Rohit Sharma: క్రిస్ గేల్ క్రియేట్ చేసిన ఆ రికార్డును బ్రేక్ చేయాలని ఉంది: రోహిత్ శర్మ
Rohit Sharma: క్రిస్ గేల్ క్రియేట్ చేసిన ఆ రికార్డును బ్రేక్ చేయాలని ఉంది అని రోహిత్ శర్మ తన మనసులో మాట బయటపెట్టాడు. జర్నలిస్ట్ విమల్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్.. తనకు బంతిని బలంగా బాదడం ఇష్టమని చెప్పడం విశేషం.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అందరూ హిట్ మ్యాన్ అని పిలుస్తారు. అతడు కొట్టే సిక్సర్లు అలా ఉంటాయి మరి. అయితే ఈ సిక్స్ ల విషయంలో మాత్రం వెస్టిండీస్ మాజీ క్రికెటర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేయాలని ఉందని రోహిత్ చెప్పాడు. తనకు అంతగా కండబలం లేకపోయినా.. బంతిని బలంగా బాదడాన్ని ఇష్టపడతానని తెలిపాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్స్‌లు బాదిన రికార్డు ప్రస్తుతం క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 553 సిక్స్ లు కొట్టగా.. ప్రస్తుతం రోహిత్ 539 సిక్స్ లతో రెండోస్థానంలో ఉన్నాడు. మరో 15 సిక్స్ లు కొడితే గేల్ ను మించేస్తాడు. ఈ రికార్డు బ్రేక్ చేయడం రోహిత్ కు అంత పెద్ద కష్టం కూడా కాదు. వరల్డ్ కప్ ముగిసే లోపే రోహిత్ ఈ రికార్డు అందుకున్న ఆశ్చర్యం లేదు. అయితే ఈ రికార్డును బ్రేక్ చేయాలని ఉందని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రోహిత్ కూడా చెప్పాడు.
"క్రిస్ గేల్ సిక్స్ ల రికార్డు బ్రేక్ చేయాలని ఉంది. క్రిస్ గేల్ రికార్డు బ్రేక్ చేస్తానని నేను నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. ఇది సరదాగా ఉంది. నాకు అంత కండబలం లేదు. కానీ బంతిని బలంగా బాదడం ఇష్టం. నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు టైమింగ్ ముఖ్యమని చెప్పేవారు. గాల్లోకి షాట్లు అసలు ఆడొద్దని చెప్పేవారు" అని జర్నలిస్ట్ విమల్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ చెప్పాడు.
కాదని గాల్లోకి షాట్లు ఆడితే కోచ్ బయటకు పంపించేసే వాడని కూడా అతడు చెప్పడం విశేషం. "గాల్లోకి షాట్లు ఆడకూడదని చెప్పేవాళ్లు. తల నేరుగా ఉండాలి. బ్యాట్ శరీరానికి దగ్గరగా ఉండాలి. గ్రౌండ్ మీదుగానే షాట్లు కొట్టాలని అనేవాళ్లు. ఒకవేళ మేము గాల్లోకి ఆడితే కోచ్ మమ్మల్ని బయటకు పంపించేసేవాడు" అని రోహిత్ తెలిపాడు.
ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తో తనకున్న సంబంధాల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడాడు. "రాహుల్ ద్రవిడ్ పై నాకు చాలా గౌరవం ఉంది. ముందుగా ఓ వ్యక్తిగా ఆ తర్వాతే క్రికెటర్ గా అతనిపై నాకు గౌరవం. ఎందుకంటే ముందు మంచి మనిషిగా అయిన తర్వాత క్రికెటర్, ఫుట్ బాలర్ లేదా డాక్టర్ అవుతారు.
ద్రవిడ్ చాలా మంచి వ్యక్తి. అతనితో కలిసి ఎక్కువగా ఆడే అవకాశం రాలేదు కానీ.. రెండేళ్లుగా అతనితో కలిసి పని చేస్తున్నాను. ఏ ప్లేయర్ తోనూ సమాచార లోపం ఉండకూడదని ద్రవిడ్ నమ్ముతాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడాలన్నది అతని సింపుల్ రూల్. రాహుల్ భాయ్ తో పని చేయడాన్ని ఆస్వాదించాను" అని రోహిత్ చెప్పాడు.