Bhuvneshwar Kumar: ఆర్‌సీబీ గూటికి సన్‌రైజర్స్ టాప్ బౌలర్ - కోహ్లి టీమ్‌లోకి హార్దిక్ పాండ్య బ్రదర్
25 November 2024, 17:50 IST
Bhuvneshwar Kumar: పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇకపై సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మెంబర్ కాదు. ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ టీమ్ తరఫున భువనేశ్వర్ బరిలోకి దిగబోతున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పది కోట్లకు భువనేశ్వరన్‌ను ఆర్‌సీబీ సొంతం చేసుకున్నది.
భువనేశ్వర్ కుమార్
Bhuvneshwar Kumar: ఐపీఎల్‌లో ఇక నుంచి పేసర్ భువనేశ్వర్ కుమార్ ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లో కనిపించడు. దాదాపుగా పదేళ్లుగా ఎస్ఆర్‌హెచ్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ వస్తోన్న ఈ పేసర్ ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ తరఫున బరిలోకి దిగబోతున్నాడు.
ఆర్‌సీబీ 10.75 కోట్లు...
ఐపీఎల్ 2025 మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్‌ను ఆర్‌సీబీ 10.75 కోట్లకు దక్కించుకున్నది. రెండు కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్‌ను సొంతం చేసుకునేందుకు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడ్డాయి. పది కోట్ల వరకు ధరను పెంచుతూ పోయాయి. పది కోట్ల యాభై లక్షలకు లక్నో సొంతం చేసుకునే టైమ్‌లో చివరలో ఎంట్రీ ఇచ్చిన ఆర్‌సీబీ అతడిని 10.75 కోట్లకు ఎగరేసుకుపోయింది.
అప్పుడు 4 కోట్లు...
ఐపీఎల్ 2024 వేలంలో భువనేశ్వర్ కుమార్ 4.20 కోట్లు మాత్రమే ధర పలికాడు. ఈ సారి డబుల్ ప్రైజ్‌మనీ దక్కించుకోవడం గమనార్హం. వయసు, ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకొని భువనేశ్వర్ కుమార్‌ను సన్‌రైజర్స్ వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు అనుభవజ్ఞుడైన పేసర్ కోసం ఎదురుచూస్తున్న ఆర్‌సీబీ భువనేశ్వరన్‌ను వేలంలో భారీ ధరకు కొన్నట్లు చెబుతోన్నారు. ఎస్ఆర్‌హెచ్‌కు బద్ధశత్రువు గా అభిమానులు భావించే ఆర్‌సీబీ టీమ్‌లోకి భువనేశ్వర్ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. భువనేశ్వర్, హేజిల్‌వుడ్‌తో ఈ సారి ఆర్‌సీబీ బౌలింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది.
మూడు కోట్లు తక్కువకే అమ్ముడుపోయిన పాండ్య బ్రదర్..
భువనేశ్వర్ కుమార్‌తో పాటు హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య కూడా ఆర్‌సీబీ టీమ్‌లో చేరాడు. ఐపీఎల్ వేలంలో అతడిని 5.75 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకున్నది.
ఈ ఆల్‌రౌండర్ కోసం ఆర్‌సీబీతో పాటు రాజస్థాన్ కూడా పోటీపడింది. రాజస్థాన్ వెనక్కి తగ్గడంతో ఆర్‌సీబీ కృనాల్ పాండ్యను కొన్నది. గత ఏడాది కంటే ఈ వేలంలో మూడున్నర కోట్లు తక్కువకే కృనాల్ పాండ్య అమ్ముడుపోవడం గమనార్హం.
8.25 కోట్లు...
గత ఏడాది ఐపీఎల్ వేలంలో కృనాల్ పాండ్యను లక్నో సూపర్ జెయింట్స్ 8.25 కోట్లకు కొనుగులు చేసింది. రేటుకు తగ్గ ఆట లేకపోవడంలో కృనాల్‌ను లక్నో వదులుకుంది.