AUS vs WI: ఆరు ఓవర్లలోనే ముగిసిన వన్డే మ్యాచ్ - వెస్టిండీస్‌ను దారుణంగా ట్రోల్ చేస్తోన్న క్రికెట్ ఫ్యాన్స్
07 February 2024, 12:38 IST
AUS vs WI: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ చిత్తుగా ఓడింది. వెస్టిండీస్ విధించిన టార్గెట్‌ను కేవలం 6.5 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఛేదించింది.
ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్
AUS vs WI: ఆస్ట్రేలియా చేతిలో వెస్టిండీస్ విజయాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్‌ను దారుణంగా ఓడించిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది . ఈ వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ విధించిన సింపుల్ టార్గెట్‌ను ఆస్ట్రేలియా కేవలం 6.5 ఓవర్లలోనే ఛేదించింది. అతి తక్కువ ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా వన్డేల్లో బాల్స్ పరంగా ఆస్ట్రేలియాకు ఇదే అతి పెద్ద విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 259 బాల్స్ మిగిలుండగానే టార్గెట్‌ను ఛేదించింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్టు కలిసి కేవలం 31 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేశాయి. మూడు గంటల్లోనే మ్యాచ్ ముగిసింది.
వెస్టిండీస్ 86 పరుగులకు ఆలౌట్...
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 86 పరుగులకే ఆలౌటైంది. అతాంజే 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతాంజే తో పాటు ఛేజ్ 12 పరుగులు, కార్టీ 10 పరుగులు చేశారు.వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్‌లో ఈ ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్‌లో నలుగురు డకౌట్ అయ్యారు. 24.1 ఓవర్లలో 86 పరుగులకు వెస్టిండీస్ ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో బార్ట్‌లెట్ నాలుగు వికెట్లుతీశాడు. మోరీస్,జంపా తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
6.5 ఓవర్లలోనే...
ఈ సింపుల్ టార్గెట్‌ను 6.5 ఓవర్లలోనే రెండు కోల్పోయి ఆస్ట్రేలియా ఛేదించింది. ఓపెనర్ మెక్‌గార్క్ 18 బాల్స్‌లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 41 రన్స్ చేశాడు. ఇంగ్లీస్ 16 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 రన్స్‌తో చెలరేగారు. వీరిద్దరి జోరుతో 43.1 ఓవర్ మిగిలుండగానే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. బార్ట్‌లెట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.
గల్లీ క్రికెట్...
మూడో వన్డేలో చిత్తుగా ఓడిన వెస్టిండీస్‌ను క్రికెట్ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. ఇది ఇంటర్‌నేషనల్ మ్యాచ్‌లా లేదు. గల్లీ క్రికెట్ మ్యాచ్‌లా ఉందని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. టీ20లకు తప్ప వన్డేలు, టెస్ట్‌లకు వెస్టిండీస్ క్రికెటర్లు పనికిరారంటూ కామెంట్స్ చేస్తున్నారు. వరల్డ్ కప్ గెలిచిన జట్టు ఇప్పుడు ఈ స్థాయికి పడిపోవడం దారుణం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసిన వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో మాత్రం 3-0 తో కోల్పోయింది. ఒక్క మ్యాచ్‌లో కూడా పోరాడలేకపోయింది. రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఫిబ్రవరి 9 నుంచి మొదలుకానుంది.