిండియాకు దూరమయ్యాడు పంత్. దీంతో భారత జట్టులో అతడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టెస్టు క్రికెట్‍లో పంత్‍ను చాలా మిస్ అవుతోంది టీమిండియా. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్‍ను కూడా పంత్ ఆడలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‍గా ఉన్న పంత్ ఈ ఏడాది ఆడకపోవడంతో.. ఆ జట్టుపై తీవ్ర ప్రభావం పడింది. ఈ ఏడాది ఐపీఎల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది.

మరోవైపు, రిషబ్ పంత్ మెరుగ్గా కోలుకుంటున్నాడని బీసీసీఐ తన మెడికల్ అప్‍డేట్‍లో పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి - ఫిబ్రవరి మధ్య స్వదేశంలో ఇంగ్లండ్‍తో జరిగే టెస్టు సిరీస్‍లో రిషబ్ పంత్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని బీసీసీఐ భావిస్తోంది. అయితే, ఇషాంత్ మాత్రం వచ్చే ఏడాది ఐపీఎల్‍కు కూడా పంత్ పూర్తిగా సిద్దమవడం కష్టమే అన్నట్టు చెప్పాడు.

Whats_app_banner

సంబంధిత కథనం