Cricket News: రోహిత్ దూకుడు పెంచాలి.. డొమెస్టిక్ క్రికెట్ ఆడండి: కపిల్ దేవ్
17 August 2023, 9:21 IST
- Cricket News: రోహిత్ దూకుడు పెంచాలి.. కోహ్లి, రోహిత్ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని సూచించాడు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. దేశవాళీ క్రికెట్ చాలా ముఖ్యమని కూడా ఈ సందర్భంగా అతడు స్పష్టం చేశాడు.
రోహిత్, కోహ్లి డొమెస్టిక్ క్రికెట్ ఆడాలన్న కపిల్ దేవ్
Cricket News: టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లండ్ బజ్‌బాల్ స్టైల్ పై స్పందించిన అతడు.. నిజానికి ఈ ఫార్మాట్ లో దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉందని అనడం విశేషం. ఈ మధ్యే వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఇండియా ఇదే స్టైల్లో ఆడింది.
రోహిత్ తన టెస్ట్ కెరీర్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేయగా.. టెస్ట్ క్రికెట్ లో ఇండియా అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. టెస్ట్ క్రికెట్ లో దూకుడుగా ఆడాలని స్పష్టం చేశాడు. అంతేకాదు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దూకుడు పెంచాలని అతడు అనడం విశేషం.
"బజ్‌బాల్ అద్భుతంగా ఉంది. ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ సిరీస్ లలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సిరీస్ కూడా ఒకటి. క్రికెట్ ను అలాగే ఆడాలన్నది నా అభిప్రాయం. రోహిత్ బాగున్నాడు. కానీ అతడు మరింత దూకుడుగా ఉండాలి. ఇంగ్లండ్ లాంటి టీమ్స్ ఎలా ఆడుతున్నాయో చూడాలి. మనమే కాదు అన్ని క్రికెట్ దేశాలు కూడా దీనిపై ఆలోచించాలి. అన్ని జట్లూ డ్రా కంటే కూడా గెలవడంపైనే దృష్టి సారించాలి" అని కపిల్ అనడం విశేషం.
ఇక డొమెస్టిక్ క్రికెట్ చాలా ముఖ్యమని.. కోహ్లి, రోహిత్ ఎక్కువగా ఆడకపోవడంపై కపిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. "డొమెస్టిక్ క్రికెట్ చాలా ముఖ్యం. ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ లేదా ఎవరైనా టాప్ ప్లేయర్ ఎన్ని డొమెస్టిక్ మ్యాచ్ లు ఆడారు? టాప్ క్రికెటర్లు కాస్త ఎక్కువ డొమెస్టిక్ మ్యాచ్ లు ఆడాలి. ఇది యువ ప్లేయర్స్ కు తోడ్పడుతుంది" అని కపిల్ అన్నాడు.
శుక్రవారం (ఆగస్ట్ 18) నుంచి ఐర్లాండ్ తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ లో సీనియర్ ప్లేయర్స్ ఎవరూ లేరు. బుమ్రా మాత్రమే 11 నెలల తర్వాత తిరిగొచ్చి కెప్టెన్ హోదాలో ఐర్లాండ్ వెళ్లాడు. జట్టులోని మిగతా ప్లేయర్స్ అంతా యువకులే. ఇక ఈ సీనియర్ ప్లేయర్స్ అందరూ ఆసియా కప్ కోసం తిరిగి రానున్నారు.