Hindenburg tweet : హిండెన్‌బర్గ్ 4 పదాల ట్వీట్- ఇన్వెస్టర్స్‌లో గుబులు- స్టాక్ మార్కెట్లపై మరో పిడుగు?
10 August 2024, 12:49 IST
HIndenburg twitter : సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరోమారు భారత స్టాక్ మార్కెట్లను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు హిండెన్‌బర్గ్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
భారత్‌పై మరో పిడుగు తప్పదా?
భారత స్టాక్ మార్కెట్లకు హిండెన్‌బర్గ్ పేరు ఒక పీడకల లాంటింది. అదానీ గ్రూప్‌పై సంచలన నివేదికను బయపెట్టి, దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలడానికి ఈ సంస్థ కారణం. అయితే అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇప్పుడు భారత్‌పై మరో బాంబ్ వేసేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు సంస్థ తాజాగా ఎక్స్‌లో చేసిన ఓ క్రిప్టిక్ ట్వీట్ వైరల్‌గా మారింది.
'సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా (త్వరలో భారీ విషయం జరగబోతోంది),' అని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఏం చేయబోతోందో? ఎవరి మీద పిడుగు పడబోతోందో? అని ఆందోళనలు మొదలయ్యాయి.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అంటే ఎవరు?
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఎల్ఎల్సి అనేది అమెరికాకు చెందిన పెట్టుబడి పరిశోధన, షార్ట్ సెల్లింగ్ సంస్థ. ఇది కంపెనీ స్టాక్స్‌లో ఎంట్రీ తీసుకున్న అనంతరం కంపెనీల్లో మోసాలు లేదా అవినీతిని బహిర్గతం చేస్తూ నివేదికలను ప్రచురిస్తుంది. స్టాక్స్ పతనమైన తర్వాత షార్ట్ సెల్లింగ్ ద్వారా లాభపడుతుంది.
2017లో నేథన్ ఆండర్సన్ అనే వ్యక్తి ఈ సంస్థను స్థాపించారు. ఇందులో కేవలం 10 మంది ఉద్యోగులే ఉంటారని సమాచారం. కానీ వీరు చాలా రీసెర్చ్ చేసి, కంపెనీల అవినీతిని బయటపెడతారని అభిప్రాయాలు ఉన్నాయి.
షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి?
షార్ట్ సెల్లింగ్ అనేది స్టాక్ మార్కెట్లో సహజమైన ప్రక్రియ. ఏదైనా కంపెనీ స్టాక్ స్వల్ప కాలంలో పడుతుందని ముందుగానే అంచనా వేసి, వాటిని విక్రయించడం షార్ట్ సెల్లింగ్. షేర్లు పడిన తర్వాత వచ్చే లాభాలను తీసుకుని, కొనుగోలు చేసి, షార్ట్ సెల్లింగ్ పొజిషన్స్‌ని క్లోజ్ చేస్తారు.
గతేడాది అదానీ గ్రూప్‌పై సంచలన నివేదికను బయటపెట్టింది హిండెన్‌బర్గ్ రీసెర్చ్. సంస్థలో అవకతవకలు జరిగాయని ఆరోపించింది. ఆ సమయంలో అదానీ స్టాక్స్‌తో పాటు మొత్తం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాయి. కానీ తాము ఎలాంటి తప్పు చేయలేదని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ చెప్పుకొచ్చారు. స్టాక్స్ నిదానంగా మళ్లీ పూర్వ స్థితికి చేరుకున్నాయి. అంతేకాదు, చాలా రెట్లు పెరిగాయి కూడా!
ఇప్పుడు హిండెన్‌బర్గ్ చేసిన ట్వీట్ మళ్లీ ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఏ కంపెనీని ఆ సంస్థ టార్గెట్ చేస్తుందో అని భయాలు మొదలయ్యాయి. అదే సమయంలో, హిండెన్‌బర్గ్ ఏం చేసినా, భారత స్టాక్ మార్కెట్లను కూల్చలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన విశ్వసనీయతను కోల్పోయిందని అంటున్నారు.
“భారత మార్కెట్‌ని హిండెన్‌బర్గ్ మళ్లీ షార్ట్ చేస్తోంది. కానీ ఆ సంస్థకు ఒక విషయం అర్థం కావడం లేదు. 2023 జనవరిలో తన చివరి నివేదిక బయటపెట్టినప్పుడు మార్కెట్లు పడ్డాయన్నది నిజమే కానీ. ఆ తర్వాత వెంటనే రికవర్ అయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 20వేల పాయింట్లు పెరిగింది. ఇన్వెస్టర్లు హిండెన్‌బర్గ్‌కి భయపడాల్సిన పని లేదు,” అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు.
“ఈసారి నిఫ్టీ 30,000 మార్క్‌ని టచ్ చేస్తుంది,” అని మరొకరు రాసుకొచ్చారు.