T20 World Cup 2024: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఆ నెలలోనే! స్టేడియాలను పరిశీలించిన ఐసీసీ
T20 World Cup 2024: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణ షెడ్యూల్ గురించి ఐసీసీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే, అమెరికాలోని కొన్ని స్టేడియాలను ఐసీసీ టీమ్ పరిశీలించింది.
T20 World Cup 2024: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీకి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే, అమెరికాలోని క్రికెట్ స్టేడియాలను ఐసీసీ ఇప్పటి నుంచే పరిశీలిస్తోంది. తాజాగా, అమెరికాలోని కొన్ని మైదానాల్లో ఐసీసీ టీమ్ ఇన్స్‌పెక్షన్ నిర్వహించింది. దీంతో వెస్టిండీస్, అమెరికా వేదికగా వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఫ్లోరిడా, న్యూయార్క్, డల్లాస్, మార్స్ విల్లే, లౌడర్ హిల్‍లోని క్రికెట్ స్టేడియాలను ఐసీసీ బృందం పరిశీలించింది.
2024 టీ20 ప్రపంచకప్ టోర్నీని జూన్ 3వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ మధ్య నిర్వహించాలని ఐసీసీ ప్రస్తుతం భావిస్తోంది. ఈ సమయం అనుకూలంగా ఉంటుందని గుర్తించింది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి షెడ్యూల్‍ను ఖరారు చేయనుంది. అయితే, అమెరికాలో స్టేడియాల సన్నద్ధతను ఇప్పటి నుంచే పరిశీలించనుంది.
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఐదు టీ20ల సిరీస్‍లో చివరి రెండు మ్యాచ్‍లను ఫ్లోరిడాలోని లౌడర్ హిల్ స్టేడియంలో ఆడనుంది. అలాగే, ప్రస్తుతం డల్లాస్‍లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం, మోరిస్ విల్లేలోని చర్చ్ స్ట్రీట్ పార్క్ స్టేడియంలో మేజర్ క్రికెట్ లీగ్ మ్యాచ్‍లు జరుగుతున్నాయి. అయితే, న్యూయార్క్‌లోని వాన్ కోర్ట్ ల్యాండ్ పార్క్‌తో పాటు మరో రెండు స్టేడియాలకు ఐసీసీ నుంచి ఇంటర్నేషనల్ వెన్యూ స్టేటస్ దక్కలేదు. దీంతో ఈ స్టేడియాలు ఇంకా సిద్ధం కావాల్సి ఉంది.
2024 టీ20 ప్రపంచకప్‍లో ఏకంగా 20 దేశాల జట్లు పాల్గొననున్నాయి. సాధారణం కంటే.. వచ్చే ఏడాది వరల్డ్ కప్‍లో ఎక్కువ దేశాలకు ఛాన్స్ ఇచ్చింది ఐసీసీ.
అమెరికాలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‍లు జరగడం చాలా అరుదు. అయితే, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ గేమ్స్‌లో క్రికెట్‍కు చోటు దక్కే అవకాశాలను మెరుగుపరుచుకునేందుకే.. టీ20 ప్రపంచకప్‍ను అమెరికాలోనూ నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఒలింపిక్స్‌లో చోటు దక్కితే ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాల్లో క్రికెట్ పాపులర్ అవుతుందని ఐసీసీ ఆశిస్తోంది.
కాగా, భారత్ వేదికగా ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఈ మెగాటోర్నీకి ఇండియా ఆతిథ్యమివ్వనుంది. మొత్తం 10 జట్లు ఈ వరల్డ్ కప్‍లో తలపడనున్నాయి.