Team India: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. నాలుగో స్థానంలో ఎవరు రావాలి?: గవాస్కర్ సమాధానమిదే-virat kohli rohit sharma who should bat at number 4 sunil gavaskar answers ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. నాలుగో స్థానంలో ఎవరు రావాలి?: గవాస్కర్ సమాధానమిదే

Team India: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. నాలుగో స్థానంలో ఎవరు రావాలి?: గవాస్కర్ సమాధానమిదే

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 24, 2023 05:00 PM IST

Team India: ఆసియాకప్‍లో టీమిండియా కాంబినేషన్‍పై చాలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఓపెనింగ్ ఆప్షన్లు ఎక్కువగా ఉండటంతో బ్యాటింగ్ లైనప్‍పై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

Team India: ఆగస్టు 30న మొదలయ్యే ఆసియ్ కప్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ఇప్పటికే జట్టును సెలెక్టర్లు ప్రకటించగా.. విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంజూ శాంసన్, యజువేంద్ర చాహల్‍ను తీసుకోకపోవడంపై కొందరు విమర్శిస్తున్నారు. సంజూను రిజర్వ్ ప్లేయర్‌గా మాత్రమే తీసువకోడంపై ప్రశ్నిస్తున్నారు. అలాగే, ఆసియా కప్‍లో భారత జట్టు కాంబినేషన్‍లపైనా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శుభ్‍మన్ గిల్, కేఎల్ రాహుల్ ఇలా ఎక్కువ మంది ఓపెనింగ్ బ్యాటర్లు ఉండటంతో బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందోనని ఉత్కంఠ నెలకొంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీల్లో ఎవరో ఒకరు నాలుగో స్థానంలో బ్యాటింగ్ రావొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో భారత దిగ్గజం, మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని చెప్పారు.

టాప్ ఆర్డర్‌లో గందరగోళం సృష్టించడం సరికాదని తాను అనుకుంటున్నట్టు సునీల్ గవాస్కర్ చెప్పారు. రోహిత్ శర్మ ఓపెనర్‌గా వస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అవసరమైతే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ నాలుగో స్థానంలో పంపొచ్చని చెప్పారు.

“ప్రతీ జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్‍గా ఉండాలి. కానీ, టాప్ ఆర్డర్‌ను డిస్ట్రబ్ చేయకూడదు. రోహిత్ శర్మ.. బ్యాటింగ్ ఆర్డర్లో కింద ఆడాలని చూస్తున్నట్టు నాకు అనిపించడం లేదు. బ్యాటింగ్ ఆర్డర్ నంబర్ 4లో విరాట్ కోహ్లీని పంపవచ్చు” అని గవాస్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సంజూ శాంసన్, చాహల్‍ను తీసుకోకపోవడంపై కూడా గవాస్కర్ మాట్లాడారు. జట్టులో సమతూకాన్ని పరిగణనలోకి తీసుకొని సెలెక్టర్లు ఆ ఇద్దరిని పక్కనపెట్టి ఉండొచ్చని అన్నారు. ఒకవేళ ఎక్కువ పరుగులు చేసి ఉన్నా.. కొన్నిసార్లు టీమ్ బ్యాలెన్స్ మేరకు వేరే ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుందని అన్నారు. చివర్లో చాహల్ కన్నా కుల్దీప్ బ్యాటింగ్ మెరుగ్గా చేయగలడని గవాస్కర్ చెప్పారు. కుల్‍దీప్‍ను తీసుకోవడానికి అది కూడా ఓ కారణమే అని అన్నారు.

సెప్టెంబర్ 2న పాకిస్థాన్‍తో జరిగే మ్యాచ్‍తో టీమిండియా ఆసియాకప్‍లో పోరును మొదలుపెట్టనుంది.

ఆసియా కప్‍కు ఎంపికైన భారత జట్టు: శుభ్‍మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్‍దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ -

రిజర్వ్ ప్లేయర్: సంజూ శాంసన్

Whats_app_banner