WTC Points: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‍కు ఐసీసీ పెనాల్టీ.. భారత్, పాక్‍కు లాభం.. అందుకేనా అంటూ నెటిజన్ల ట్వీట్లు-icc punishment for england and australia big advantage for india pakistan netizens reacts ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Points: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‍కు ఐసీసీ పెనాల్టీ.. భారత్, పాక్‍కు లాభం.. అందుకేనా అంటూ నెటిజన్ల ట్వీట్లు

WTC Points: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‍కు ఐసీసీ పెనాల్టీ.. భారత్, పాక్‍కు లాభం.. అందుకేనా అంటూ నెటిజన్ల ట్వీట్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 03, 2023 05:05 PM IST

WTC Points: యాషెస్ సిరీస్‍లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాకు పెనాల్టీ వేసింది ఐసీసీ. ఇది భారత్, పాకిస్థాన్‍ జట్లకు లాభంగా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు.

యాషెస్ సిరీస్
యాషెస్ సిరీస్ (Reuters)

WTC Points: ఐసీసీ టెస్టు చాంపియన్‍షిప్ (WTC) 2023-25 సైకిల్ ఇటీవలే మొదలైంది. ఇప్పటికే కొన్ని జట్లు ఈ డబ్ల్యూటీసీ సైకిల్‍లో ఒక్కో సిరీస్ ఆడాయి. ప్రస్తుతం ఐసీసీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ టాప్‍లో ఉండగా.. టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. శ్రీలంకపై పాక్ ఇటీవల 2-0తో టెస్టు సిరీస్ గెలిచింది. వెస్టిండీస్ పర్యటనలో భారత్ 1-0తో టెస్టు సిరీస్‍ కైవసం చేసుకుంది. కాగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన యాషెస్ సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. అయితే, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‍కు ఐసీసీ భారీ పెనాల్టీ వేసింది. డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత విధించింది. ఇది పాకిస్థాన్, భారత్‍కు లాభించేలా ఉంది. వివరాలివే..

యాషెస్ సిరీస్‍లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆస్ట్రేలియాకు 10 డబ్ల్యూటీసీ పాయింట్లు, ఇంగ్లండ్‍కు 19 పాయింట్ల కోత విధించింది ఐసీసీ. యాషెస్ సిరీస్ ఫస్ట్ టెస్టుకు రెండు పాయింట్లు, రెండో టెస్టుకు తొమ్మిది, మూడో టెస్టుకు మూడు, ఐదో టెస్టుకు ఐదు పాయింట్లను కోల్పోయింది ఇంగ్లండ్. ఇక నాలుగో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా 10 పాయింట్లను ఆస్ట్రేలియా కోల్పోయింది. అయితే, వర్షం అంతరాయాలు కలిగినా నాలుగో, అయిదో టెస్టుల్లో ఓవర్ రేట్‍ను లెక్కించి డబ్ల్యూటీసీ పాయింట్లను కోత విధించడంపై ఐసీసీపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ పెనాల్టీ తర్వాత 10 పాయింట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా (30 శాతం) 18 పాయింట్లతో డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్‍లో మూడో స్థానంలో నిలిచింది. ఇక, ఏకంగా 19 పాయింట్ల పెనాల్టీకి గురైన ఇంగ్లండ్ (15 శాతం) 9 పాయింట్లతో టేబుల్‍లో ఐదో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ (100 శాతం) 24 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్ (66.67 శాతం) 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాకు భారీ పెనాల్టీ పడటంతో ఇది టీమిండియా, పాక్‍కు భారీ లాభంగా మారింది. ఇండియా కంటే ఆస్ట్రేలియా వద్ద పాయింట్లు ఎక్కువ ఉన్నా.. పర్సెంటేజ్ లెక్కల ప్రకారం ఆసీస్ ఓ స్థానం వెనుక ఉంది.

అయితే, 2025లో డబ్ల్యూటీసీ ఫైనల్ భారత్, పాకిస్థాన్ మధ్య జరిగేలా ఐసీసీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తోందని కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వర్షం పడి యాషెస్ సిరీస్‍లో చాలాసార్లు మ్యాచ్‍లకు అంతరాయం కలిగితే స్లో ఓవర్ రేట్ జరిగిందంటూ పాయింట్లలో కోత విధించడం ఏమిటో అర్థం కాలేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ఖరారయ్యే వరకు ఇతర జట్ల పాయింట్లలో ఐసీసీ కోత విధిస్తూనే ఉంటుందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్‍కు మరో రెండేళ్ల కాలం ఉంది. ఒకవేళ భారత్, పాక్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరితే ఈ మ్యాచ్‍కు క్రేజ్ మాత్రం విపరీతంగా ఉంటుంది.

ఐసీసీ టెస్టు చాంపియన్‍షిప్‍లో టెస్టు మ్యాచ్ గెలిస్తే జట్టుకు 12 పాయింట్లు, డ్రా చేసుకుంటే 6 పాయింట్లు దక్కుతాయి. గెలుపోటములను బట్టి పర్సెంటేజ్ కూడా లెక్కలో ఉంటుంది.

Whats_app_banner