Chris Gayle: క్రిస్ గేల్ రీఎంట్రీ - ఐవీపీఎల్ లీగ్‌లో తెలంగాణ టైగర్స్‌కు కెప్టెన్‌గా విండీస్ హిట్టర్
09 February 2024, 8:05 IST
Chris Gayle: వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్ టీ20 క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్‌లో తెలంగాణ టైగర్స్‌కు క్రిస్ గేల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
క్రిస్ గేల్
Chris Gayle: టీ20 క్రికెట్‌లో క్రిస్ గేల్ మెరుపుల్ని క్రికెట్ ఫ్యాన్స్ మిస్సై చాలా కాలం అవుతోంది. అభిమానులకు ఈ విండీస్ హిట్టర్ గుడ్‌న్యూస్ వినిపించాడు. ఇండియన్ వెటరన్ లీగ్ ద్వారా మళ్లీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ లీగ్‌లో తెలంగాణ టైగర్స్ జట్టుకు క్రిస్ గేల్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాదు.
ఓల్డ్ ఈజ్ గోల్డ్...
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్‌తో తాను రీఎంట్రీ ఇవ్వబోతున్న విషయాన్ని క్రిస్ గేల్ స్వయంగా ప్రకటించాడు. దిగ్గజ క్రికెటర్లతో కలిసి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతుండటం ఆనందంగా ఉందని క్రిస్ గేల్ అన్నాడు. మళ్లీ ఈ యూనివర్స్ బాస్ మీ ముందుకు రాబోతున్నట్లు గేల్ ప్రకటించాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ వెటరన్ ప్రీమియర్ లీగ్ గురించి గేల్ వ్యాఖ్యానించాడు. అసలైన క్రికెట్ మజాను ఎంజాయ్ చేసేందుకు ఐవీపీఎల్ లీగ్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ గేల్ అన్నాడు. అతడి రీఎంట్రీ ప్రకటనతో అభిమానులు ఖుషి అవుతోన్నారు.
డెహ్రడూన్‌లో...
ఇండియన్ వెటరన్ లీగ్ ఈ ఏడాదే మొదలుకానుంది. ఫస్ట్ సీజన్‌ను డెహ్రడూన్‌లో నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 3 వరకు తొమ్మిది రోజుల పాటు డెహ్రడూన్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో ఈ టోర్నీ జరుగనుంది. బెటరన్ క్రికెట్ బోర్డ్‌తో పాటు 100 స్పోర్ట్స్ అనే సంస్థ ఈ ఐవీపీఎల్ లీగ్‌ను నిర్వహించబోతున్నది.
తెలంగాణ టైగర్స్...
తెలంగాణ టైగర్స్ జట్టుకు గేల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ టీమ్‌లో గేల్‌తో పాటు ఇండియన్ క్రికెటర్స్ మన్‌ప్రీత్ గోనీ, సుదీప్ త్యాగి ఆడబోతున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ రికార్డో పావెల్ కూడా తెలంగాణ టైగర్స్ తరఫున ఇండియన్ వెటరన్ లీగ్‌లో బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది.
రైనా, పఠాన్ కూడా...
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్‌లో పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు ఆడబోతున్నట్లు తెలుస్తోంది. వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, యూసుఫ్ పఠాన్, ప్రవీణ్‌కుమార్‌తో మరికొందరు టీమిండియా మాజీ ప్లేయర్స్ ఈ లీగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వివిధ ఫ్రాంచైజ్‌లా ద్వారా వారు బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ క్రికెటర్లతో పాటు వివిధ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు కూడా ఈ ఐవీపీఎల్ లీగ్ ద్వారా అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. గిబ్స్‌తో పాటు మరికొందరు క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడనున్నట్లు సమాచారం.
ఐవీపీఎల్‌లోని జట్టు ఇవే...
తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు తలపడబోతున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ టీమ్‌లు ఇండియన్ వెటరన్ లీగ్‌లో తలపడబోతున్నాయి. ఈ టీ20 లీగ్‌ను డీడీ స్పోర్ట్స్‌తో పాటు యూరోస్పోర్టస్ ఛానెల్‌లో లైవ్ టెలికాస్ట్ ద్వారా అభిమానులు వీక్షించవచ్చు. ఐపీఎల్ తర్వాత ఇండియాలో బెస్ట్ లీగ్‌లో ఐవీపీఎల్ లీగ్‌ను నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇండియాతో పాటు వివిధ దేశాలకు చెందిన దిగ్గజ వెటరన్ క్రికెటర్లు ఈ లీగ్ ఆడబోతున్నారన్ వెటరన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ ప్రవీణ్ త్యాగి తెలిపాడు.
వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్ టీ20 క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్‌లో తెలంగాణ టైగర్స్‌కు క్రిస్ గేల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.