Babar Azam: టీ20ల్లో కోహ్లికీ సాధ్యం కాని రికార్డు అందుకున్నబాబర్ ఆజం.. గేల్ తర్వాత అతడే
Babar Azam: టీ20ల్లో కోహ్లికీ సాధ్యం కాని రికార్డు అందుకున్నాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం. నిజానికి క్రిస్ గేల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్ బాబరే కావడం విశేషం.
Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం టీ20 క్రికెట్లో మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. టీ20 క్రికెట్ లో పది, అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో బ్యాటర్ గా అతడు నిలిచాడు. ఇంతకుముందు విండీస్ మాజీ బ్యాటర్ క్రిస్ గేల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్ లో భాగంగా కొలంబో స్ట్రైకర్స్ తరఫున గాలె టైటన్స్ పై బాబర్ సెంచరీ చేశాడు.
బాబర్ ఈ మ్యాచ్ లో కేవలం 59 బంతుల్లోనే 104 రన్స్ చేశాడు. దీంతో ఈ కొలంబో స్ట్రైకర్స్ 189 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. తొలిసారి ఈ సీజన్లో ఆడుతున్న బాబర్.. తన నాలుగో మ్యాచ్ లోనే సెంచరీ చేయడం విశేషం. ఓవరాల్ గా టీ20 ఫార్మాట్లో బాబర్ కు ఇది 10వ సెంచరీ. ఈ ఫార్మాట్లో ఏకంగా 22 సెంచరీలతో క్రిస్ గేల్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
నిజానికి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని కూడా బాబర్ మించిపోయాడు. టీ20 ఫార్మాట్లో కోహ్లి ఇప్పటి వరకూ 8 సెంచరీలు మాత్రమే చేశాడు. గేల్, బాబర్ ఆజం తర్వాత మైఖేల్ క్లింగర్, డేవిడ్ వార్నర్ లతో కలిసి కోహ్లి 8 సెంచరీలతో ఉన్నాడు. బాబర్ ఆజం ఈ 10 సెంచరీల్లో మూడు అంతర్జాతీయ క్రికెట్ లో చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ లో బాబర్ సెంచరీల సంఖ్య 30 కావడం విశేషం.
అంతేకాదు ఈ ఫార్మాట్లో బాబర్ ఆజమే పాకిస్థాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కలిగి ఉన్నాడు. సౌతాఫ్రికా బాబర్ చేసిన 122 పరుగులే టీ20 ఫార్మాట్లో పాకిస్థాన్ కు అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతర్జాతీయ టీ20ల్లో ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా 2 వేల పరుగులు మైలురాయి అందుకున్న బ్యాటర్ కూడా బాబర్ ఆజమే. అతడు 52వ ఇన్నింగ్స్ లో ఈ మైల్ స్టోన్ అందుకున్నాడు.
టీ20 వరల్డ్ కప్ ఒక ఎడిషన్ లో అత్యధిక పరుగులు, అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు కూడా బాబర్ పేరిటే ఉంది. 2021 వరల్డ్ కప్ లో అతడు 4 హాఫ్ సెంచరీలు సహా 303 పరుగులు చేశాడు.
సంబంధిత కథనం