Bazball in India: ఇంగ్లండ్ బజ్‌బాల్‌కు అసలు పరీక్ష ఇండియాలోనే: నాసిర్ హుస్సేన్
Bazball in India: ఇంగ్లండ్ బజ్‌బాల్‌కు అసలు పరీక్ష ఇండియాలోనే అని అన్నాడు ఆ టీమ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్. వచ్చే ఏడాది జనవరిలో ఐదు టెస్టుల కోసం ఇంగ్లండ్ టీమ్ ఇండియా రానున్న విషయం తెలిసిందే.
Bazball in India: టెస్ట్ క్రికెట్ కు బజ్‌బాల్ అనే దూకుడైన స్టైల్ అలవాటు చేసిన ఇంగ్లండ్ టీమ్.. దానిని తాము ఆడే ప్రతి జట్టుపై విజయవంతంగా ప్రయోగిస్తోంది. తాజాగా ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ లో విజయం సాధించలేకపోయినా.. ఇదే బజ్‌బాల్ స్టైల్ తో డ్రా చేసుకుంది. ఇప్పుడిక ఈ స్టైల్ ను ఇండియాపై ఇండియాలో ప్రయోగించడానికి సిద్ధమవుతోంది.
అయితే ఈ బజ్‌బాల్ కు అసలు పరీక్ష ఇండియాలో ఎదురు కాబోతోందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. స్పిన్ బౌలింగ్ లో బజ్‌బాల్ స్టైల్ అసలు ఆలోచించడానికే ఆసక్తికరంగా ఉందని అతడు చెప్పాడు. చెన్నైలో పుట్టిన ఈ ఇంగ్లండ్ మాజీ ప్లేయర్.. ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ దీనిపై స్పందించాడు. ఇంగ్లండ్ చివరిసారి 2021లో ఇండియాకు వచ్చినప్పుడు 1-3తో సిరీస్ ఓడిపోయింది.
"బజ్‌బాల్ తర్వాతి పరీక్ష ఇండియాలోనే. ఇండియాలో తర్వాతి సవాలు ఎదుర్కోబోతోంది. ఇండియా గురించి అందరికీ తెలుసు. ఇండియాలో టెస్ట్ క్రికెట్ అత్యంత కఠినమైన సవాళ్లలో ఒకటి. స్పిన్ బౌలింగ్ లో బజ్‌బాల్. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ బౌలింగ్ లో బజ్‌బాల్ ఆడటం అంటే ఆలోచించడానికే చాలా ఆసక్తికరంగా ఉంది" అని నాసిర్ హుస్సేన్ అన్నాడు.
కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ వచ్చిన తర్వాత ఈ బజ్‌బాల్ స్టైల్ తో ప్రత్యర్థులను భయపెడుతోంది ఇంగ్లండ్ టీమ్. తమ చివరి 17 టెస్టుల్లో 12 మ్యాచ్ లను ఇలాగే గెలిచింది. దీంతో కఠినమైన ఇండియా టూర్లోనూ ఇంగ్లండ్ ఇదే స్టైల్లో ఆడుతుందా అన్న ప్రశ్నలు ఇప్పటి నుంచే తలెత్తుతున్నాయి. దీనిపై కెప్టెన్ స్టోక్స్ కూడా స్పందిస్తూ.. ఇండియాలో ఏం జరుగుతుందో కాలమే చెప్పాలని అన్నాడు.
అటు ఆ టీమ్ ఓపెనర్ జాక్ క్రాలీ కూడా దీనిపై మాట్లాడాడు. ఇండియాలో తన కొత్త స్టైల్ ను పరీక్షించడం మంచి అవకాశమని అన్నాడు. "వాళ్ల గ్రౌండ్స్ గురించి నాకు పెద్దగా తెలియదు. ఇండియాలో కొన్నిసార్లు సీమ్, స్వింగ్ కూడా ఉంటుంది. వాళ్ల దగ్గర మంచి సీమ్ బౌలర్లు కూడా ఉన్నారు.
అయితే అక్కడ ఉన్న రెండు, మూడు గ్రౌండ్లయినా మాకు అనుకూలిస్తాయని అనుకుంటున్నా. ఒకవేళ స్పిన్ అయినా కూడా మేము స్పిన్ బాగానే ఆడతాం" అని క్రాలీ అన్నాడు. వచ్చే ఏడాది జనవరి 29 నుంచి హైదరాబాద్, వైజాగ్, రాంచీ, రాజ్‌కోట్, ధర్మశాలల్లో ఐదు టెస్టులు జరుగుతాయి.
సంబంధిత కథనం