Swiggy layoffs 2023 : స్విగ్గీకి ‘లేఆఫ్’ సెగ.. ఆ 380మంది ఇంటికి!
20 January 2023, 13:19 IST
- Swiggy layoffs 2023 : స్విగ్గీ సైతం జాబ్ కట్స్ చేపట్టింది. సంస్థకు చెందిన 380మందిని ఉద్యోగంలో నుంచి తొలగించింది.
స్విగ్గీకి 'లేఆఫ్' సెగ.. 380మంది ఇంటికి!
Swiggy layoffs 2023 : కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్న సంస్థల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సైతం తాజాగా ఈ జాబితాలోకి చేరింది. సంస్థకు చెందిన 380మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది స్విగ్గీ.
కారణం అదే..!
ఇండియాలో లీడింగ్ ఫుడ్ డెలివరీ సర్వీసుగా స్విగ్గీకి మంచి గుర్తింపు ఉంది. ఈ సంస్థలో 6వేలకుపైగా మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా వీరిలో 380మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు.
Swiggy layoffs latest news : "రీస్ట్రక్చరింగ్ ప్రక్రియలో భాగంగా.. మా బృందం సైజును తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాము. అందుకే ఈ కఠిన నిర్ణయాన్ని అమలు చేయక తప్పడం లేదు. ప్రక్రియలో భాగంగా.. 380మంది టాలెంటెడ్ స్విగ్గిస్టర్స్ (ఉద్యోగులు)ను తొలగిస్తున్నాము. అన్ని మార్గాలను అన్వేషించిన తర్వాత, వేరే ఆప్షన్లు లేకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది," అని స్విగ్గీ ఈసీఓ, కో- ఫౌండర్ శ్రీహర్ష మజెస్టీ పేర్కొన్నారు. ఫుడ్ డెలవరీ బిజినెస్ గ్రోత్ తగ్గుతుండటం.. ఉద్యోగుల తొలగింపునకు ఉన్న కారణాల్లో ఒకటని ఆయన స్పష్టం చేశారు.
"మా దగ్గర ఉన్న నిధులతో.. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము. కానీ ఇలా ఎక్కువ రోజులు నడపలేము. అందుకే.. దీర్ఘకాలిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, సమర్థవంతంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాము. గతంలో చాలా ఎక్కువ హైరింగ్ చేసుకున్నాము. ఓవర్‌హైరింగ్ విషయంలో తప్పు జరిగింది. అలా చేసి ఉండకూడదు," అని మజెస్టీ తెలిపారు.
Swiggy Instamart : ఉద్యోగుల తొలగింపుతో పాటు కొన్ని ప్రాజెక్టులను సైతం స్విగ్గీ పక్కనపెడుతోంది.
"మేము నడుపుతున్న మీట్ మార్కెట్‌ప్లేస్‌ను కూడా త్వరలోనే మూసేస్తున్నాము. మా బృందం చాలా కష్టపడినప్పటికీ.. ఆశించినమేర ఫలితాలు దక్కలేదు. కానీ వినియోగదారుల కోసం.. ఇన్‌స్టామార్ట్‌లో మాంసం డెలివరీని కొనసాగిస్తాము," అని స్విగ్గీ సీఈఓ మజెస్టీ స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి..!
Microsoft layoffs 2023 : ప్రపంచవ్యాప్తంగా 'లేఆఫ్' మాట ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. 2022లో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2023లోనూ ఇది కొనసాగుతోంది. అనేక టెక్ కంపెనీలు.. కాస్ట్ కటింగ్‌పై దృష్టిపెట్టడం ఇందుకు కారణం.
ఈ ఏడాది తొలి నెల తొలి మూడు వారాల్లో.. ఇండియన్ స్టార్టప్స్‌లో పనిచేస్తున్న 1,500మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆమెరికా ఆధారిత కంపెనీల్లో ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మైక్రోసాఫ్ట్ అనూహ్య ప్రకటనతో.. ఆ ఒక్క సంస్థ నుంచే 10వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఫలితంగా ఇటు ఇండియా, అటు అమెరికావ్యాప్తంగా జాబ్స్ కోల్పోతున్న వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండనుంది.