Microsoft Layoffs: భారీగా ఉద్యోగులను తొలగించేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధం! నేటి నుంచే లేఆఫ్స్: వివరాలివే-microsoft set to layoff more than 10000 employees job cuts may start today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Microsoft Set To Layoff More Than 10000 Employees Job Cuts May Start Today

Microsoft Layoffs: భారీగా ఉద్యోగులను తొలగించేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధం! నేటి నుంచే లేఆఫ్స్: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 18, 2023 08:29 AM IST

Microsoft Layoffs: ఉద్యోగులను తొలగించేందుకు ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ సిద్ధమైందని రిపోర్ట్ వచ్చింది. నేటి నుంచి తీసివేతల ప్రక్రియ మొదలవుతుందని తెలుస్తోంది.

Microsoft Layoffs: భారీగా ఉద్యోగులను తొలగించేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధం!
Microsoft Layoffs: భారీగా ఉద్యోగులను తొలగించేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధం! (AFP)

Microsoft Layoffs: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు (Job Cuts) రెడీ అయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్ డివిజన్‍లో ఎంప్లాయిస్‍ను తగ్గించుకునేందుకు ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా కంపెనీలో సుమారు 5 శాతం మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తాజాగా తొలగించనుందని బ్లూమ్‍బర్గ్ న్యూస్ రిపోర్ట్ వెల్లడించింది. అంటే మొత్తంగా 11వేల మంది వరకు ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఇంటికి పంపనుంది. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

నేటి నుంచే..

Microsoft Layoffs: ఉద్యోగుల తొలగింపును మైక్రోసాఫ్ట్ నేటి నుంచే మొదలుపెడుతుందని బ్లూమ్‍బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. ముందుగా ఇంజినీరింగ్ డివిజన్‍లోనే ఉద్యోగుల కోత ఉంటుందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 2,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. గత సంవత్సరంలోనూ రెండుసార్లు సిబ్బందిని కాస్త తగ్గించుకుంది మైక్రోసాఫ్ట్. అయితే, ఇప్పుడు తాజాగా చేపట్టనున్న ఉద్యోగాల తొలగింపు భారీగా ఉంది. ఏకంగా 5 శాతం అంటే సుమారు 11వేల మందిని తీసేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. నేడే (జనవరి 18) మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయాన్ని ప్రకటించనుందని సమాచారం. గత సంవత్సరం చివరి త్రైమాసికం ఫలితాలను మైక్రోసాఫ్ట్ వచ్చే వారమే ప్రకటించనుంది.

కారణాలివే..!

Microsoft Job cuts: ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి, ఆర్థిక మాంద్యం భయాలతో మైక్రోసాఫ్ట్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు మొగ్గుచూపుతోందని తెలుస్తోంది. మరోవైపు ద్రవ్యోల్బణం కారణంగా డిమాండ్ తగ్గుతుండడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. గతేడాది అక్టోబర్‌లో 1,000 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ సాగనంపింది. అంతకు ముందు ఆగస్టులోనూ కొందరిని విధుల నుంచి తప్పించింది. అయితే, తాజా లేఆఫ్ మాత్రం భారీగా ఉండనుంది.

Layoff Trend: 2023లోనూ ఈ ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ఈనెల తొలి వారంలోనే ప్రముఖ కంపెనీల్లో ప్రపంచ వ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. 30 కంపెనీలు.. జనవరి తొలి ఆరు రోజుల్లో ఇంత మంది ఎంప్లాయిస్‍ను తీసేశాయి. టెక్ సంస్థలన్నీ 5 నుంచి 10 శాతం వరకు సిబ్బందిని తీసేయాలని ఆలోచిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా 18వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఫేస్‍బుక్ పేరెంట్ కంపెనీ మెటా 11వేలకు పైగా ఉద్యోగులను తీసేసింది. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్.. ఆ కంపెనీలో ఏకంగా 50 శాతం మంది అంటే సుమారు 3,700 మంది ఎంప్లాయిస్‍ను తీసేశారు. వీటితో పాటు చాలా ప్రముఖ కంపెనీలు కూడా సిబ్బందిలో కోత విధించుకుంటున్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. దీనివల్ల, వేలాది మంది ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం