Babar Azam World Record: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం వరల్డ్ రికార్డు.. ధోనీనే మించిపోయాడు
17 June 2024, 8:09 IST
Babar Azam World Record: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం మరో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈసారి టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని అధిగమించి టీ20 వరల్డ్ కప్ లలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా నిలిచాడు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం వరల్డ్ రికార్డు.. ధోనీనే మించిపోయాడు
Babar Azam World Record: టీ20 వరల్డ్ కప్ 2024 నుంచి పాకిస్థాన్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టినా.. ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం ఓ వరల్డ్ రికార్డుతో టోర్నీ ముగించాడు. ఐర్లాండ్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ కు ఓ ఊరట విజయం లభించగా.. అందులో బాబర్ కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని అధిగమించాడు.
బాబర్ ఆజం రికార్డు
టీ20 వరల్డ్ కప్ తొలి రౌండ్ నుంచే పాకిస్థాన్ ఇంటికెళ్లిపోయింది. అయితే చివరి లీగ్ మ్యాచ్ లో మాత్రం ఐర్లాండ్ పై కిందా మీదా పడి గెలిచి కాస్త ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్ లో 34 బంతుల్లో 32 పరుగులు చేసిన కెప్టెన్ బాబర్ ఆజం.. విజయంలో కీలకపాత్ర పోషించాడు. 107 పరుగుల లక్ష్యాన్ని అతి కష్టమ్మీద 7 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో చేజ్ చేసింది.
ఈ మెగా టోర్నీలో విఫలమైన బాబర్ ఈ మ్యాచ్ లో చివరి వరకూ క్రీజులో నిలిచి తమ జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో ధోనీ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో పాకిస్థాన్ కెప్టెన్ టీ20 వరల్డ్ కప్ లలో 17 ఇన్నింగ్స్ లో 549 రన్స్ చేశాడు. దీంతో ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు.
గతంలో ఈ రికార్డు ధోనీ పేరిట ఉంది. అతడు 29 ఇన్నింగ్స్ లో 529 రన్స్ చేశాడు. 2016 నుంచి ఆ రికార్డు అలాగే ఉంది. ఇప్పుడా రికార్డును బాబర్ ఆజం బ్రేక్ చేశాడు. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా 527 రన్స్ తో ఉండగా.. సోమవారం (జూన్ 17) పపువా న్యూ గినియాతో మ్యాచ్ లో అతడు కూడా ధోనీ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది.
బాబర్‌పై తీవ్ర విమర్శలు
బాబర్ ఆజం వ్యక్తిగత రికార్డుల సంగతి పక్కన పెడితే.. పాకిస్థాన్ కెప్టెన్ గా మాత్రం అతడు దారుణంగా విఫలమవుతున్నాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్ లోనూ పాకిస్థాన్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా.. ఇప్పుడూ అదే పరిస్థితి ఎదురైంది. దీంతో అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీ20 ఫార్మాట్ నుంచి అతడు తప్పుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.
గతేడాది వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్న అతడు.. ఇప్పుడేం చేయబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. భవిష్యత్తులో ఏం చేయాలన్నది ఇంటికెళ్లిన తర్వాత ఆలోచించి చెబుతామని చివరి మ్యాచ్ తర్వాత బాబర్ అన్నాడు. తమ టీమ్ లో మంచి ప్లేయర్స్ ఉన్నారని, అయితే ఓ జట్టుగా కలిసి సక్సెస్ సాధించలేకపోయినట్లు చెప్పాడు.
చివరి మ్యాచ్ లో ఐర్లాండ్ పై విజయం ద్వారా కనీసం గ్రూప్ ఎలో అట్టడుగున నిలిచే ప్రమాదం నుంచి ఆ టీమ్ బయటపడింది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించడం ద్వారా బాబర్ కాస్తయినా అభిమానుల ఆగ్రహం నుంచి బయటపడ్డాడు. అయితే ఆ టీమ్ కెప్టెన్సీ విషయమై పీసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
టాపిక్